‘చంద్రన్న సంక్రాంతి’ ఎయిడెడ్ టీచర్లకు శాపం
మూడు నెలలుగా జీతాలివ్వని ప్రభుత్వం
పండుగ మాసంలో అష్టకష్టాలు పడుతున్న టీచర్లు
విశాఖ అర్బన్: మూడు నెలలుగా జీతాలు లేక ఎయిడెడ్ టీచర్ల పరిస్థితి దయనీయంగా మారింది. సర్కారు నిర్లక్ష్యం కారణంగా పెద్ద పండుగకు కూడా పస్తులు ఉండాల్సిన పరిస్థితి దాపురించింది. ఒకవైపు సంక్రాంతి వారోత్సవాలు జరుపుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం చెబుతూ.. ఉపాధ్యాయుల జీతాలకు నిధులు మంజూరుచేయకుండా వారిని అష్టకష్టాలకు గురిచేస్తోంది. ఎయిడెడ్ టీచర్ల సమస్యలు పరిష్కరించేందుకు త్వరలోనే సమావేశం నిర్వహిస్తామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు గత ఆగస్టులో హామీ ఇవ్వగా.. అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు జీతాలు ఇవ్వకపోవడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఎయిడెడ్ టీచర్లు ఆందోళన చేపట్టే దిశగా కార్యాచరణకు సిద్ధమవుతున్నారు.
అప్పుల ఊబిలో ఉపాధ్యాయులు
రాష్ట్ర వ్యాప్తంగా ఎయిడెడ్ ప్రైమరీ స్కూళ్లు 1572, అప్పర్ ప్రైమరీ స్కూళ్లు 291, హై స్కూళ్లు 476 మొత్తం 2339 స్కూళ్లు ఉన్నాయి. వీటిలో ప్రైమరీలో 3661 మంది, అప్పర్ ప్రైమరీలో 1401, హైస్కూల్‌లో 3302 మంది మొత్తం 8364 ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. వీరిపై తెలుగుదేశం ప్రభుత్వం చిన్న చూపు చూస్తోంది. అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు వీరి జీతాలకు నిధులు మంజూరు చేయలేదు. దీంతో ఉపాధ్యాయులు అప్పులు చేస్తూ కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. జీతాలు లేకపోవడంతో దసరా, క్రిస్మస్, న్యూఇయర్ వేడుకలకు దూరంగా ఉన్న ఎయిడెడ్ టీచర్లు కనీసం పెద్ద పండుగ సంక్రాంతికైనా జీతాలు వస్తాయని ఆశగా చూశారు. కానీ ప్రభుత్వం ఈ నెల కూడా నిధులు మంజూరు చేయలేదు.
సంక్రాంతి వారోత్సవాలు చేసుకొనేదెలా!
రాష్ట్ర ప్రజలు సంక్రాంతి వారోత్సవాలు చేసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతుండగా.. జీతాలు లేకుండా తామెలా పండుగ చేసుకోవాలని ఎయిడెడ్ ఉపాధ్యాయులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. వెంటనే జీతాలు ఇవ్వాలని ఎయిడెడ్ స్కూల్స్ టీచర్స్ గిల్డ్ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధులు ప్రభుత్వానికి లేఖ రాసినప్పటికీ ఎటువంటి స్పందన లేదని ఇప్పటికైనా ప్రభుత్వం ఈ విషయంపై దృష్టి సారించని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని ఉపాధ్యాయులు హెచ్చరిస్తున్నారు.
పండగకూ పస్తులే!
Published Tue, Jan 13 2015 12:51 AM | Last Updated on Fri, Aug 17 2018 6:08 PM
Advertisement
Advertisement