అందరి సహకారంతోనే మేడారం జాతర సక్సెస్
- రూ.100 కోట్లు ఖర్చు చేశాం..
- భవిష్యత్‌లో శాశ్వత పనులు చేపడతాం
- కలెక్టర్ కిషన్
హసన్‌పర్తి, న్యూస్‌లైన్ : అన్ని విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది కష్టపడి పనిచేయడం వల్ల మేడారం జాతర సక్సెస్ అయిందని జిల్లా కలెక్టర్ కిషన్ అన్నారు. నగర పరిధిలోని చింతగట్టు అతిథి గృహంలో ఆర్‌డబ్ల్యుఎస్ ఆధ్వర్యంలో సమ్మక్క-సారలమ్మ మేడారం జాతర సక్సెస్‌పై శుక్రవారం విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ సభలో కలెక్టర్ మాట్లాడుతూ మేడారం జాతర పనుల కోసం వంద కోట్ల రూపాయలు ఖర్చు చేశామన్నారు. నాలుగు రోజుల పాటు జరిగిన ఈ జాతరలో ఆర్‌డబ్ల్యుఎస్ శాఖ పనితీరును అభినందించారు.
కోట్లాది మంది హాజరైన ఈ వేడుకల్లో అందరికీ తాగునీరు. బూత్‌రూంలను ఏర్పాటు చేసి... ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకున్నారని కొనియాడారు. మేడారంలో భవిష్యత్‌లో జాతరలో శాశ్వత పనులు చేపడతామన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి ఇంటిలో మరుగుదొడ్డి ఉండేలా ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ప్రస్తుతం భారత్ అభియాన్ పథకం కింద రెండు లక్షల ఐఎస్‌ఎల్‌లు మార్చి నెలాఖరు వరకు పూర్తి చేయాలని చెప్పారు.
వేసవి కాలంలో జిల్లాలో ఎక్కడ కూడా నీటి ఎద్దడి ఏర్పడకుండా ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు చూడాలని కలెక్టర్ ఆదేశించారు. జిలా పరిషత్ సీఇ వో ఆంజనేయులు మాట్లాడుతూ మేడారం జాతరను పురస్కరించుకుని ఆరునెలల ముందు నుంచే సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ...అధికారులు, సిబ్బందిని అప్రమత్తం చేయడం వల్లే సక్సెస్ అయ్యామని వివరించారు.
ఈ సందర్భంగా జాతరలో విధులు నిర్వహించిన ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులకు కలెక్టర్ ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఈ సురేష్‌కుమార్, ఈఈ శ్రీనివాస్‌రావు, రిటైర్డ్ జేడీ విద్యాసాగర్, లింగారవు, మహిపాల్, పులి ప్రభాకర్, శ్రీనివాస్‌రావు, రామ్మోహన్, గంగాధర్, తహసిల్దార్ ఎల్.కిశోర్‌కుమార్, వీఆర్వోల సంఘం జిల్లా అధ్యక్షుడు రత్నాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.