సాక్షి ప్రతినిధి, ఖమ్మం: నోటిఫికేషన్ ఏ క్షణంలో వచ్చినా సార్వత్రిక ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉందని జిల్లా కలెక్టర్ ఐ.శ్రీనివాస శ్రీనరేశ్ చెప్పారు. ఎన్నికల కోసం అన్ని రకాలుగా సిద్ధమవుతున్నామని, ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నడుచుకుంటూ, అందరి సహకారంతో పకడ్బందీగా పూర్తి చేస్తామని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఈనెల చివరి వారంలో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ రావచ్చనే ప్రచారం నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఎన్నికలకు సిద్ధమవుతున్న తీరు, ఇతర అంశాలపై శుక్రవారం కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేశ్ ‘సాక్షి’ ప్రతినిధికి ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఆ ఇంటర్వ్యూ విశేషాలివి....
సాక్షి: సార్వత్రిక ఎన్నికలపై దృష్టి పెట్టినట్లున్నారు? అంతర్‌జిల్లాల బదిలీల ప్రక్రియ ఎంత వరకు వచ్చింది?
కలెక్టర్: అవును. త్వరలోనే ఎన్నికలు జరపాల్సిన పరిస్థితుల్లో ఆ దిశగా దృష్టి సారించాం. అంతర్‌జిల్లాల బదిలీలకు సంబంధించి తహశీల్దార్ల బదిలీలు పూర్తి చేశాం. ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారందరికీ పోస్టింగ్‌లిచ్చాం. ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల నుంచి తహశీల్దార్లు వస్తున్నారు. మేడారం జాతర కారణంగా ఈ ప్రక్రియ కొంతమేర ఆలస్యం అయింది. వీరంతా సోమవారం కల్లా విధుల్లో చేరతారు. ఇక, మండల పరిషత్ అభివృద్ధి అధికారుల (ఎంపీడీవోల) సేవలను ఎలా వినియోగించుకోవాలన్నదానిపై హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉంది.
అయితే, ఈసారికి వారిని కూడా ఎన్నికల విధులకు వినియోగించుకోక తప్పదు. ఎన్నికల సమయంలో 10-15 బూత్‌లను సమన్వయపరిచే జోనల్ అధికారులుగా గెజిటెడ్ అధికారులనే నియమించాల్సి ఉంది. జిల్లాలో ఈ స్థాయి అధికారుల కొరత ఉన్న కారణంగా ఎంపీడీవోలకు ఆ బాధ్యతలు అప్పగించాలని ఆలోచన చేస్తున్నాం. వీరితో పాటు ఎన్నికలకు అవసరమయ్యే మానవ వనరులన్నింటినీ సిద్ధం చేసుకుంటున్నాం.
సాక్షి: ఈ బదిలీల్లో రాజకీయ ఒత్తిళ్లు, పోస్టింగ్‌ల కోసం పైరవీలు వచ్చాయన్న ప్రచారం ఉంది వాస్తవమేనా?
కలెక్టర్: అది కేవలం ప్రచారం మాత్రమే. మాపై ఎలాంటి ఒత్తిళ్లు లేవు. పారదర్శకంగా బదిలీల ప్రక్రియను పూర్తి చేశాం. అసలు ఎవరు వస్తారన్నది కూడా మాకే తెలియని పరిస్థితుల్లో పైరవీలకు ఆస్కారం లేదు.
సాక్షి: ఈనెల చివరి వారంలో ఎన్నికల నోటిఫికేషన్ అంటున్నారు... ఎన్నికలు ఎప్పుడొచ్చినా మీరు సిద్ధంగా ఉన్నారా?
కలెక్టర్: ఖచ్చితంగా. ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా పకడ్బందీగా పూర్తి చేసేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. అన్ని రకాల కసరత్తులు చేస్తున్నాం. జిల్లా ఎస్పీ, జేసీ, ఆర్డీవోలు, డీఎస్పీల సహకారంతో ఎన్నికలను నిర్వహించేందుకు సిద్ధమవుతున్నాం. నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులుగా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌లను నియమిస్తున్నాం. కొత్తగా వచ్చిన ఐటీడీఏ పీవో దివ్యకు బాధ్యతలు అప్పగిస్తున్నాం. తొలి విడత తనిఖీ కోసం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు (ఈవీఎంలు) ఇప్పటికే రావాల్సి ఉంది. మరో వారంలో అవి వస్తాయి. ఈలోపు తహశీల్దార్లు కూడా విధుల్లో చేరిపోయి మొదటి దశ త నిఖీలను పూర్తి చేస్తారు.
సాక్షి: ఎన్నికలకు సంబంధించి మీ అనుభవాలను వివరిస్తారా?
కలెక్టర్: ఆరు రాష్ట్రాలలో ఎన్నికల పరిశీలకునిగా పనిచేశా. నాలుగుసార్లు అసెంబ్లీ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారిగా బాధ్యతలు నిర్వహించా. సమస్యాత్మకమైన చార్మినార్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించా.
సాక్షి: ఈసారి కొత్తగా ఓట్ కన్ఫర్మేషన్ విధానం వస్తుందంటున్నారు? దానికి సంబంధించిన సమాచారం ఏదైనా ఉందా? ఇంకా కొత్త విధానాలేమైనా వస్తున్నాయా?
కలెక్టర్: ఓట్ కన్ఫర్మేషన్ ప్రతిపాదన ఉన్నమాట వాస్తవమే. అయితే, ఇందుకు సంబంధించి ఎన్నికల సంఘం నుంచి మాకు ఆదేశాలు రావాల్సి ఉంది. జిల్లాను పైలట్‌గా వారు ఎంపిక చేస్తే ఆ విధానం కూడా ఈసారి ఎన్నికలలో ఉంటుంది. అయితే, ఈసారి కొత్తగా నన్ ఆఫ్ ద ఎబౌ (నోటా) ఆప్షన్ కూడా ఓటర్లకు ఉంటుంది. అంటే ఈవీఎం బ్యాలెట్‌లో ఉన్న అభ్యర్థులెవరూ నచ్చకపోతే... ఓటరు నోటాను ఎంచుకోవడం ద్వారా పోటీచేసిన అభ్యర్థులందరినీ తాను తిరస్కరిస్తున్నానని చెప్పవచ్చు.
సాక్షి: పోలవరం ముంపు ప్రాంతాలను సీమాంధ్రలో కలుపుతారని వార్తలొస్తున్న నేపథ్యంలో మీరు 46 మండలాల్లో ఎన్నికలకు సిద్ధమవుతున్నారా?
కలెక్టర్: ప్రస్తుతానికి జిల్లాలో ఉన్నది 46 మండలాలు. అన్నింటిలో ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నాం. పోలవరం ముంపు ప్రాంతాలకు సంబంధించి మీడియాలో వస్తున్న వార్తలే తప్ప మాకు అధికారికంగా ఎలాంటి ఆదేశాలూ లేవు. అలాంటి ఆదేశాలు వచ్చినప్పుడు ఏం చేయాలన్నది నిర్ణయిస్తాం.
సాక్షి: ఖమ్మం పట్టణంలోని ఎన్నెస్పీ ఆక్రమణల తొలగింపులో నిర్వాసితులయిన వారికి పునరావాస ప్రక్రియ ఎంతవరకు వచ్చింది? ఎప్పటివరకు పూర్తవుతుంది?
కలెక్టర్: ఇందుకు సంబంధించిన ప్రక్రియ వేగంగా నడుస్తోంది. వారికి పునరావాసం కోసం రఘునాథపాలెంలో ప్రత్యామ్నాయ స్థలాన్ని కూడా గుర్తించాం. అర్హులను గుర్తించి వారికి ఆ భూమిని కేటాయించే ప్రక్రియను మరో వారం రోజుల్లో పూర్తి చేస్తాం.
సాక్షి: సత్తుపల్లి ఓపెన్‌కాస్ట్ నిర్వాసితుల సమస్య పరిష్కారమయినట్టేనా?
కలెక్టర్: ఈ విషయంలో ప్రభుత్వం అనేక సార్లు వారితో చర్చలు జరిపింది. జిల్లా జాయింట్ కలెక్టర్ కూడా రెండుసార్లు అక్కడకు వెళ్లి వచ్చారు. అక్కడే గ్రీవెన్స్ డే కూడా పెట్టాం. మేమయితే వారితో సంప్రదించి చట్ట ప్రకారమే పరిహారం పంపిణీ ప్రక్రియ చేపట్టాం.
సాక్షి: ఖమ్మంలో జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు సంబంధించిన సమస్య ఎప్పటికి పరిష్కారం అవుతుంది?
కలెక్టర్: దీనిపై సమీక్ష జరిపాం. సమాచారమంతా సేకరిస్తున్నాం. ఓవైపు రాజీవ్ విద్యామిషన్ అధికారులు కూడా ఆ స్థలాన్ని తమకే అప్పగించాలని ప్రతిపాదనలు పంపారు. ఏం చేయాలన్న దానిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
సాక్షి: ఖమ్మం జిల్లా కలెక్టర్‌గా మీ అనుభవం ఎలా ఉంది?
కలెక్టర్: ఇది చాలా మంచి జిల్లా. ఎక్కడా ఎలాంటి సమస్యా లేదు. నేను చాలా సంతృప్తిగా ఉన్నాను. మీడియాతో పాటు రాజకీయ నాయకులు, ప్రజలు కూడా పూర్తిగా సహకరిస్తున్నారు.
ఎన్నికలు ఏ క్షణంలో వచ్చినా...రెడీ
Published Sat, Feb 15 2014 2:31 AM | Last Updated on Tue, Aug 14 2018 4:44 PM
Advertisement
Advertisement