
ప్రతి 3 నె లలకు రూ.30 కోట్ల నష్టం
పాలకొండ: ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ జిల్లాలో నష్టాల ఊబిలో కూరుకుపోతోంది. రోజురోజుకు సంస్థ నష్టాలబాట పడుతోంది. అభివృద్ధి కోసం చేపడుతున్న చర్యలు ఫలించకపోగా కార్మికులు ప్రభుత్వంలో విలీనం వైపే మొగ్గు చూపిస్తున్నారు. దీంతో యాజమాన్యం, కార్మికులకు మధ్య అంతరాయం పెరుగుతూ వస్తోంది. జిల్లాలో శ్రీకాకుళం-1,2 డిపోలతో పాటు పాలకొండ, పలాస, టెక్కలి డిపోలు ఉండగా వీటి పరిధిలో 426 బస్సులు ప్రజల అవసరాల కోసం వివిధ రహదారుల్లో తిప్పుతున్నారు. వీటి పరిధిలో సుమారు 2,500 మంది కార్మికులు పనిచేస్తున్నారు. గత కొంతకాలంగా బస్సులు మొరాయిస్తుండడం, ఆదాయం తగ్గుతూ రావడం జరుగుతోంది. ప్రతి మూడు నెలలకు జిల్లా నుంచి రూ.30 కోట్ల వరకు నష్టం వాటిల్లుతుంతోందని అంచనా.
నష్టాల నుంచి బయటపడేందుకు పలుమార్లు సంస్థ చేపట్టిన చర్యలు ఫలితాన్ని ఇవ్వలేదు. ఆర్టీసీ వైపు ప్రజలను ఆకర్షించుకొనే పథకాలు ప్రవేశపెట్టినా వీటివల్ల ఒనగూరేది లేదని కార్మికులు చెబుతున్నారు. ఉన్నత స్థాయిలో ఉన్న యాజమాన్యం అంకిత భావంతో పనిచేయడంలేదని.. కేవలం తమనే బలిచేస్తున్నారని కార్మికులు ఆరోపిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో సంస్థను ప్రభుత్వం విలీనం చేసుకొని సేవలందిస్తే తప్ప ఆర్‌టీసీకి మనుగడ కష్టమని ఆర్టీసీ ఎంప్లాయీస్ రాష్ర్ట నాయకులు పలిశెట్టి దామోదరరావు అంటున్నారు. ఆర్టీసీ నష్టాలబాట పట్టడానికి యాజమాన్యమే కారణమని ఎంప్లాయీస్ నెక్ రీజియన్ అధ్యక్షుడు భాసూరు కృష్ణమూర్తి ఆరోపించారు. ప్రైవేటు వాహనదారులతో కుమ్మక్కైన యాజమాన్యం ఆర్‌టీసీని దెబ్బతీస్తోందని అంటున్నారు.