సాక్షి, ఖమ్మం: మున్సిపల్, సార్వత్రిక ఎన్నికల బరిలో ఉండే అభ్యర్థులను కోడ్ వెంటాడనుంది. ఏ తప్పుచేసినా వారికి ఇక చిక్కులే. ఓట్లకు గాలం వేసే మద్యం ప్రవాహం, డబ్బు పంపిణీ, ఖర్చు అన్నింటి పైనా ఎన్నికల కమిషన్ ఆదేశాలతో జిల్లా యంత్రాంగం డేగ కన్ను వేసింది. ఎక్కడ ఏ నిబంధన ఉల్లంఘించినా కఠిన చర్యలు తప్పవని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది.
మీడియా చెల్లింపు వార్తలపై నిఘా..
ఓటర్ల నమోదులో ప్రజల భాగస్వామ్యం పెంచేందుకు వివిధ మీడియాల్లో చెల్లింపు వార్తలను పర్యవేక్షించేందుకు తొలిసారిగా అవగాహన పరిశీలకులను నియమిస్తున్నారు. అభ్యర్థులు పైకి కనిపించకుండా చేసే ఖర్చును కూడా లెక్క కట్టనున్నారు. ఎంపిక చేసిన సమస్యాత్మక కేంద్రాల్లో పోలింగ్ రోజున సూక్ష్మ పరిశీలకులను నియమించనున్నారు. వీరంతా పోలింగ్ సమయంలో ఎవరు ఏ తప్పు చేసినా ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక సహాయ వ్యయ పరిశీలకులను నియమించారు.
వీరు అన్ని ఎన్నికల ప్రచార కార్యక్రమాలను వీడియోలో చిత్రీకరించడంతోపాటు ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు, రాజకీయ పార్టీల ఎన్నికల ప్రకటనలు, చెల్లింపు వార్తలపై నిఘా పెట్టేందుకు ‘మీడియా సర్టిఫికేషన్ కమిటీ’ ఏర్పాటు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేసిన వారు వాటిని తీసివేయాలని అధికారులు సూచించారు. వారు తీయకుంటే సిబ్బంది వాటిని తొలగిస్తారు. ఇలా పలు కమిటీలతో అభ్యర్థుల ప్రచారంపై నిబంధనలు విధించారు.
మద్యం, డబ్బు ప్రవాహంపై పోలీస్ కన్ను..
ప్రస్తుతం ఎన్నికల రాజకీయం మద్యం, డబ్బుమయంగా మారింది. నోటు, మద్యం ఇస్తేనే ఓట్లు రాలుతాయని నేతలు భావిస్తున్నారు. ఈ రెండింటిపైనే అభ్యర్థులు దృష్టి పెట్టారు. అయితే వీటిని అడ్డుకోవడమే ధ్యేయంగా పోలీస్ యంత్రాంగం కూడా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. ఎన్నికల్లో డబ్బు ప్రవాహాన్ని నియంత్రించేందుకు ఫ్లయింగ్‌స్క్వాడ్‌లు, స్టాటిక్ సర్వైలాన్స్ టీంలు, అకౌంటింగ్ టీంలు, వీడియో సర్వైలాన్స్ టీంలు నియోజకవర్గ స్థాయిలో పని చేస్తాయి. పట్టణం నుంచి పల్లె వరకు డబ్బు, మద్యం ప్రవాహాన్ని అడ్డుకోవడమే ఈ టీముల పని. లోక్‌సభ నియోజకవర్గానికి పోటీ చేసే అభ్యర్థి రూ. 70 లక్షలు, అసెంబ్లీ అభ్యర్థులు రూ.28 లక్షలు మించకుండా ఖర్చు చేయాలని ఎన్నికల కమిషన్ పేర్కొంది. అయితే అభ్యర్థులు ఇంతవరకే ఖర్చు చేస్తారా.. అన్నది సందేహమే.
అంతా వీడియోగ్రఫీ..
నామినేషన్ దాఖలు, పరిశీలన, గుర్తుల కేటాయింపు, ఈవీఎంలు భద్ర పరచడం, బహిరంగ సభలు, ఊరేగింపులు, పోస్టల్ బ్యాలెట్ల పంపిణీ, కొన్ని ముఖ్యమైన కేంద్రాల వద్ద పోలింగ్ ప్రక్రియ, ఓట్ల లెక్కింపు వరకు అంతా వీడియోగ్రఫీ చేయనున్నారు. దీంతో అభ్యర్థులు, వారి అనుచరులు ఏ చర్యలకు పాల్పడినా ఎన్నికల కమిషన్ కొరడా ఝుళిపించనుంది. ప్రతి అభ్యర్థి బ్యాంకు చెక్ ద్వారానే చెల్లింపులు చేయాలి. రూ.10 లక్షలపైన ఖర్చు చేసే అభ్యర్థులపై ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులు నిఘా పెడతారు. ఇందుకోసం ఎల్‌డీఎం, జాతీయ బ్యాంకులు ఈ వివరాలను అందించేందుకు ప్రత్యేకంగా ఎక్స్‌పెండేచర్ టీంను ఏర్పాటు చేశారు. బరిలో నిలిచే అభ్యర్థులకు ఇది కొరకరాని కొయ్యగా మారింది.
సరిహద్దులో భద్రత..
ఎన్నికల నేపథ్యంలో భద్రాచలం ఏజెన్సీలో భారీ భద్రత చేపడుతున్నారు. జిల్లాలో భద్రాచలం డివిజన్‌కు ఛత్తీస్‌గఢ్, ఒడిశాతో కలిపి 275 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. ఇందులో ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్, సుకుమా జిల్లాలు 225 కిలోమీటర్లు, ఒడిశాలోని మల్కాన్‌గిరి జిల్లాలో 50 కిలీమీటర్ల సరిహద్దు ఉంది. ఛత్తీస్‌గఢ్‌లోని దక్షిణ బస్తర్‌లో సుకుమా, బీజాపూర్ జిల్లాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. అటు కూడా జిల్లా పోలీస్ యంత్రాంగం బందోబస్తు నిర్వహించనుంది. ఇక్కడ ముందు ఎన్నికలు ఉండడంతో అక్కడ శాంతి భద్రలు చేపడుతున్నారు. కేంద్ర పారామిలటరీ బలగాలు ఎన్నికల్లో భద్రతకు తరలివస్తున్నాయి. సరిహద్దు నుంచి జిల్లాలోకి మద్యం, డబ్బు తరలించినా ఇక్కడే పట్టుకునేందుకు చర్యలు చేపడుతున్నారు. ఎన్నికలు పూర్తయ్యేవరకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేకంగా 30 చెక్ పోస్టులను ఏర్పాటు చేస్తున్నారు.
‘కోడ్’ కొరడా
Published Fri, Mar 7 2014 1:26 AM | Last Updated on Tue, Oct 9 2018 6:34 PM
Advertisement
Advertisement