
తణుకు: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంపై ఉన్న అభిమానంతోనే వైఎస్ విజయమ్మ చారిటబుల్ ట్రస్టు ఏర్పాటు చేశానని తణుకు పట్టణానికి చెందిన అంబడిపూడి వీరభద్రావతి తెలిపారు. 2012లో విజయమ్మ పేరుతో ట్రస్టు ప్రారంభించినప్పటి నుంచి తాను ట్రస్టీగా వ్యవహరిస్తున్నానని ఆమె చెప్పారు. అయితే ఆర్థిక ఇబ్బందుల కారణంగా గతేడాది 2018 జనవరిలో ట్రస్టు కార్యకలాపాలను నిలిపేశానన్నారు.
ట్రస్టు ఆధ్వర్యంలో కుట్టుమిషన్ నేర్పించడంతోపాటు ఉచిత వైద్యశిబిరాల నిర్వహణ, దుస్తులు తదితరాలు పంపిణీ చేశామని చెప్పారు. సొంత ఖర్చులతోనే సేవా కార్యక్రమాలు చేశామని వివరించారు. వైఎస్సార్ కుటుంబం నుంచి గానీ, ఇతరత్రా వేరే విధంగా గానీ ఎలాంటి నిధులూ రాలేదని వీరభద్రావతి స్పష్టం చేశారు. వైఎస్సార్ కుటుంబంతో ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. 2018 జనవరిలోనే ట్రస్టు మూసివేస్తున్నట్లు లిఖితపూర్వకంగా సంబంధిత అధికారులకు తెలియజేశామన్నారు.