► నకిలీ డాక్యుమెంట్లతో బేరం
► నాల్గో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు
► నిందితులకు అధికార పార్టీ నేతల అండ?
అనంతపురం: నగరంలో కబ్జారాయుళ్లు రెచ్చిపోతున్నారు. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ఖరీదైన స్థలాలను కారుచౌకగా కొట్టేస్తున్నారు. అసలు యజమాని సీనులోకి వస్తే తమకూ రిజిస్ట్రేషన్ అయిందంటూ బెదిరింపులకు గురి చేస్తున్నారు. పైగా అధికార పార్టీ నేతల అండ కూడా ఉండడంతో సామాన్య ప్రజలు భయపడిపోతున్నారు. తాజాగా అనంతపురం నగరంలోని మారుతీనగర్‌లో రూ. కోటి విలువైన ఆస్తిపై కొందరు కన్నేశారు. ఈ క్రమంలో నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి బేరం పెట్టారు. విషయం తెలుసుకున్న స్థల అసలు యజమాని లబోదిబోమంటున్నారు. ఈ క్రమంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వివరాలు.. మారుతీనగర్ శివారులో పది సెంట్ల స్థలాన్ని ఓ వ్యక్తి కొన్నేళ్ల క్రితం కొనుగోలు చేశాడు. ఈ స్థలంపై వేణుగోపాల్‌నగర్ తారకరామాపురం కొట్టాలకు చెందిన ఇద్దరు సోదరుల కన్నుపడింది. దీంతో అసలు యజమాని ప్రమేయం లేకుండానే ఈ స్థలాన్ని మరో నలుగురి వ్యక్తులపై రిజిస్ట్రేషన్ చేయించారు. ఆ నలుగురికి కొంత మొత్తం ఇచ్చేటట్లు ఒప్పందం చేసుకున్నారు. అసలు య జమాని డాక్యుమెంట్లను నకిలీవి సృష్టించారు. చివరకు రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు కూడా నకిలీకి జత చేసినట్లు తెలిసింది. నలుగురి పేర్ల మీద ఉన్న ఆస్తిని తిరిగి మరో వ్యక్తికి అమ్మేందుకు పూనుకున్నారు. ఈ క్రమంలో రూ.5 లక్షల వరకు అడ్వాన్స్ కూడా చెల్లించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఐదు రోజుల క్రితం కొనుగోలు చేసిన వ్యక్తి స్థలాన్ని శుభ్రం చేయిస్తున్నాడనే సమాచారంతో అసలు యజమాని అక్కడికి చేరుకున్నాడు. తనస్థలంలో ఎందుకు శుభ్రం చేయిస్తున్నారని ప్రశ్నించారు.
తనకు ఫలానా వారు అమ్ముతున్నారని కొనుగోలు చేసిన వ్యక్తి చెప్పాడు. డాక్యుమెంట్లను పరిశీలించిన అసలు యజమాని తమ స్థలానికి సంబంధించి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించినట్లు గుర్తించారు. దీంతో లబోదిబోమంటూ నాల్గో పట్టణ పోలీస్‌స్టేషన్‌కు పరుగులు తీశాడు. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో నకిలీ డాక్యుమెంట్లు సృష్టించిన ఇద్దరు వ్యక్తులతో పాటు, రిజిస్ట్రేషన్ చేయించుకున్న నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వారిలో ఓ మహిళ కూడా ఉన్నట్లు తెలిసింది. కాగా సూత్రధారులైన ఇద్దరు సోదరులకు అధికార పార్టీకి చెందిన నేత ఒకరు సహకరిస్తున్నట్లు సమాచారం.
రూ. కోటి ఆస్తిపై కన్ను !
Published Sun, Mar 27 2016 2:00 AM | Last Updated on Fri, May 25 2018 6:12 PM
Advertisement
Advertisement