ఇటీవల కురిసిన వర్షాలకు నియోజకవర్గంలో ఖరీఫ్ పంటలకు అపార నష్టం వాటిల్లింది. ఇక పంటలు అయిపోయినట్టేనని రైతులు ఆందోళన చెం దుతున్నారు. ఖరీఫ్ ఆరంభంలో కురిసిన తొలకరి వర్షాలకు సంతృప్తి చెంది రైతులు సాగుకు ఉపక్రమించారు. విత్తనాలు, ఎరువుల కోసం తీవ్ర అవస్థలు పడ్డారు. ధర్నాలు, ఆందోళనలు చేసి విత్తనాలు పొంది సాగు చేపట్టినా ప్రస్తుతం పంట దక్కేట్లు లేదు. మొలకలు ఎదిగి పెసర పంట కొన్ని ప్రాంతాల్లో పూత, కాత దశల్లో ఉన్న తరుణంలో వర్షాలు కురువడంతో చేలల్లో నీరు నిలిచి మొలకలు ఎర్రబారి కుళ్లిపోతున్నాయి. చేలల్లో కనీసం కలుపుతీసేందుకు కూడా కూలీలు వెళ్లలేకుండా చేలు బురదమయంగా మారాయి. ఇదిలాఉండగా సోమవారం అర్ధరాత్రి కురిసిన వర్షం అన్నదాతలను అతలాకుతలం చేసింది. వర్షం ఏకబిగిన పడడంతో చేలు చెరువులను తలపించాయి. అంతేకాదు వరదనీటి కారణంగా చేలల్లో మట్టి కొట్టుకువచ్చి ఇసుకమేటలు వేశాయి.
ఖరీఫ్ పంటలు ఖతమే!
Published Thu, Aug 15 2013 5:38 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
నష్టం అంచనావేయని అధికారులు
నారాయణఖేడ్ వ్యవసాయ డివిజన్ పరిధిలో పెసర పంటను 2,200హెక్టార్ల లో, మినుము 4,200, మొక్కజొన్న 2,500, కంది 4,300, సోయాబిన్ 4,830, పత్తి 4,800హెక్టార్లలో రైతులు సాగుచేశారు. ఈ పంటల్లో పెసర పంట దాదాపు ఎందుకూ పనికిరాకుండా పోయింది. కాత, పూత దశలో ఉన్న పంటకు చేలల్లో నీరు నిలవడంతో కుళ్ళిపోతుంది. మినుము, పత్తి పరిస్థితి కూడా ఇదే తరహాలో ఉంది. కంది పంటకూడా ఎందిగే అవకాశం లేదని రైతులంటున్నారు. ఈ పంటలు చేతికిరావడం కష్టమేనని రైతులు చెబుతున్నారు. సాగుచేసిన పంటలో 80 శాతం పంటలు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇంకా పంటనష్టంపై ఓ అంచనాకు రాలేదు.
పెట్టుబడులు పోయినట్టే
ఖరీఫ్ సీజన్‌లో పంటసాగుకు రైతులు పెట్టిన పెట్టుబడులు పోయినట్టే. దుక్కిదున్ని, విత్తనాలు విత్తడం, కలుపుతీతలు, పురుగుమందు పిచికారీ, యూరియా వేయడం తదితరాలకు ఒక్కో పంటకు రైతుకు సరాసరి రూ.10 వేల పైగానే పెట్టుబడులు అయ్యాయి. వర్షంతో పంటకుళ్లిపోయి ఈ పెట్టుబడులు చేతికందవని రైతులు పేర్కొంటున్నారు. అధికారులు పంటనష్టంపై అంచనావేసి పరిహారం ఇస్తేనే తేరుకునే పరిస్థితి ఉంది. దాదాపు అన్ని పంటలు దెబ్బతినడంతో అన్నదాతలు లబోదిబోమంటున్నారు. తమకు సాయమందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
Advertisement
Advertisement