సాంబమూర్తినగర్ (కాకినాడ) : ఎన్నికల హామీని ఏట్లో కలిపారని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు)పై డెయిరీ ఫారం సెంటర్‌లోని రాజీవ్ గృహకల్పవాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన తీరును నిరసిస్తూ బుధవారం ఆందోళనకు దిగారు. ఇందుకు సంబంధించి గృహకల్ప లబ్ధిదారులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. డెయిరీఫారం సెంటర్‌లోని రాజీవ్ గృహకల్పలో 2003లో అప్పటి ప్రభుత్వం 4,800 గృహాలను నిర్మించి నిరుపేదలకు అందించింది. లబ్ధిదారులు కొంత సొమ్ము చెల్లించగా మిగిలినది వాయిదా పద్ధతిలో చెల్లించేందుకు వివిధ బ్యాంకులు నిబంధనల మేరకు రుణాలు మంజూరు చేశాయి. ఒక్కో లబ్ధిదారుడు నెలకు రూ.500 చెల్లించాల్సి ఉంది. ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన కొండబాబు రుణాలు తిరిగి చెల్లించవద్దని, తాను ఎమ్మెల్యేగా గెలిస్తే రద్దు చేయిస్తానని హామీ ఇచ్చారు.
ఆ హామీతో తమ రుణాలు రద్దవుతాయని ఆశించిన లబ్ధిదారులు వాటిని చెల్లించడం మానేశారు. కాగా గృహ నిర్మాణ శాఖ, బ్యాంకుల అధికారులు బుధవారం అక్కడకు చేరుకుని రుణాలు చెల్లించలేదంటూ ఒక్కో ఇంటికీ తాళాలు వేయడం ప్రారంభించారు. దీనిపై ఆగ్రహించిన లబ్ధిదారులు రోడ్డుపై బైఠాయించి అధికారులను అడ్డుకున్నారు. ఏళ్ల తరబడి రుణాల వసూలుకు రాని బ్యాంకు అధికారులు అకస్మాత్తుగా రావడం ఏమిటని ప్రశ్నించారు. రాజకీయ కక్షసాధింపులో భాగంగానే ఈ విధంగా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యే ఉద్దేశపూర్వకంగానే కొందరి గృహాలకు తాళాలు వేయిస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్యే రాజకీయ దురుద్దేశానికి అధికారులు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. పరిస్థితి అదుపు తప్పుతుండడంతో అధికారులు ఆందోళన చేస్తున్న లబ్ధిదారులతో చర్చించారు. తాళాలు తీసే వరకూ ఆందోళన విరమించేది లేదని, అధికారులను కదలనివ్వమని భీష్మించడంతో అధికారులు ఇళ్లకు వేసిన తాళాలు తీయించారు. దాంతో వివాదం సద్దుమణిగింది.
ఎన్నికల హామీని ఏట్లో కలిపారు..
Published Thu, Mar 5 2015 1:45 AM | Last Updated on Tue, Aug 14 2018 4:39 PM
Advertisement
Advertisement