సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఉన్నట్టుండి వెలువడిన మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్‌తో వివిధ రాజకీయపార్టీల ఎమ్మెల్యే అభ్యర్థుల్లో టెన్షన్ అలుముకుంది. ఖర్చు తడిసిమోపెడవుతుందేమోనన్న భయం ఆవగించింది. సార్వత్రిక ఎన్నికలకు ముందు స్థానిక ఎన్నికలుంటాయా అనే ధీమాతో ఉన్న రాజకీయపక్షాలకు అకస్మాత్తుగా విడుదలైన ‘పురపోరు’ నోటిఫికేషన్ మింగుడుపడటం లేదనే చెప్పాలి.
ముఖ్యంగా ఎన్నికలు జరిగే నాలుగు మున్సిపాలిటీల పరిధిలో అసెంబ్లీ స్థానాలకు పోటీచేయాలనుకుంటున్న అశావాహులు ఈ పరిణామంతో బెంబేలెత్తుతున్నారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగే ఈ ఎన్నికల ఫలితాల ప్రభావం అసెంబ్లీ ఎన్నికలపై పడుతుందేమోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఫలితాల మాట అటుంచితే అసలు ఎంత ఖర్చు పెట్టాల్సి వస్తుందనే దానిపై ప్రధాన రాజకీయ పక్షాల ఎమ్మెల్యే టికెట్ ఆశావహులు తలలు బాదుకుంటున్నారు.
సార్వత్రిక ఎన్నికలలో స్థానిక నేతలు తమకు సహకరించాలంటే ఈ ఎన్నికలలో వారికి ‘ఆర్థిక’ సహకారం అందించి తీరాల్సిందే. ఇప్పుడు ఈ ఖర్చు భరించాలంటే ఒక్కో వార్డుకు తక్కువలో తక్కువగా రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంటే ఒక్కో మున్సిపాలిటీలో దాదాపు రెండు కోట్ల రూపాయలకు పైనే అవుతుంది. ఈ ఖర్చు భరించకపోతే... వార్డు మెంబర్లు రానున్న ఎన్నికలలో సహక రించరేమోననే ఆందోళన వారిలో వ్యక్తవుతోంది.
మున్సిపల్ ఎన్నికల పరిస్థితి ఇలా ఉంటే... ఇదే ఊపులో ఎంపీటీసీ, జడ్పీటీసీల ఎన్నికలు వస్తే పరిస్థితి ఏమిటనే భయం జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్యే టికెట్ ఆశావాహులకు నిద్రపట్టనివ్వడం లేదు. ఆ ఖర్చు ... ఈ ఖర్చు మళ్లీ తాను నిలబడే ఎన్నికలయ్యే ఖర్చు తలుచుకుంటే చుక్కలు కనిపిస్తున్నాయని, అసలు ఏం చేయాలో అర్థం కావడం లేదని ఓ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఆశావహుడు ‘సాక్షి’తో ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు కోర్టు కేసుల కారణంగా ఎన్నికలు నిలిచిపోయిన ఖమ్మం కార్పొరేషన్, మణుగూరు, పాల్వంచ మున్సిపాలిటీల ఎమ్మెల్యే అభ్యర్థులు మాత్రం కొంతమేర ఉపశమనం పొందారు. అయితే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు వ స్తే...పరిస్థితి ఏమిటన్న భయం వారినీ వెంటాడుతోంది.
మున్సిపల్ ఆశావహులకు మంచి అవకాశం
ఎమ్మెల్యే టికెట్ ఆశావహుల పరిస్థితి ఇలా ఉంటే... మున్సిపల్ చైర్మన్లు, వార్డు సభ్యులు కావాలనుకునే వారు మాత్రం చంకలు గుద్దుకుంటున్నారు. భలే మంచి సమయంలో షెడ్యూల్ వచ్చిందంటూ పోటీచేయాలనుకుంటున్న అభ్యర్థులు ఆనందపడిపోతున్నారు. ఆర్థిక భారం పెద్దగా లేకుండానే ఎంచక్కా ప్రజాప్రతినిధులం అయిపోవచ్చని, మామూలు సమయంలో ఎన్నికలు జరిగితే తామే పెద్ద పెద్ద నేతలను బతిమిలాడుకోవాలని, ఇప్పుడు వాళ్లే మమ్మల్ని బతిమిలాడుకునే పరిస్థితి ఉందని అంటున్నారు. సీటు కోసం, నిధుల కోసం వెతుక్కోవాల్సిన పనిలేదని, అవకాశం వచ్చి తలుపు తడుతుందనే ధీమాతో స్థానిక నాయకత్వం ఉంది.
పొత్తులెలా ఉంటాయో...?
ఇక అభ్యర్థుల మాట అటుంచితే.... పార్టీల పరంగా కూడా మున్సిపల్ ఎన్నికలు తలనొప్పి తెచ్చి పెట్టాయి. సార్వత్రిక ఎన్నికలలో పొత్తులపై ఇప్పుడే ప్రాథమికంగా కసరత్తు ప్రారంభమవుతున్న తరుణంలో హఠాత్తుగా వచ్చిన మున్సిపల్ ఎన్నికలలో ఎలాంటి పొత్తులు పెట్టుకోవాలన్న దానిపై రాజకీయ పక్షాలు తర్జనభర్జనలు పడుతున్నాయి. ఇప్పుడు పెట్టుకునే పొత్తు సార్వత్రిక ఎన్నికలపై కూడా ప్రభావం చూపుతుందని, స్థానిక పరిస్థితులకనుగుణంగా ఒక పార్టీతో పొత్తుకు వెళితే సాధారణ ఎన్నికల సమయంలో ఎలా ఉంటుందోననే ఆందోళన పార్టీ ముఖ్య నేతల్లో వ్యక్తమవుతోంది. మొత్తంమీద సాధారణ ఎన్నికలకు ముందు సెమీఫైనల్స్‌గా వచ్చిన మున్సిపల్ ఎన్నికలు ఒక్కమాటలో చెప్పాలంటే రాజకీయ పక్షాలకు తలనొప్పేనని చెప్పాలి.
ఎమ్మెల్యే అభ్యర్థులకు మున్సిపోల్ పరీక్ష
Published Tue, Mar 4 2014 2:30 AM | Last Updated on Wed, Aug 29 2018 6:13 PM
Advertisement
Advertisement