వార్తలకు ప్రాణం వాస్తవాలు
జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం
రాష్ట్ర అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి
యూనివర్సిటీ క్యాంపస్: జర్నలిస్టులు వార్తలు రాసే ముందు నిజాలను నిర్ధారించుకోవాలని రాష్ట్ర అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సూచించారు. ఎస్వీ యూనివర్సిటీలో శనివారం జర్నలిస్టుల శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు. ఏపీయూడబ్ల్యూజే, మెఫి సంస్థలు సంయుక్తంగా శిక్షణ తరగతులు నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఒక్కో పత్రిక ఒక్కో పంథా అనుసరిస్తోందని, వాస్తవాలు తెలుసుకోవాలంటే నాలుగైదు పత్రికలు చదవాల్సి వస్తోందన్నారు. తమ ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉందని చెప్పారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి కృషి చేస్తామని చెప్పారు. తిరుపతి ఎంపీ వరప్రసాద్ మాట్లాడుతూ ఏ వృత్తి వారికైనా శిక్షణ, క్రమశిక్షణ అవసరమన్నారు.
జర్నలిస్టులకు ఉద్యోగభద్రత, కనీస వేతనాల అమలుకు తనవంతు కృషిచేస్తామన్నారు. తిరుపతి ఎమ్మెల్యే ఎం.సుగుణమ్మ మాట్లాడుతూ జర్నలిస్టులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. మెఫి అధ్యక్షుడు, మన తెలంగాణ పత్రిక సంపాదకుడు కె.శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టులకు లోకజ్ఞానం, అక్షరజ్ఞానం, కంప్యూటర్ పరిజ్ఞానం అవసరమన్నారు. ఐజేయూ సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్ మాట్లాడుతూ జర్నలిస్టులు కొత్త విషయాలను నేర్చుకోకపోతే వెనుకబడిపోతారన్నారు. ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షుడు సోమసుందర్ మాట్లాడుతూ జర్నలిజం రంగంలో రోజురోజుకు మార్పులు వస్తున్నాయన్నారు. కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి ఐవీ సుబ్బారావు. మెఫి ట్రస్టీ పోగ్రాం కోఆర్డినేటర్ వై.నరేంద్రరెడ్డి, మెఫి ట్రస్టీ రాష్ట్ర అధ్యక్షుడు అంబటి ఆంజనేయులు, ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు మురళీమోహన్, కార్యదర్శి మన్నెం చంద్రశేఖర్‌నాయుడు, ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు సుధీర్‌రెడ్డి, కార్యదర్శి గిరిబాబు పాల్గొన్నారు.