ఎక్సైజ్ అధికారులకు ‘టీడీపీ’ గాలం! | Excise officials and liquor traders TDP leaders | Sakshi
Sakshi News home page

ఎక్సైజ్ అధికారులకు ‘టీడీపీ’ గాలం!

Published Fri, Sep 12 2014 2:14 AM | Last Updated on Wed, Sep 5 2018 8:43 PM

ఎక్సైజ్ అధికారులకు ‘టీడీపీ’ గాలం! - Sakshi

ఎక్సైజ్ అధికారులకు ‘టీడీపీ’ గాలం!

 సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఇచ్ఛాపురం పరిసరాల్లో నాలుగు రోజులుగా ఎక్సైజ్ అధికారులు, సిబ్బంది చేసిన దాడులు జిల్లా టీడీపీ నేతల్లో కలకలం సృష్టిస్తోంది. ఒడిశా నుంచి అక్రమంగా ఇచ్ఛాపురానికి ఎన్‌డీపీఎల్ (పన్ను చెల్లించని ఇతర ప్రాంతాల మద్యం) సరుకు భారీగా తరలుతోందన్న సమాచారంపై హైదరాబాద్, విశాఖ సహా జిల్లా ఎక్సైజ్ అధికారులు పక్కా నిఘాతో దాడు లు నిర్వహించారు. వివిధ ప్రాంతాల్లో 10 కేసుల మద్యాన్ని గుర్తించి సీజ్ చేసి కేసు నమోదు చేశారు. ఇదే సమయంలో టీడీపీకి చెందిన కొంతమంది వ్యాపారులు ఈ కేసులో ఇరుక్కునే అవకాశం ఉండడంతో అక్కడి నేత ఒకరు లోపాయికారీగా ఎక్సైజ్ అధికారులతో సమీక్షించి తమ వారిని తప్పించాలని, మద్యం ఒడిశాకు చెందినది కావడంతో కేసును అక్కడికే బదిలీ చేయాలని ఒత్తిడి చేస్తున్నట్టు తెలిసింది.
 
  నిబంధనలకు భిన్నంగా కేసు బదలాయించడం అధికారుల్ని విస్తుపోయేలా చేస్తోంది. నాయకుల ఒత్తిళ్లతో ఎక్సైజ్ అధికారులు మిన్నకుండిపోవాల్సివచ్చింది. అయితే దాడుల విషయాన్ని అధికారి కంగా తెలుసుకున్న ఉన్నతాధికారులు రాజధాని నుంచి వాకబు చేశారు. దేశం నేతలే యజమానులుగా ఉన్న మద్యం దుకాణాలకు వివిధ ప్రాంతాలనుంచి బిల్లు/పన్ను చెల్లించని మద్యం వస్తోందని, భారీ లాభాలతో సిండికేట్లు కుమ్మక్కై ఏపీలో విక్రయిస్తున్నట్టు గుర్తించి మరో ప్రత్యేక బృందాన్ని కూడా ఇచ్ఛాపురం పరిసర ప్రాంతాలకు పంపించినట్టు తెలిసింది. తాజాగా గురువారం మరో కీలక అంశం తెరపైకి వచ్చింది.
 
 చంద్రబాబు రాకతో..
 ఈ నెల 17, 18 తేదీల్లో టీడీపీ అధినేత చంద్రబాబు జిల్లాలో పర్యటించనుండడంతో జిల్లా యంత్రాంగం ఆ మేరకు ఏర్పాట్లు చేపట్టింది. బాబు వస్తే తమ బండారం బయటపడుతుందన్న ఆందోళనలతో అక్రమ మద్యంతో బంధం ఉన్న బడా బాబులంతా ఇప్పుడు ఎక్సైజ్ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. కేసులు లేకుండా, దాడుల్ని ఇక్కడితో ఆపేయాలని, అసలు తమ ప్రాంతంలో అక్రమ మద్యం లేనే లేదని చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. స్థానిక మంత్రి, ఇతర నేతలతో ఎక్సైజ్ అధికారులతో ఒత్తిడి తెస్తున్నారు.
 
  నా ప్రాంతంలో నా అనుమతి లేకుండా దాడులకు ఎలా వస్తారంటూ స్థానిక ఎమ్మెల్యే సైతం ప్రశ్నిస్తున్నట్టు తెలిసింది. లారీ లోడు అక్రమంగా సరఫరా అయిందని గుర్తించిన తరువాతే దాడులకు పూనుకున్న అధికార యంత్రాంగానికి పది కేసులే పట్టుబడడం విచిత్రంగా ఉందని ఎక్సైజ్ సిబ్బందే చెబుతున్నారు. అయితే నేతల ఒత్తిళ్లతో ఇచ్ఛాపురం, సోంపేట సీఐలు ఉన్నతాధికారులకు సహకరించడం లేదనే విమర్శలున్నాయి. ‘మామూలు’గా సరిపెట్టేయండంటూ రాష్ర్టస్థాయిలో నేతల నుంచి ఒత్తిళ్లు రావడం, సీఎం వస్తున్న సమయంలో కేసుల హడావుడి ఏంటని నేతలు గద్దిస్తున్నట్టు తెలిసింది. అందినంత మేర వసూలు చేసి వెనక్కు వెళ్లిపోవాలని, దాడుల పేరిట మద్యం వ్యాపారుల్ని ఆందోళనకు నెట్టొద్దంటూ పరోక్ష హెచ్చరికలు చేస్తున్నట్టు భోగట్టా.
 
 ఏసీబీకీ సమాచారం
 ఎమ్మార్పీ కంటే అధికంగా మద్యం విక్రయించడం, బినామీల పేరిట లెసైన్సులు పొందడం, అధికారులకు భారీగా లంచాలు ముట్టజెప్పడం వంటి అంశాల్లో లుకలుకలు బయటపడి అవినీతి నిరోధకశాఖ అధికారులు రెండేళ్ల క్రితం రాష్ట్రవ్యాప్తంగా కేసులు నమోదు చేశారు. అప్పట్లో ఈ అంశం భారీగా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో తమకు అందిన సమాచారాన్ని నేతల ఒత్తిళ్ల మేరకు ఎక్సైజ్ సిబ్బంది ఏసీబీకీ  అందించినట్టు తెలిసింది. వంద మంది సిబ్బంది, 20 జీపులు, హైదరాబాద్ నుంచి డీఎస్పీ తనిఖీలు, నిఘా కోసం వస్తే నేతల ఒత్తిళ్లు, సీఐల సహాయ నిరాకరణ నేపథ్యంలో ఏసీబీ కూడా దృష్టి సారించినట్టు తెలిసింది. ప్రభుత్వ ఉద్యోగులు భారీ ఆస్తులు సంపాదించడంపైనా కన్నేసినట్టు సమాచారం.
 
 సరిహద్దు ప్రాంతాల్లో పన్ను చెల్లించని మద్యం సరఫరా విషయంలో కొత్తూరు, పాతపట్నం ప్రాంతాల్లోనూ ఎక్సైజ్ బృందాలు త్వరలో దాడులకు దిగనున్నట్టు తెలిసింది. కేవలం ఊహించిన స్థాయిలో స్టాకు దొరకలేదన్న ఒకే ఒక్క కారణంతో ఎక్జైజ్ అధికారులపై స్థానిక సిబ్బంది, టీడీపీ నాయకులు ఒత్తిళ్లు తెస్తూ ఇంతటితో ఇది ఆపేయాలని డిమాండ్ చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సరిహద్దు ప్రాంతాల్లో స్థానిక ఎక్సైజ్ సిబ్బందికీ వాటాలున్నట్టు తెలుస్తోంది. అక్రమ మద్యం వ్యాపారానికి పరోక్షంగా అబ్కారీశాఖ సిబ్బందే సహకరిస్తున్నట్టు తెలుస్తుండడంతో రాజధాని నుంచి ఉన్నతాధికారులు కూడా సీరియస్‌గా పరిశీలిస్తున్నట్టు సమాచారం. మొత్తానికి ఈ అంశం అటు ఎక్సైజ్‌లోనూ, ఇటు తెలుగుదేశం పార్టీలోనూ చర్చనీయాంశమైంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement