నూజివీడులో ముద్దరబోయిన ర్యాలీ
నూజివీడు, న్యూస్‌లైన్ : టీడీపీ నూజివీడు టికెట్ ఖాయమైందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో గన్నవరం మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావు సోమవారం ఆగిరిపల్లి మండలం అడవినెక్కలం నుంచి నూజివీడు వరకు ద్విచక్రవాహనాలతో ర్యాలీ నిర్వహించారు. ఆగిరిపల్లి, నూజివీడు మండలాలకు చెందిన టీడీపీ ద్వితీయశ్రేణి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్న ఈ ర్యాలీ ఆగిరిపల్లి, ఈదులగూడెం, వట్టిగుడిపాడు, రామన్నగూడెం మీదుగా నూజివీడుకు చేరుకుంది.
అనంతరం జంక్షన్‌రోడ్డులో పెట్రోలు బంకు పక్కసందులో ఏర్పాటుచేసిన ఆయన కార్యాలయం వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ముద్దరబోయిన మాట్లాడుతూ మొదటిసారిగా నియోజకవర్గంలో నిర్వహించిన ర్యాలీకి మంచి స్పందన లభించిందన్నారు. పట్టణంలోకి వచ్చిన తరువాత టీడీపీ మండలాధ్యక్షుడు కాపా శ్రీనివాసరావు, పోతురెడ్డిపల్లి సర్పంచి అక్కినేని చందు ముద్దరబోయినతో పాటు ర్యాలీలో పాల్గొన్నారు.
దూరంగా ఉన్న టీడీపీ పట్టణ నాయకులు...
ఆ పార్టీకి చెందిన పట్టణ నాయకులు మాత్రం ఈ ర్యాలీకి దూరంగా ఉన్నారు. పట్టణంలోని నాయకులు ఏ ఒక్కరూ పాల్గొనకపోవడం చర్చనీయాంశంగా మారింది. పట్టణ అధ్యక్షుడు నూతక్కి వేణు, నాయకులు పసుపులేటి జగన్, మోచర్లకృష్ణంరాజు, మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ బొబ్బిలి ఝాన్సీ, కందుల సత్యన్నారాయణ తదితరులెవరూ ఈ ర్యాలీ దరిదాపుల్లోకి కూడా రాలేదు.
ర్యాలీపై కేసు నమోదు చేసిన పోలీసులు.
ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున అనుమతి లేకుండా పార్టీ జెండాలతో భారీ సంఖ్యలో ద్విచక్రవాహనాలతో పట్టణంలో ర్యాలీ నిర్వహించినందున పట్టణ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ బోనం ఆదిప్రసాద్ తెలిపారు. ర్యాలీ నిర్వహించినంత సేపు పోలీసులు వీడియోచిత్రీకరణ చేశారు.