సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : తెలంగాణ ప్రాంత ప్రజల ఆకాంక్ష ను గౌరవిస్తూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కో సం సీడ బ్ల్యూసీ, యూపీఏ సమన్వయ క మిటీ సమావేశాల్లో ఏకగ్రీవ తీర్మానం చేయించిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలపడానికి ఆ పార్టీ నాయకులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన తెలంగాణ ప్రాంతంలోని మంత్రులు, సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధుల సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు అభినందన సభలు తెలంగాణ జిల్లాలో నిర్వహించడానికి కసరత్తు చేస్తున్నారు. అయితే మొదటి వేదిక జిల్లాలోని బోధన్ కానుంది. ముహూర్తమూ ఖరారైంది. సెప్టెంబర్ 4న సభ నిర్వహించ నున్నారు.
‘తెలంగాణ’ ప్రకటన నిర్ణయం తర్వాత నిర్వహిస్తున్న మొదటి సభ కావడంతో భారీ జన సమీకరణపై కాంగ్రెస్ నాయకులు దృష్టి సారించారు. సభ విజయవంతం కోసం జిల్లాకు చెందిన భారీ నీటి పారుదల శాఖ మంత్రి పి.సుదర్శన్‌రెడ్డి తగిన కార్యాచరణతో ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీలు డి.శ్రీనివాస్, షబ్బీర్‌అలీ, ప్రభుత్వ విప్ అనిల్, మాజీ స్పీకర్ కేఆర్.సురేశ్‌రెడ్డిలు సైతం ప్రత్యేక దృష్టి సారించారు. బోధన్, బాన్సువాడ, ఎల్లారెడ్డి నియోజక వర్గాలు మినహాయిస్తే జిల్లాలో విజయోత్సవ సంబరాల పేరుతో కాంగ్రెస్ పార్టీ సభలు, సమావేశాలు నిర్వహించింది. అందువల్లే సోనియా అభినందన సభను బోధన్‌లోని అంబేద్కర్ చౌరస్తాలో నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. సభకు రావాల్సిందిగా కోరుతూ తెలంగాణ ప్రాంతంలోని ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులకు డీసీసీ అధ్యక్షుడు తాహెర్ బిన్ హందాన్ లేఖలు రాయనున్నారు. ఈ సభలో తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రులు కే.జానారెడ్డి, డీకే.అరుణ, పొన్నాల లక్ష్మయ్య, బస్వరాజు సారయ్యలతో పాటు ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొంటారని అధికార పార్టీ నాయకులు తెలిపారు. తెలంగాణ ఇచ్చేది, తెచ్చేది తామేనన్న మాటను నిలబెట్టుకున్నందునే సంబురాలు జరుపుకుంటున్నామని ఆధికార పార్టీ నేతలు పేర్కొంటున్నారు.
ఎన్నికలే లక్ష్యంగా...
సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్ నాయకులు సభలు నిర్వహిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఎన్నికల నాటికి నియోజక వర్గాల్లో బలాన్ని పెంచుకోవడంతో పాటు కేడర్ ను సన్నద్ధం చేయడం ద్వారా సీటును పదిలపరచుకోవడానికి ఆశావహులు ఇప్పటికే తెలంగాణ విజయోత్సవ సంబురాలు జరిపారు. ప్రథమంగా పీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ డి.శ్రీనివాస్ నిజామాబాద్‌లో తెలంగాణ విజయోత్సవ సభ నిర్వహించారు. మరో ఎమ్మెల్సీ షబ్బీర్‌అలీ కామారెడ్డిలో సభ ఏర్పాటు చేశారు. ఆర్మూర్ మండలం పెర్కిట్‌లో మాజీ స్పీకర్ సురేశ్‌రెడ్డి కూడా విజయోత్సవ ర్యాలీ తీశారు. రాష్ర్ట ఏర్పాటు ప్రక్రియ వేగవంతంపై దృష్టి సారించకుండా సంబరాలకే పరిమితమైతే ఎలా అని తెలంగాణవాదులు ప్రశ్నిస్తున్నప్పటికీ.. కాంగ్రెస్ నేతలు మాత్రం ప్రచారంపైనే దృష్టి సారించడం గమనార్హం. ఇదిలా ఉండగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తన ఘనతేనని కొందరు గొప్పలకు పోతున్నారని, వాటికి చెక్ పెట్టడానికే ఇలాంటి సభలకు శ్రీకారం చుట్టినట్టు తెలుస్తోంది. పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ చలువ, తెలంగాణ కాంగ్రెస్ నేతల సమష్టి కృషి వల్లే రాష్ట్ర విభజన ప్రకటన వచ్చిందన్న సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావించి వారీ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
4న ‘అభినందనసభ’
Published Sat, Aug 31 2013 3:19 AM | Last Updated on Fri, Sep 1 2017 10:17 PM
Advertisement
Advertisement