ఖమ్మం గాంధీచౌక్, న్యూస్‌లైన్: చాంబర్ ఆఫ్ కామర్స్‌ను జిల్లావ్యాప్తంగా విస్తరించాలని కలెక్టర్ ఐ. శ్రీనివాస శ్రీనరేష్ సూచించారు. ఆదివారం రాత్రి చాంబర్ ఆఫ్ కామర్స్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం భద్రాద్రి బ్యాంక్ చైర్మన్ చెరుకూరి కృష్ణమూర్తి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా ఆవిర్భవించి 60 ఏళ్లు అవుతోందని, పారిశ్రామిక, వ్యవసాయ రంగాల్లో ముందంజలో ఉందని అన్నారు. మరింతగా ముందుకెళ్లేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని చెప్పారు. విద్యావంతులైన పలువురు యువతీ యువకులు నిరుద్యోగులుగా ఉన్నారని, వారికి చేయూతనందిస్తే వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారని అన్నారు. జిల్లా కేంద్రంలో అనేక సమస్యలున్నాయని, ప్రధానంగా ట్రాఫిక్ సమస్య నెలకొందని అన్నారు.
రహదారులను అభివృద్ధి చేయడంతోపాటు నగరంలో వ్యాపారాలను శివారు ప్రాంతాలకు విస్తరింపచేయాలని సూచించారు. నగరాభివృద్ధికోసం వివిధ శాఖల అధికారులతో చర్చిస్తున్నామని తెలిపారు. జిల్లా కేంద్రంలో ఇన్నర్ రింగ్‌రోడ్, అవుటర్ రింగ్‌రోడ్ కోసం ప్రణాళిక రూపొందిస్తున్నామని చెప్పారు. జిల్లాలో అపారంగా ఖనిజ సంపద ఉందని, దానికి అనుగుణంగా పరిశ్రమలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. రైతులు దగా కాకుండా చాంబర్ ఆఫ్ కామర్స్ ఉద్భవించిందని, మార్కెట్‌లలో వ్యాపారులు నిర్ణయించిన ధరలకు పంట ఉత్పత్తులను కొనుగోలు చేసి రైతులు దగా కాకుండా చేయడం హర్షణీయమని పేర్కొన్నారు. నూతనంగా ఎన్నికైన చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధుల సేవలు రైతులకు, ప్రజలకు అందించాలని తెలిపారు.
చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు మేళ్లచెర్వు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ చాంబర్ ఆఫ్ కామర్స్‌కు జిల్లా అసోసియేషన్‌గా విస్తరింపచేసేందుకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు. ప్రభుత్వం త్రీటౌన్ సమీపంలో 100 ఎకరాల స్థలాన్ని కేటాయించి మోడ్రన్ మార్కెట్ ఏర్పాటు చేయాలని కోరారు. త్రీటౌన్ నుంచి ప్రభుత్వానికి రూ.12 కోట్ల రెవెన్యూ వస్తోందన్నారు. త్రీటౌన్‌లో ఉన్న మార్కెట్‌ను బస్టాండ్‌గా అభివృద్ధి చేస్తే అందరికీ సౌకర్యంగా ఉంటుందని తెలిపారు. వ్యాపార విద్యా విశ్లేషకురాలు వై.శ్రీదేవి మాట్లాడుతూ ప్రజల్లో వ్యాపారుల పట్ల వ్యతిరేక భావన ఉందన్నారు. వ్యాపారులు ఆ విధంగా వ్యవహరించకుండా ఉండాలని కోరారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఎండీ శైలజా కిరణ్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించగా, తెలుగు వేద, సినీ కవి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు ప్రసంగించారు. చాంబర్ ఆఫ్‌కామర్స్ అధ్యక్షుడు మేళ్లచెర్వు వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షులు గొడవర్తి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి చిన్ని కృష్ణారావు, సహాయ కార్యదర్శి చింతల రామలింగేశ్వరరావు, కోశాధికారులు కురువెళ్ల ప్రవీణ్‌కుమార్, తూములూరి లక్ష్మీ నరసింహారావులతోపాటు పాలకవర్గ సభ్యులు, వివిధ శాఖల అధ్యక్ష,కార్యదర్శులతో ఎన్నికల అధికారి వీవీ అప్పారావు ప్రమాణస్వీకారం చేయించారు.
ఆత్మీయ అతిథులకు అవమానం..
ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన ఆత్మీయ అతిథులు అవమానానికి గురయ్యారు. ఆత్మీయ అతిథులుగా ఆహ్వాన పత్రికల్లో ప్రచురించినప్పటికీ ప్రమాణ స్వీకార సమయంలో వారి గురించి మాట్లాడక పోవడం, వేదికపైకి ఆహ్వానించకపోవడంతో విమర్శలు వెల్లువెత్తాయి. వెంపటి లక్ష్మీనారాయణ, కొప్పు నరేష్‌కుమార్, గుర్రం ఉమామహేశ్వరరావు, మెంతుల శ్రీశైలం తదితరులను విస్మరించడంతో వారు కాసేపు ఉండి వెళ్లిపోయారు.
చాంబర్ ఆఫ్ కామర్స్‌ను విస్తరించాలి
Published Mon, Oct 7 2013 4:18 AM | Last Updated on Fri, Sep 1 2017 11:24 PM
Advertisement
Advertisement