రేపటి నుంచి పదో తరగతి పరీక్ష పత్రాల మూల్యాంకనం
ఒంగోలు ఒన్‌టౌన్, న్యూస్‌లైన్: జిల్లాలో పదో తరగతి పరీక్ష పత్రాల మూల్యాంకనం ఈ నెల 16 నుంచి స్థానిక డీఆర్‌ఆర్‌ఎం హైస్కూలులో నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ ఎ.రాజేశ్వరరావు తెలిపారు.స్థానిక డీఆర్‌ఆర్‌ఎం హైస్కూలులో సోమవారం సాయంత్రం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. పరీక్ష పత్రాల మూల్యాంకనానికి చేసిన ఏర్పాట్ల గురించి డీఈఓ వివరించారు.
1521 మంది చీఫ్ ఎగ్జామినర్లు, అసిస్టెంట్ ఎగ్జామినర్లను, 450 మంది స్పెషల్ అసిస్టెంట్లను నియమించామన్నారు. వాస్తవంగా అవసరమైన దానికంటే 50 శాతం మందిని అదనంగా నియమించామని చెప్పారు. మూల్యాంకన విధుల మినహాయింపు కోసం 10 శాతం అంటే 151 మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. వీరందరికీ మినహాయింపు ఇచ్చినట్లు డీఈఓ చెప్పారు. మూల్యాంకన విధులకు అప్పటికప్పుడు (వరండా అపాయింట్‌మెంట్) ఎవరినీ నియమించరన్నారు.
మూల్యాంకన విధులకు మంగళవారం నుంచి ఎవరికీ మినహాయింపు ఇచ్చేది లేదని, వారికి సార్వత్రిక ఎన్నికల డ్యూటీలు వస్తే తప్పనిసరిగా దానికి సంబంధించిన శిక్షణకు హాజరుకావాల్సిందేనన్నారు. ఎన్నికల శిక్షణ రోజు మూల్యాంకన విధులకు మినహాయింపు ఇస్తామన్నారు. 10వ తరగతి పరీక్ష పత్రాల మూల్యాంకనం జరిగే డీఆర్‌ఆర్ ఎం హైస్కూలులో చదువుతున్న 6,7,8,9 తరగతుల విద్యార్థులకు ఉదయం 7 నుంచి 9.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించాలని ఆదేశించినట్లు రాజేశ్వరరావు తెలిపారు.
సబ్జెక్టు వారీగా...
మూల్యాంకనానికి 1521 మంది సబ్జెక్టు టీచర్లను నియమించారు. వీరిలో తెలుగు 1టీకి 77 మంది 2టీకి 161 మంది, 3టీకి 14 మంది, హిందీ 9హెచ్‌కి 112 మంది, ఇంగ్లిష్ 13ఇకి 91 మంది, 14ఇకి 63 మంది, 29ఇకి 42 మంది, 30ఇకి 70 మంది, గణితం 15టీ/ఇకి 133 మంది, 16టీ/ఇకి 154 మంది, ఫిజికల్ సైన్స్ 19టీ/ఇకి 119 మంది, బయోలాజికల్ సైన్సు 20టీ/ఇకి 191 మంది, సోషల్ స్టడీస్ 21టీ/ఇకి 154 మంది, 22టీ/ఇకి 140 మందిని నియమించారు. సోషల్ స్టడీస్ రెండవ పేపర్ మూల్యాంకనం ఈ నెల 17 నుంచి ప్రారంభమవుతుందన్నారు.
ఆ పేపర్‌కు నియమితులైన వారు 17న విధులకు రిపోర్టు చేయాలన్నారు. మిగిలిన అన్ని పేపర్ల మూల్యాంకనానికి నియమితులైన వారు 16వ తేదీన ఉదయం 9 గంటలకు రిపోర్టు చేయాలని చెప్పారు. మూల్యాంకనానికి నియమితులైన వారందరినీ ప్రధానోపాధ్యాయులు పాఠశాల విధుల నుంచి రిలీవ్ చేసి పంపించాలని డీఈఓ కోరారు. విలేకర్ల సమావేశంలో ఉపవిద్యాధికారి వెంకట్రావు, ఏసీసీ నాగప్ప, డీసీఈబీ కార్యదర్శి జి. పుల్లారెడ్డి పాల్గొన్నారు.