పరిశ్రమలకు చోటేది?
⇒ రాయితీలకు కోత..
⇒ ఇవ్వాల్సిన రాయితీలు రూ. 1600 కోట్లు
⇒ ఇచ్చింది రూ. 564 కోట్లే
⇒ చిన్న పరిశ్రమకు దక్కని చేయూత
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొస్తాం అని చెబుతున్న ప్రభుత్వం.. పరిశ్రమలకు రాయితీల విషయంలోగానీ, చిన్న పరిశ్రమలకు చేయూత విష యంలోగానీ ఏమాత్రం ఆశాజనకంగా స్పందిం చడంలేదు. వార్షిక బడ్జెట్ కేటాయింపులను చూస్తే ఆ విషయం స్పష్టమవుతోంది. కొత్తగా వచ్చే పరి శ్రమలకు ఈ కేటాయింపుల్లో రాయితీలు వచ్చే అవకాశం లేదని పారిశ్రామిక వర్గాలు అంటున్నాయి. అన్ని విభాగాలకు కలిపి పరిశ్రమలశాఖకు ప్రభుత్వం రూ. 1,300 కోట్లు కేటాయించింది. ఇందులో పారిశ్రామిక రాయితీలకు కేవలం రూ. 564 కోట్లు మాత్రమే. నిజానికి ఈ ఏడాది మార్చి నాటికి రూ. 1,600 కోట్ల పారిశ్రామిక రాయితీలు ఇవ్వాలని సంబంధిత శాఖ ప్రభుత్వానికి ప్రతిపా దించింది.
అయితే ఈ ప్రతిపాదనలను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. ఇదిలా ఉంటే.. ఈ ఏడాది భారీగా పెట్టుబడులు వస్తాయని, కొత్త యూనిట్లు ఉత్పత్తి ప్రారంభిస్తాయని ప్రభుత్వమే చెబుతోంది. 2015–20 పారిశ్రామిక విధానం ప్రకారం కొత్త యూనిట్లు ఉత్పత్తిలోకి వస్తే కనీసం మరో రూ.వెయ్యి కోట్లు నిధులు అవసరమవుతాయని పరిశ్రమలశాఖ అధికారులు చెబుతున్నారు. ఏడాది క్రితం సబ్సిడీకే దిక్కులేనప్పుడు కొత్తవాటి పరిస్థితి ఏమిటనే సందేహాలు పరిశ్రమ వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు సర్కారు కేవలం రూ.125 కోట్లు కేటాయించింది.
అయితే ఎంఎస్‌ఎంఈ పరిస్థితి గడచిన రెండేళ్లుగా దయనీయంగా తయారైంది. లక్ష యూనిట్లు రూ. 3 వేల కోట్లు అప్పుల్లో ఉన్నట్టు ఎస్‌ఎల్‌బీసీ ఇటీవల ఆర్‌బీఐకి తెలిపింది. నిరర్థక ఆస్తుల జాబితాలో చేరిన ఈ లక్ష యూనిట్లలో దాదాపు 2 లక్షల మంది ఉపాధి కోల్పోయారు. ఇలాంటి పరిస్థితుల్లో కేవలం రూ. 125 కోట్లు ఇవ్వడం వల్ల ప్రయోజనం ఉండదని ఎంఎస్‌ఎంఈ నిపుణులు అంటున్నారు. అదీగాక ఈ సంవత్సరం ఏపీ డిస్కమ్‌లు పెద్ద ఎత్తున ఫిక్స్‌డ్ చార్జీల పెంపునకు ప్రతిపాదనలు పంపాయి. ఇప్పుడున్న విద్యుత్ చార్జీలు కనీసం 200 రెట్లు పెరిగే వీలుందంటున్నారు.
ఎస్సీ పారిశ్రామికవేత్తలకు మద్దతేదీ..?
ఎస్సీ పారిశ్రామిక వేత్తలకు ఈ ఏడాది రూ. 365 కోట్ల నిధులు రాయితీల కింద కావాలని పరిశ్రమలశాఖ ప్రతిపాదిస్తే, సర్కారు మాత్రం రూ. 165 కోట్లు ఇచ్చింది. విశాఖ–చెన్నై కారిడార్‌కు గతంలో రూ. 50 కోట్లు కేటాయించిన సర్కారు.. ఈసారి రూ. 369 కోట్లు కేటాయించింది. ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ) రూ. 1700 కోట్ల రుణం ఇస్తుందని భావించి కారిడార్‌కు కేటాయింపులు పెంచారు. అయితే ఇప్పటికే కారిడార్ పరిధిలో ప్రాజెక్టులకు డీపీఆర్‌లు కూడా పూర్తికాలేదని ఏడీబీ అంటోంది. దీన్నిబట్టి కేటాయించిన నిధులు ఏమేర ఉపయోగపడతాయనేది ప్రశ్నార్థకమే.