- ఏపీ బులియన్ గోల్డ్, సిల్వర్ అండ్ డైమండ్ మర్చంట్స్ అసోసియేషన్ డిమండ్
నరసరావుపేట వెస్ట్: బంగారం వస్తువులపై విధించిన సెంట్రల్ ఎక్సైజ్ పన్నును ఉపసంహరించాలని, అప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా తమ పోరాటం కొనసాగుతుందని ఏపీ బులియన్ గోల్డ్, సిల్వర్ అండ్ డైమండ్ మర్చంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కపలవాయి విజయకుమార్ స్పష్టం చేశారు. పన్నును వ్యతిరేకిస్తూ వ్యాపారులు చేపట్టిన నిరవధిక బంద్ కార్యక్రమం గురువారానికి రెండవ రోజుకు చేరుకుంది. వ్యాపారులంతా తమ షాపులను మూసేసి మెయిన్‌రోడ్డులోని శ్రీ శారదా జ్యూయలరీ మార్టు ముందు కూర్చోని నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా విజయకుమార్ విలేకరులతో మాట్లాడుతూ ఇదే డిమాండ్‌పై గతంలో కొన్నిరోజులు వ్యాపారులు బంద్ పాటించారని గుర్తుచేశారు. అయితే కార్పోరేట్ వ్యాపారులు కొంతమంది బంద్‌ను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. విజయవాడ, గుంటూరుల్లో ఆయా కార్పోరేట్ సంస్థల ముందు వ్యాపారులు కూర్చోని బంద్‌కు సహకరించాలని కోరారన్నారు. సెంట్రల్ ఎక్సైజ్ కమిషనర్ పన్నును ఉపసంహరించకుండానే తామేమి వ్యాపారులను ప్రశ్నించమని, తనిఖీలు చేపట్టమని చెబుతున్నా అవేమీ నెరవేరేవి కావన్నారు. పన్నును ఉపసంహరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా 30 వేల మంది వ్యాపారులు, వారిపై ఆధారపడిన పనివారు ఇబ్బందులు పడతారన్నారు. నరసరావుపేట అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు గొడవర్తి చంద్రశేఖరరావు, కాపులపల్లి ఆదిరెడ్డి, కోశాధికారి కూకుట్ల కృష్ణారావు, పలువురు వ్యాపారులు పాల్గొన్నారు.