అంతా నా ఇష్టం | Everything is my wish... | Sakshi
Sakshi News home page

అంతా నా ఇష్టం

Published Sat, Mar 1 2014 2:33 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM

Everything is my wish...

 నెల్లూరు(టౌన్), న్యూస్‌లైన్: అంతా నా ఇష్టం.. నన్ను ఎవరూ ఏమీ చేయలేరంటూ జిల్లా విద్యాశాఖాధికారి మువ్వా రామలిం గం వ్యవహరిస్తున్నారని ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. ఎంత పెద్ద తప్పులు చేసినా అస్మదీయులను చేరదీస్తున్నారని, చిన్నచిన్న పొరపాట్లు చేసిన తస్మదీయులను(తనను ప్రశ్నించేవారిని) తీవ్రంగా వేధిస్తున్నారని మండిపడుతున్నారు. వివిధ రకాలుగా వేధిం చడంతో పాటు ఉద్యోగోన్నతులు ఆపుతూ ఇబ్బంది పెడుతున్నాడని ఆవేదన చెందుతున్నారు. ఉన్నతాధికారులు ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ, విద్యాశాఖను భ్రష్టు పట్టిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
 
 ఆయన వ్యవహారశైలి మొదటి నుంచి అంతేనని, గతంలో పనిచేసిన జిల్లాల్లోనూ వివాదాస్పదుడిగా నిలిచి బదిలీ అయ్యాడని చెబుతున్నారు. జిల్లా మంత్రి అండదండలతోనే ఎవరినీ లెక్కచేయకుండా చెలరేగిపోతున్నాడని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో డీఈఓపై చర్యలు తీసుకోవాలని కోరు తూ ఇటీవల ముగ్గురు ఎమ్మెల్సీలతో కలిసి వేలాది మంది ఉపాధ్యాయులు జిల్లా విద్యాశాఖ కార్యాలయాన్ని ముట్టడించారు.
 
 అడుగడుగునా ఉల్లంఘనలు
 గతంలో జిల్లాలో డిప్యూడీ ఈఓగా పనిచేసిన రామలింగం పలు ఆరోపణలను ఎదుర్కొని బదిలీపై వెళ్లారు. అప్పట్లో విద్యాశాఖ డెరైక్టర్‌గా ఉన్న ఛాయారతన్ ఆయనను బాలికల పాఠశాల తనిఖీ చేయవద్దని ఆదేశాలు జారీ చేసిందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. 2011 జూన్‌లో జిల్లా విద్యాశాఖాధికారిగా ఆయన వచ్చారు.
 
 అప్పటి నుంచి అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయన హయాంలో ప్రభుత్వ ఆదేశాల ఉల్లంఘనకు, అక్రమాలకు అడ్డే లేకుండా పోయిందని, అందుకు కొన్ని కారణాలను ఉపాధ్యాయులు చూపుతున్నారు.  ఉద్యోగ విరమణతో ఖాళీ అయిన పోస్టుల్లో నెలానెలా ఉద్యోగోన్నతులు కల్పించాలి. కానీ 14 నెలలుగా ఉద్యోగోన్నతులు కల్పించలేదు. ఫలితంగా ఇంగ్లిషు, గణితం, సైన్సు తదితర కీలక సబ్జెక్టులకు ఉపాధ్యాయులు కరువయ్యారు.  
 
  ఉపాధ్యాయుల పోరాట ఫలితంగా బదిలీల ప్రక్రియకు కౌన్సెలింగ్ విధానం అమలులోకి వచ్చింది. దీనిని కాదని జిల్లాలో గవర్నమెంటు ఉత్తర్వుల పేరుతో ఇప్పటికే 121 మంది బదిలీ ఉత్తర్వులు తెచ్చుకున్నారు. ఇవి చాలవన్నట్లు మరో 30 మందికి అక్రమ బదిలీలు సిద్ధంగా ఉన్నాయి. వీటి వెనుక డీఈవో కార్యాలయం హస్తం ఉందని, లక్షలాది రూపాయలు చేతులు మారుతున్నాయని  ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి.  ఇంత పెద్దసంఖ్యలో ప్రభుత్వ బదిలీలు ఏ జిల్లాలో జరగలేదు.
 
  నెల్లూరు కలెక్టర్‌గా శ్రీకాంత్ వచ్చిన రెండో రోజే డీఈవో అక్రమాలపై 800 పేజీల రిపోర్టును ప్రభుత్వానికి పంపారు. అయితే ‘అధికార’ అండ ఉండటంతో ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
 ఉపాధ్యాయులకు ఉద్యోగోన్నతులు కల్పించాలని విద్యాశాఖ డెరైక్టర్ వాణీమోహన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశించినా ఖాతరు చేయలేదు. గతంలో తాటిపర్తిలో ప్రధానోపాధ్యాయుడిపై ముగ్గురు మహిళా టీచర్లు ఫిర్యాదు చేశారు.
 
 హెచ్‌ఎంతో పాటు అందరినీ డీఈఓ బదిలీ చేశారు.ఈ విషయంలో హెచ్‌ఎంతో డీఈవో కుమ్మక్కయ్యారని ఆరోపణలు వె ల్లువెత్తాయి డక్కిలిలో ఉపాధ్యాయురాలిని లేనిపోని నిబంధనలతో వేధించాడని ఆరోపణలు వచ్చాయి.  సమ్మె కాలానికి సంబంధించి సెలవుల సర్దుబాటుపై జీవోకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుని ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టడం.
 
  సమ్మెలో పాల్గొనలేదని గూడూరులో మున్సిపల్ టీచర్లకు జీతాలు ఆపారు. కానీ ములుముడిలో తనకు అనుకూలమైన ఉపాధ్యాయులు  సమ్మెలో పాల్గొనకపోయినా జీతాలు విడుదల చేశారు.
 
 సస్పెండ్ అయిన వ్యక్తే హెచ్‌ఎం
 రాపూరు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడిపై ఆరోపణలు రావడంతో ఆర్జేడీ విచారణ జరిపి 2013 నవంబర్‌లో సస్పెండ్ చేశారు. అయితే ఇప్పటికీ ఆయననే ప్రధానోపాధ్యాయుడి(జీతం లేకుండా)గా డీఈఓ కొనసాగిస్తున్నారు. పైగా ఈ విషయంలో హెచ్‌ఎం సస్పెండ్ కాలేదని కలెక్టర్‌ను మొదట్లో కలెక్టర్‌ను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారు.
 
 ఇతర జిల్లాల్లోనూ వివాదాలే..
 డీఈఓ రామలింగం వ్యవహారశైలితో వివాదాలు జిల్లాకే పరిమితం కాలేదని, గతంలో ఆయన పనిచేసిన పలు జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగిందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. చిత్తూరులో పనిచేసినప్పుడు తనకు గిట్టని వారిని మారుమూల ప్రాంతాలకు బదిలీ చేస్తూ ఉపాధ్యాయ సంఘాలతో తగాదాలు పెట్టుకున్నాడని, గుంటూరులో పనిచేసేటప్పుడు ఏసీబీ కేసులో ఇరుక్కుని జైలుకు వెళ్లారని ఉపాధ్యాయులు తెలిపారు. కర్నూలులో ఓ దళిత టీచర్‌ను వేధించింనందుకు సాక్షాత్తు అక్కడి కలెక్టరే కేసు పెట్టించారని, ఆ కేసు ఇప్పటికి నడుస్తోందని వివరించారు.
 
 తాజాగా నెల్లూరులోనూ పలువురు మహిళా ఉపాధ్యాయులు ఆయన తీరుపై ఫిర్యాదులు చేయడంతో విచార ణ జరిపి నిర్భయ చట్టం కింద కేసులు నమోదు చేస్తామని జాయింట్ కలెక్టర్ రేఖారాణి మూడు రోజుల క్రితం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇలాంటి అధికారి తీరుతో జిల్లాలో విద్యావ్యవస్థ భ్రష్టు పడుతోందని విద్యావేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా మంత్రి తన పద్ధతి మార్చుకుని డీఈఓకు వంత పాడటం మాని, తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement