మండపేట/ఆలమూరు :రాజకీయ కురువృద్ధుడు, మాజీ మంత్రి సంగిత వెంకటరెడ్డికి ప్రజలు అశ్రునయనాలతో అంతిమ వీడ్కోలు పలికారు. కడసారిగా ఆయనను చూసేందుకు తరలివచ్చిన వారితో పినపళ్ల జనసంద్రమైంది. సంగిత ఇకలేరన్న నిజం ఆయన అభిమానులను శోకసంద్రంలో ముంచేసింది. అధికార లాంఛనాలతో ఆయన పార్థివదేహానికి గౌతమితీరంలో అంత్యక్రియలు నిర్వహించారు. తమకు రాజకీయ జన్మనిచ్చిన మాజీ మంత్రి సంగిత ఇక లేరనేనిజాన్ని నమ్మలేకపోతున్నామని పలువురు నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి సంగిత వెంకటరెడ్డి సోమవారం అర్ధరాత్రి కాకినాడలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచిన విషయం విదితమే. ఆయన పార్థివ దేహాన్ని మంగళవారం తెల్లవారుజామున కుటుంబ సభ్యులు నాలుగు గంటలకు ఆయన స్వగ్రామమైన ఆలమూరు మండలంలోని పినపళ్లకు తరలించారు.
పార్టీ శ్రేణులు, అభిమానులు, సహచర మిత్రుల సందర్శనార్థం భౌతిక కాయాన్ని మధ్యాహ్నం వరకు ఆయన నివాసంలోనే ఉంచారు. మాజీ మంత్రి సంగిత మృతి వార్త తెలుసుకున్న కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనకుండా హుటాహుటిన సంగిత నివాసానికి చేరుకుని నివాళులు అర్పించారు. కేబినెట్ మంత్రిగా పనిచేసిన సంగితకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని జిల్లా కలెక్టర్ నీతూకుమారి ప్రసాద్, ఎస్పీ జి.విజయ్‌కుమార్ దృష్టికి తీసుకువెళ్లారు. వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి, రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు కొల్లి నిర్మలకుమారి, పార్టీ సీఈసీ సభ్యులు రెడ్డి వీరవెంకటసత్యప్రసాద్, జిల్లా కిసాన్ సెల్ కన్వీనర్ రెడ్డి రాధాకృష్ణ,
మాజీ ఎంపీలు ఉండవల్లి అరుణ్‌కుమార్, జీవీహర్షకుమార్, ఏజేవీపీ బుచ్చి మహేశ్వరావు, మాజీ ఎమ్మెల్యేలు గిరజాల వెంకటస్వామినాయుడు, బండారు సత్యానందరావు, డీసీఎంస్ మాజీ చైర్మన్లు రెడ్డి గోవిందరావు, వైఎస్సార్ సీపీ నాయకులు ఎం.మోహన్, జిన్నూరి సాయిబాబా, దూలం వెంకన్నబాబు, సిరంగు శ్రీను, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆకుల రామకృష్ణ, కామన ప్రభాకరరావు, టీవీ సత్యనారాయణరెడ్డి, కపిలేశ్వరపురం సర్పంచ్ ఎంవీఎస్ మునిప్రసాద్, లయన్స్‌క్లబ్ గవర్నర్ కొండూరి మాణిక్యాలరావు తదితరులు మాజీ మంత్రి పార్థివ దేహాన్ని సందర్శించి పూలమాలలతో ఘన నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
పినపళ్ల నుంచి జొన్నాడ వరకుసాగిన అంతిమయాత్ర
పినపళ్లలోని సంగిత స్వగృహం నుంచి మొదలైన అంతిమయాత్ర పెదపళ్ల, చింతలూరు, ఆలమూరు, జొన్నాడ మీదుగా సాగింది. ప్రత్యేక వాహనంలో సంగిత పార్థివ దేహాన్ని ఉంచి ఊరేగింపుగా గౌతమి తీరానికి తీసుకువెళ్లారు. రాజమండ్రి ఆర్డీఓ నాన్‌రాజు, రామచ ంద్రపురం డీఎస్పీ డి.రవీంద్రనాథ్‌ల ఆధ్వర్యంలో కాకినాడ నుంచి ప్రత్యేక పోలీసులు బలగాలు గౌతమి తీరానికి చేరుకుని సంగిత భౌతికకాయం వద్ద గౌరవ వందనం చేశారు. అనంతరం మూడు రౌండ్లు గాలిలో కాల్పులు జరిపారు. పోలీసులు గౌరవ వందనం చేశారు. అనంతరం సంగిత పెద్ద కుమారుడు గంగరాజు చితికి నిప్పంటించారు. సంగిత అంతిమయాత్రలో భారీ ఎత్తున ఆయన అభిమానులు, గ్రామస్తులు పాల్గొన్నారు. కొత్తపేట, మండపేట, రామచంద్రపురం, రాజమండ్రి, అమలాపురం తదితర ప్రాంతాల నుంచి సంగిత అభిమానులు తరలివచ్చి అంతిమయాత్రలో పాల్గొన్నారు.