నేలపై పరీక్షే!
కడప ఎడ్యుకేషన్ : అధికారుల మాటలు నీటి మీద రాతలయ్యాయి. ఇంటర్ విద్యార్థులకు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని ఇంటర్ బోర్డు అదేశించినా అధికారులు మాత్రం నిర్లక్ష్యం వహించారు. ఈ ఏడాది కూడా ఇంటర్ విద్యార్థులకు నేలబారు రాతలు తప్పలేదు. జిల్లా కేంద్రమైన కడప నగరంలో ఆర్‌ఐఓ కార్యాలయానికి కూత వేటు దూరంలో ఉన్న ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలోని పరీక్షా కేంద్రంలో విద్యార్థులు నేలపై కూర్చొని పరీక్ష రాశారు. దీంతో పలువురు విద్యార్థులు ఇబ్బంది పడ్డారు.
పోరుమామిళ్లతోపాటు పలు కళాశాల్లో కూడా విద్యార్థులు నేలపై కూర్చొని, కొన్ని కేంద్రాల్లో చీకట్లో పరీక్షలు రాయాల్సి వచ్చింది. మరికొన్ని సెంటర్లలో మంచినీటి సౌకర్యానికి నోచుకోలేదు. జిల్లా వ్యాప్తంగా 92 కేంద్రాల్లో బుధవారం ప్రారంభమైన ఇంటర్ పరీక్షలకు 23,097 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 21,820 మంది హాజరయ్యారు. 1277 మంది అబ్‌సెంట్ అయ్యారు. ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభమైంది. నగరంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళశాల సెంటర్‌ను ఇంటర్మీడియట్ ప్రాంతీయ పర్యవేక్షణాధికారి (ఆర్‌ఐఓ) ప్రసాద్‌రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఎవరూ కాపీయింగ్‌కు పాల్పడ కూడదని హెచ్చరించారు. ఎవరైనా అలా చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. వారికి సహకరించిన ఇన్విజిలేటర్ల కూడా బాధ్యులు అవుతారన్నారు. బ్రహ్మంగారి మఠంలోని సెంటర్‌లో ఇద్దరిని మాల్‌ప్రాక్టీస్ కింద ప్లైయింగ్ స్క్వాడ్ డీబార్ చేసినట్లు ఆర్‌ఐఓ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా జరిగిన పరీక్షలలో ప్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్‌తోపాటు జిల్లా పరీక్షల కమిటి సభ్యులు చంద్రశేఖర్, సుధాకర్, గుప్తా, వెంకటసుబ్బయ్య, హైపర్ కమిటి సభ్యులు మునిశేఖర్‌రెడ్డి త నిఖీల్లో పాల్గొన్నారు.
ఆర్‌ఐఓ, మీడియా మధ్య వాగ్వాదం
కడపలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రానికి ఉదయం 8.30 గంటలకే ఆర్‌ఐఓ ్రపసాద్‌రావు చేసుకున్నారు. ఆ సమయంలో ఎలక్ట్రానిక్ మీడియాకు చెందిన కొంత మంది ప్రతినిధులు కవరేజ్ కోసం లోనికి ప్రవేశించటంతో ఆర్‌ఐఓ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పరీక్ష ఇంకా ప్రారంభం కాలేదు.. ప్రారంభం కాగానే వె ళ్తామని చెప్పినా ఆయన వినిపించుకోలేదు. మీరు లోపలికి రాకూడదని చెప్పారు. మీడియా ప్రతినిధులు ఆందోళన నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఆ సమయంలో జర్నలిస్టు సంఘం జిల్లా అధ్యక్షుడు రామసుబ్బారెడ్డి వచ్చి సర్ది చెప్పారు. ఆర్‌ఐఓ క్షమాపణ చెప్పడంతో సమస్య సద్దుమణిగింది.