కనబడుట లేదు | every year increasing of disappearance cases | Sakshi
Sakshi News home page

కనబడుట లేదు

Published Wed, Sep 10 2014 2:59 AM | Last Updated on Thu, May 3 2018 3:17 PM

every year increasing  of disappearance  cases

సాక్షి, విశాఖపట్నం: ఇంట్లో అలిగి కొందరు.. పరీక్ష ఫలితాల భయంతో మరికొందరు.. ప్రేమ వ్యవహారంలో ఇంకొందరు చెప్పాపెట్టకుండా గడపదాటేస్తున్నారు. వీరిలో చాలా మంది ఎక్కడికి వెళ్లారో.. ఏమైపోయారో కూడా తెలియడం లేదు. పిల్లల కోసం గాలించి, కళ్లు కాయలు కాసేలా ఎదురుచూసి పోలీసులను ఆశ్రయించిన తల్లిదండ్రులకు అక్కడా చేదు అనుభవమే ఎదురవుతోంది. పోలీసులు అదృశ్యం కేసులను ఛేదించకపోగా హేళనగా మాట్లాడుతున్న సందర్భాలూ ఉన్నాయి.  

పోలీస్ కమిషనరేట్ పరిధిలో నమోదవుతున్న అదృశ్యం కేసుల్లో పసిపిల్లలు మొదలు యువతీయువకులే ఎక్కువగా ఉంటున్నారు. ముఖ్యంగా 0-5 ఏళ్లలోపు వయస్సున్న బాలలు,16 నుంచి 18ఏళ్ల వయస్సున్న యువతుల అదృశ్యం లెక్కలు కంగారుపెడుతున్నాయి. వీరికి సంబంధించి మిస్సింగ్ కేసులు పోలీసు రికార్డులకు ఎక్కుతున్నా మొక్కుబడి దర్యాప్తుతో చివరకు అయినవాళ్లకు చేదుజ్ఞాపకాలే మిగులు తున్నాయి.


 2011లో నగర పరిధిలో మొత్తం 478మంది అదృశ్యం అయినట్లు రికార్డులకెక్కగా, 2012లో 518 మంది, 2013లో 646, 2013 జనవరి నుంచి జులై వరకు 351 మంది కనిపించడం మానేశారు. ఈ ఏడాది మొదటి ఆరునెలల్లో మొత్తం 351 మంది కనిపించకపోగా అందులో బాలికలు, యువతులు, మహిళలు 185కాగా, బాలురు,యువకులు 166 మం ది ఉన్నారు. ఇందులో అయిదేళ్లలోపు పిల్లలు పది మందికాగా, 16-18ఏళ్ల వయసుగల యువతులు 109, యువకులు 34గా కేసులు నమోదయ్యాయి.

 అదృశ్యం కేసులు క్రమేపీ పెరిగిపోతున్నా అందులో పోలీసులు ఛేదించి ఆచూకీ తెలుసుకున్న కేసులు పెద్దగా లేవనే చెప్పాలి. ఒక రకంగా అదృశ్యం కేసులను పోలీసులు కూడా తేలిగ్గా తీసుకుంటున్నారు.  కేసులు నమోదు చేస్తున్నా తర్వాత విచారణ పక్కనపడేస్తున్నారు. దీంతో ఆయా కుటుంబాలు, తల్లిదండ్రులే పోలీసులపై ఆధారపడలేక సొంతంగా పాట్లు పడుతున్నారు. అయినా ఏళ్లతరబడి ఫలితం లేక తమవారి రాక కోసం ఎదురుచూపులుచూస్తూ భారం గా కాలం వెళ్లదీస్తున్నారు. స్టేషన్‌కు ఫిర్యాదుచేశాక కనీసం వారినుంచైనా తమవాళ్ల సమాచారం వస్తుందేమోనని ఆశగా చూస్తున్నారు. కానీ పోలీసులు పట్టించుకునే ప్రయత్నం చేయకపోవడంతో ఆ కేసులు క్రమక్రమంగా అదృశ్యం అయిపోతున్నాయి.

 పుట్టిన పసి పిల్లలను కేజీహెచ్, ఘోషాస్పత్రి నుంచి అపహరించుకుపోయే ముఠాలు నగరంలో పెరిగిపోతున్నాయి. పోలీసులు మాత్రం ఈ కేసులను ఛేదించలేకపోతున్నారు. చాపకిందనీరులా నగరంలో యువతుల అదృశ్యం కేసులు పెరిగిపోతుండడం విశేషం. నగరంలో పాగా వేసిన కొన్ని యువతుల అక్రమ రవాణా గ్యాంగులు పేదింటి యువతులపై కన్నేసి వారిని ఉపాధి పేరుతో దేశాల సరిహద్దులు దాటించేస్తున్నారు. ఇటీవల 10 మంది యువతులను ఇలాగే తరలించే ప్రయత్నం చేసి పట్టుబడ్డారు.

ఇంట్లో సమాచారం ఇవ్వనీయకుండా మహిళలు, యువతులను తరలించేస్తుండడంతో తమవారి జాడ తెలియక చాలామంది స్టేషన్లను ఆశ్రయిస్తున్నారు. పోలీసులు మాత్రం మిస్సింగ్ కేసులను తేలిగ్గా తీసుకుంటున్నారు. అధికంగా ప్రేమ వివాహాలకు సంబంధించి యువతుల తల్లిదండ్రులు మిస్సింగ్ కేసులు ఎ క్కువగా పెడుతున్నారని, తర్వాత తమ వాళ్లు తిరిగి వచ్చినా కేసులు వెనక్కి తీసుకోకపోవడం కూడా కేసు లు పెరగడానికి కారణమని విశ్లేషిస్తుండడం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement