Leaders of the ruling party
-
తమ్ముళ్ల బరితె గింపు!
► వైఎస్సార్ సీపీ నిజనిర్ధారణ కమిటీ పర్యటన విజయవంతం కావడాన్ని జీర్ణించుకోలేక టీడీపీ కవ్వింపు చర్యలు ► అమరావతి మండలం నరుకుళ్ళపాడులో ఇరువర్గాల ఘర్షణ ► మొత్తం 12 మందికి గాయాలు.. గుంటూరు పెద్దాసుపత్రిలో చికిత్స ► వైఎస్సార్సీపీ కార్యకర్తలను పరామర్శించిన కావటి మనోహర్ నాయుడు సాక్షి, గుంటూరు : అధికార పార్టీ కార్యకర్తలు అడ్డగోలు రాజకీయాలకు తెరతీశారు. గ్రామాల్లో ప్రశాంత వాతావరణాన్ని భగ్నం చేస్తూ దాడులకు తెగబడుతున్నారు. అమరావతి సదావర్తి సత్రం భూముల కుంభకోణంపై వైఎస్సార్ సీపీ ఏర్పాటు చేసిన నిజనిర్ధారణ కమిటీ ఆదివారం జరిపిన పర్యటన విజయవంతమైంది. దీన్ని జీర్ణించుకోలేని తెలుగు తమ్ముళ్లు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో సోమవారం అమరావతి మండలం నరుకుళ్లపాడులో వైఎస్సార్సీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తింది. మొత్తం 12 మంది గాయపడగా, వారిలో ఆరుగురు వైఎస్సార్సీపీ కార్యకర్తలు కాగా, ఆరుగురు టీడీపీ కార్యకర్తలు ఉన్నారు. అమరావతిలోని సదావర్తి సత్రం భూముల కుంభకోణంపై ఆదివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిజనిర్ధారణ కమిటీ అమరావతిలో పర్యటించింది. ఈ క్రమంలో పార్టీ పెదకూరపాడు నియోజకవర్గ శ్రేణులు ఈ పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దీన్ని జీర్ణించుకోలేని తెలుగు తమ్ముళ్ళు అమరావతిలో నిజనిర్ధారణ కమిటీని అడ్డుకుని ఉద్రిక్తత వాతావరణం సృష్టించే ప్రయత్నం చేశారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలు పూర్తి సం యమనం పాటించిన క్రమంలో పోలీసులు జోక్యం చేసుకుని టీడీపీ కార్యకర్తలను చెల్లాచెదురు చేశారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున కమిటీకి ఘనస్వాగతం పలకడంతోపాటు పర్యటనను విజయవంతం చేశారు. దీంతో టీడీపీ గ్రామస్థాయి నేతల్లో ఆక్రోశం మొదలైంది. ఈ క్రమంలో అమరావతి మండలం నరుకుళ్ళపాడు ఎస్సీ కాలనీలో టీడీపీ, వైఎస్సార్ సీపీ వర్గాల మధ్య జరిగిన పరస్పర దాడిలో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. టీడీపీ కార్యకర్తలు కవ్వింపు చర్యలకు పాల్పడి రెచ్చగొట్టి తొలుత వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడి చేశారు. దీంతో కార్యకర్తలు మేకల విజయ్, మేకల బుల్లెబ్బాయి, మేకల సురేష్, మేకల భారతి, మేకల రాంబాబు, రాణిలపై దాడి చేయగా తీవ్ర గాయాలయ్యాయి. వీరు కూడా వారిని ప్రతిఘటించి క్రమంలో ఎదురు దాడి చేయటంతో ఆ వర్గంలో కూడా ఆరుగురికి గాయాలయ్యాయి. అమరావతి సీఐ మురళీకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నరుకుళ్లపాడు దాడిలో గాయపడిన వైఎస్సార్ సీపీ కార్యకర్తలను పెదకూరపాడు నియోజకవర్గ సమన్వయకర్త కావటి మనోహర్‌నాయుడు పరామర్శించి ఆస్పత్రి సిబ్బందితో మాట్లాడి మెరుగైన వైద్యం కోసం గుంటూరు తరలించారు. గాయపడిన వారిని పరామర్శించిన వారిలో మండల పార్టీ నాయకులు కోటహరిబాబు, ఆలా లక్ష్మీనారాయణ, మేకల హనుమంతరావు, చింకా వెంకటేశ్వర్లు, నాగేశ్వరరావు, హష్మీ, పాపారావు, రాయల సాంబశివరావు, నెహ్రూ, రోశయ్య, శ్రీనివాసరెడ్డి తదితరులు ఉన్నారు. కఠినంగా శిక్షించాలి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కవ్వింపు చర్యలకు పాల్పడి గ్రామాల్లో ప్రశాంత వాతావరణాన్ని భంగపరుస్తున్నారని పెదకూరపాడు నియోజకవర్గ సమన్వయకర్త కావటి మనోహర్‌నాయుడు మండి పడ్డారు. సోమవారం రాత్రి ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. పార్టీ నిజనిర్ధారణ కమిటీ పర్యటన విజయవంతమైందనే అక్కసుతో గ్రామంలో కవ్వింపు చర్యలకు పాల్పడి తమ పార్టీ కార్యకర్తలపై దాడిచేశారని, టీడీపీ ప్రభుత్వం గ్రామాల్లో చిచ్చుపెడుతూ పబ్బం గడుపుతుందని మండి పడ్డారు. దీనిపై జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేసి చర్యలు తీసుకోవాలని కోరనున్నట్లు తెలిపారు. -
‘రఘుపై నిర్భయ కేసు నమోదు చేయాలి’
అనంతపురం : గుమ్మఘట్ట మండలం బైరవానితిప్పకు చెందిన ఇద్దరు మహిళలను వంచించిన అధికార పార్టీ నేత సోదరుడు రఘుపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేయాలని వైఎస్సార్సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు బోయ సుశీలమ్మ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమెతో పాటు రాష్ట్ర కార్యదర్శి కేఎల్ దేవి, జిల్లా ప్రధాన కార్యదర్శులు టి.కృష్ణవేణి, కె.పార్వతి, బీకేఎస్ కొండమ్మ మాట్లాడారు. రఘు ఓ బాలికతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూనే మరోవైపు తన అక్క కూతురిని వివాహం చేసుకున్నాడన్నారు. వివాహేతర సంబంధం విషయం తెలిసి మనస్థాపానికి గురైన కట్టుకున్న భార్య గతంలో ఆత్మహత్య చేసుకుందని గుర్తు చేశారు. మరోవైపు గర్భవతి అయిన బాలిక పెళ్లి చేసుకోవాలని కోరడంతో అధికారబలంతో బెదిరింపులకు పాల్పడ్డాడని ఆరోపించారు. దీంతో సదరు బాలిక కూడా ఆత్మహత్య చేసుకుందన్నారు. తన సోదరుడు టీడీపీ నాయకుడనే ధైర్యంతోనే రఘు బరి తెగించాడని ధ్వజమెత్తారు. ఇద్దరు యువతుల జీవితాలతో చెలగాటం ఆడిన రఘును కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో అఖిలపక్ష మహిళా సంఘాలతో కలిపి ఉద్యమిస్తామని హెచ్చరించారు. -
టీడీపీలో విభేదాల కుంపటి!
► పనులు, పదవులు కొందరికే ఇవ్వడంపై ద్వితీయ శ్రేణి నాయకుల ఆగ్రహం ► మంత్రి సతీమణి వద్ద వాపోతున్న నేతలు ► పాలక పార్టీలో వర్గపోరుతో అధికారులకు శిరోభారం యడ్లపాడు: గ్రామాల్లో సాధారణంగా వివిధ పార్టీలకు చెందిన వర్గాలు ఉంటాయి. యడ్లపాడు మండలం లో ప్రతి గ్రామంలోనూ అధికార పార్టీలోనే రెండు వర్గాలు ఉండడం విశే షం. గ్రామాల్లో ఆధిపత్యం, ప్రభుత్వ కార్యాలయాలు, పోలీస్‌స్టేషన్‌లో అధికారులపై పెత్తనం, పదవులు పందేరం, కాంట్రాక్టు పనులు కైవసం చేసుకోవడంపై పార్టీ నాయకుల మధ్య పొత్తు కుదరకపోవడంతోనే విభేదాల కుంపటి రాజుకుంది. గతంలో మాటలతోనే సర్దుకుపోయేవారు. ఇప్పుడు ఆయా వర్గాల వారు గొడవలు పడి పోలీస్‌స్టేషన్ పంచాయతీలకు సైతం వెళ్లడం గమనార్హం. ఒక వర్గం అదే పార్టీకి చెందిన వ్యక్తికి సపోర్టు చేస్తే రెండోవర్గం వారు దానిని వ్యతిరేకిస్తారు. అవసరమైతే మంత్రి నివాసంలో పంచాయతీ ఏర్పాటు చేస్తారు. ఇలా గ్రామాల్లో ప్రతిచోటా టీడీపీలోనే రెండు వర్గాలు తయారయ్యాయి. ఈ రెండు వర్గాల నడుమ సామాన్యుడు నలిగిపోతున్నాడు. ద్వితీయశ్రేణి నాయకులకు రిక్తహస్తం ఎన్నికల సమయంలో పార్టీ గెలుపుకోసం అందరం సమష్టి కృషి చేసినా గ్రామాల్లో ప్రధాన నేతలకే పనులు, పెత్తనం కట్టబెట్టారని ద్వితీయ శ్రేణి నాయకులు ఆరోపిస్తున్నారు. తమను పట్టించుకోవడం లేదని గుర్రుగా ఉన్నారు. రెండు గ్రూపుల్లో ఒకవర్గం మంత్రిని కలిసి కాంట్రాక్టులు చేజిక్కించుకుండగా, రెండోవర్గం వారు మంత్రి సతీమణిని ఆశ్రయించి పనులు, పదవుల పంపకంలో తమకు జరిగిన అన్యాయాన్ని వెళ్లబోసుకుంటున్నారు. ఏ పని చేయాలన్నా దిగువ శ్రేణి నాయకులను పూర్తిగా విస్మరిస్తున్నారంటూ రగిలిపోతున్నారు. పార్టీకోసం పనిచేసిన వారికి కాకుండా తమ గ్రామంలో ఇతరులకు పనులు అప్పగించడంపై మండిపడుతున్నారు. మండలంలోని ఓ ఐదారుగురికి మినహా మిగిలిన వారిని పట్టించుకునే పరిస్థితి కన్పించడం లేదంటూ తెలుగు తమ్ముళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సామాజిక వర్గం, డబ్బు, నోరేసుకుని పడేవారికే పరపతి, పదవులు దక్కుతున్నాయంటూ వాపోతున్నారు. అధికారులకు శిరోభారం మొదట మంత్రి వద్ద మార్కులు కొట్టేసేందుకు అధికారపార్టీ నేతల అడుగులకు మడుగులొత్తిన అధికారులకు ఇప్పుడు శిరోభారంగా మారింది. గ్రామస్థాయి, మండలస్థాయి సమావేశాల్లో ఎవరిని పిలిస్తే ఏమవుతుందోనని భయపడుతున్నారు. టీడీపీ వర్గీయులు చెప్పినట్లు పనులు చేస్తున్న అధికారులు ఇప్పుడు రెండు వర్గాలు ఉండడంతో ఎవరికి పనులు చేస్తే రెండోవర్గం తమపై మంత్రి ఎదుట ఎలాంటి ఫిర్యాదు చేస్తారోనని ఆందోళన చెందుతున్నారు. -
ఎమ్మెల్యే కొమ్మాలపాటి ముసుగుదొంగ
వైఎస్సార్ సీపీ నేత బొల్లా క్రోసూరు:‘ పెదకూరపాడు శాసనసభ్యుడు కొమ్మాలపాటి శ్రీధర్ చాల గొప్పవాడు, ఘనుడు అంటూ గతంలో చెప్పుకునేవాళ్లు, ఇపుడే ఆయన చేసిన అక్రమాలతో కొమ్మాలపాటి ముసుగుదొంగ అని తేలిపోయింది’ అని వైఎస్సార్ సీపీ వినుకొండ నియోజకవర్గ ఇన్చార్జి బొల్లా బ్రహ్మనాయుడు పేర్కొన్నారు. క్రోసూరులోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి పానెం హనిమిరెడ్డితో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. కొమ్మాలపాటి ముసుగులో చేసిన అక్రమాల గుట్టు రాష్ట్రస్థాయిలో గుప్పుమందన్నారు. సదావర్తి సత్రం స్థలాల కుంభకోణం, ఇసుక అక్రమ వ్యాపారం, అభినందన రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఎన్నో అక్రమాలకు పాల్పడ్డాడని విమర్శించారు. అవినీతి ఎమ్మెల్యే కొమ్మాలపాటిపై సీబీఐ లేదా సీబీసీఐడీతో విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి చంద్రబాబును వైఎస్సార్ సీపీ డిమాండ్ చేస్తోందని అన్నారు. అధికారపార్టీ నేతల కనుసన్నల్లోనే తహశీల్దార్ వ్యవహరిస్తున్నారని ఆర్డీవో శ్రీనివాసరావుకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. నియోజకవర్గంలో మట్టి, ఇసుక దందాలు నానాటికీ పేట్రేగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు టీడీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. అక్రమంగా కోట్లు గడిస్తునార్నని తెలిపారు. క్రోసూరు ముస్లిం కమ్యూనిటీకి చెందిన మశీదు కాంప్లెక్స్ విషయంలో పోలీసు అధికారులు అధికారపార్టీ మాటలు విని మశీదు పెద్దలకు పార్టీలంటగట్టి కేసులు పెట్టడటం దుర్మార్గమని అన్నారు. మండల రెవెన్యూ అధికారులు ముడుపులిచ్చేవారికే గుట్టుచప్పుడుగా పనులు చేస్తున్నారని , అధికారపార్టీ నేతల కనుసన్నలలోనే తహసీల్దార్ కార్యాలయం నడుస్తుండటం శోచనీయమని పేర్కొన్నారు. వెబ్లాండ్లో క్రోసూరు భూములకు డాట్ పెట్టటంతో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయని ప్రజలు వాపోతున్నా తహసీల్దార్ మాత్రం పట్టించుకోవటం లేదని తెలిసిందన్నారు. -
నీరు-చెట్టు.. అవినీతిదే పెమైట్టు
► అడిగిన కాడికి ఇస్తేనే చెరువుల పూడిక తీత ► అగ్రిమెంట్ వసూళ్లలో పోటీ పడుతున్న నీటిపారుదల శాఖ అధికారులు కర్నూలు సిటీ: నీరు చెట్టు కార్యక్రమం లక్ష్యం నీరుగారుతోంది. అధికారులు, అధికార పార్టీ నేతలు ఈ కార్యక్రమాన్ని ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు. 100 ఎకరాల్లోపు ఆయకట్టు ఉన్న చెరువులను ఆయా గ్రామ పంచాయతీల్లో ఉన్న జన్మభూమి కమిటీలతో, ఆపైన ఆయకట్టు ఉన్న చెరువులను నీటి వినియోగదారుల సంఘాలతో పూడికతీత పనులు చేయించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే పనులు చేయించే వ్యక్తితో అగ్రిమెంట్ చేసుకోవాలని అందులో పేర్కొంది. దీనిని అవకాశంగా తీసుకున్న నీటిపారుదల శాక అధికారులు అగ్రిమెంట్ చేసేందుకు నీటి సంఘాలకు ఓ రేటు, జన్మభూమి కమిటీలకు మరో రేటు పెట్టి వసూళ్లు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చేసిన వసూళ్లలో అధికారపార్టీ నేతలకు సైతం వాటాలు ఇస్తున్నట్లు సమాచారం. అగ్రిమెంట్ వసూళ్లు ఇలా! జిల్లాలో చిన్న నీటి పారుదల శాఖ, పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో మొత్తం 634 చెరువులు ఉన్నాయి. ఈ ఏడాది మొత్తం 400 చెరువుల్లో పూడికతీత పనులు చేయాలని లక్ష్యం. ఇప్పటీ వరకు 323 పనులకు కలెక్టర్ అనుమతులు ఇచ్చారు. ఈనెల 13 వరకు 203 చెరువుల్లో మాత్రమే పూడికతీత పనులు ప్రారంభమయ్యాయి. నీటి సంఘం చేయించే పనికి రూ. 15 వేల నుంచి రూ. 40 వేల వరకు, జన్మభూమి కమిటీలకు అప్పగించిన వారి దగ్గర నుంచి రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు వసూళ్లు చేస్తున్నారు. నంద్యాల డివిజన్‌కు చెందిన ఓ చెరువు పూడికతీత పని చేయిస్తున్న వ్యక్తి అక్కడి సాంకేతిక విభాగం అధికారుల వసూళ్లపై ఫిర్యాదు చేసేందుకు ఇటీవల కర్నూలుకు వచ్చారు. ఎస్ఈ సెలవుల్లో వెళ్లారని తెలుసుకుని వెనక్కి వెళ్లారు. ఈ వసూళ్ల పర్యంపై ఓ అధికారిని అడిగితే నంద్యాల డివిజన్లో పని చేస్తున్న ఓ అధికారి వసూలు చేస్తున్నట్లు తెలిసిందని, కర్నూలు డివిజన్లో పని చేసే ఓ అధికారి కూడా అలా చేస్తున్నారని, అయితే అవి ఆఫీస్ ఖర్చులకు వాడుకుంటారని చెప్పడం గమనార్హం. ఈ అక్రమ వసూళ్లకు నంద్యాల ప్రాంతానికి చెందిన అధికార పార్టీ నేత అండ ఉండటంతో, అతనికి వాటా కూడా ముడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొత్తంమీద వసూళ్ల పర్వంలో కర్నూలు డివిజన్ కంటే నంద్యాల డివిజన్ అధికారులే ముందున్నారని సమాచారం. విచారించి చర్యలు తీసుకుంటాం నీరు-చెట్టు కార్యక్రమం కింద పూడికతీత పనులను నీటి వినియోగదారుల సంఘాలకు, జన్మభూమి కమిటీలకు ఇస్తున్నాం. అయితే అగ్రిమెంట్ చేసుకునేందుకు నంద్యాల, కర్నూలు డివిజన్ల కార్యాలయాల్లో డబ్బులు వసూలు చేస్తున్నారనే విషయం మా దృష్టికి అయితే రాలేదు. విచారించి చర్యలు తీసుకుంటాం. అగ్రిమెంట్‌కు డబ్బులు ఇవ్వడం, తీసుకోవడం నేరం కిందికి వస్తుంది. - చంద్రశేఖర్ రావు, జల వనరుల శాఖ పర్యవేక్షక ఇంజినీర్ -
బెజవాడపై నిఘా
► నల్లమల నుంచి నగరానికి పెద్ద సంఖ్యలో మావోయిస్టులు ► భూతం అన్నపూర్ణ అరెస్ట్‌తో పోలీసులు అప్రమత్తం ► నగరంలో సానుభూతి పరుల కదలికలపై ఆరా సాక్షి, విజయవాడ : మావోయిస్టు షెల్టర్ జోన్‌గా ఉన్న బెజవాడ నగరంపై పోలీసులు నిఘా ఉంచారు. నగరంలోకి కొత్తగా ఎవరెవరు వస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా ఉన్నారా, సానుభూతిపరులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉంది లాంటి అంశాలపై నగర కమిషనరేట్ పోలీసులు దృష్టి సారించారు. మావోయిస్టు పార్టీ ఆంధ్ర-ఒడిస్సా బోర్డర్ దళ డెప్యూటీ కమాండర్ భూతం అన్నపూర్ణ అలియాస్ అరుణ, సృజనను గుంటూరు రూరల్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో మావోయిస్టు సానుభూతిపరుల కదలికలపై రెండు జిల్లాల్లో పోలీస్ నిఘా పెరిగింది. మళ్లీ కలకలం... విజయవాడ నగరం ఎన్నో ఏళ్లుగా మావోయిస్టులకు షెల్టర్ జోన్‌గా ఉంది. నగరంలో మావోయిస్టు సానుభూతిపరులు అధికంగా ఉన్నారు. ముఖ్యంగా నల్లమల నుంచి మావోయిస్టులు నగరంలో తలదాచుకోవటంతో పాటు వైద్య సేవల కోసం ఎక్కువగా వస్తుంటారు. ఈ క్రమంలో 2004కు ముందు విజయవాడలో వెంకటేశ్వర్లు అనే మావోయిస్టు లొంగిపోవటం మినహా ఇతర ఘటనలు చోటుచేసుకోలేదు. ముఖ్యంగా ఇక్కడి గుంటూరు, కృష్ణా జిల్లాలో అధికార పార్టీ నేతల ఆగడాలు, ఇసుక మాఫియా ఆగడాలపై మావోయిస్టు పార్టీ స్పందించి కొందరు నేతలకు అల్టిమేటం ఇచ్చింది. ఈ క్రమంలో పోలీసులు భద్రతాపరంగా చర్యలు తీసుకుంటూ దీనిపై దృష్టిసారించారు. -
పోరుబాట
► కొత్తూరు అమ్మవారిశాల కల్యాణ మండపం సీజ్‌పై ఆర్యవైశ్యుల ఆగ్రహం ► నేడు కీలక సమావేశం ► భవిష్యత్ కార్యాచరణపై చర్చ ► సంఘాలన్నీ తరలిరావాలని పిలుపు సాక్షిప్రతినిధి, అనంతపురం:- ఆర్యవైశ్యులపై అధికారపార్టీ నేతల ఆగడాలు రోజురోజుకు మితిమీరుతున్నాయి. మొన్న గాంధీ విగ్రహావిష్కరణకు అడ్డుపడటం...నేడు కరెంటు బిల్లులపేరుతో కల్యాణ మండపాన్ని సీజ్ చే యడం చూస్తే అధికారపార్టీ నేతల శైలిని స్పష్టం చేస్తున్నాయి. మేయర్ స్వరూప, ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి కావాలనే ఈ రకంగా వేధింపులకు పాల్పడి వారిని అగౌర పరచాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని గ్రహించిన ఆర్యవైశ్యులు అధికార పార్టీ నేతల వైఖరిపై అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. తమను తీవ్రంగా అవమానిసిస్తున్న అధికార పార్టీపై పోరుబాటకు సిద్ధమయ్యారు. నేడు కీలక సమావేశం అధికార పార్టీ నేతలు, అధికార యంత్రాంగం చేస్తున్న చర్యలు వారి మనోభావాలను తీవ్రంగా దెబ్బ తీసినట్లు వారు భావిస్తున్నారు. దీంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆర్యవైశ్యులంతా శనివారం సమావేశం కానున్నారు. ఈ భేటిలో అధికారపార్టీ ఆగడాలపై చర్చించనున్నారు.గాంధీ విగ్రహ ప్రారంభానికీ అడ్డంకులు ‘అనంత’ క్లాక్‌టవర్ వద్ద గాంధీ విగ్రహం ఏర్పాటుకు కూడా అనుమతి ఇచ్చే విషయంలో మేయర్ స్వరూప, ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ఆర్యవైశ్యులను తీవ్రంగా ఇబ్బంది పెట్టినట్లు వారు భావిస్తున్నారు. అయినా వారు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దీంతో విగ్రహావిష్కరణకు అంతర్గతంగా అడ్డుపడుతూనే ఉన్నారనే భావనలో వారు ఉన్నారు. ఏడాదికిపైగా గాంధీ విగ్రహానికి ముసుగేశారు. ఈ క్రమంలో జేసీ ప్రభాకర్‌రెడ్డి నెలరోజుల్లో విగ్రహాన్ని ఆవిష్కరించకపోతే తానే ఆవిష్కరిస్తానని ‘అనంత’లో మీడియా ముందు గతేడాది బీరాలు పలికారు. కేవలం ప్రభాకర్ చౌదరిపై వ్యతిరేకతతోనే జేసీ ప్రభాకర్‌రెడ్డి అలా మాట్లాడారని, గాంధీ విగ్రహంపై చిత్తశుద్ధి ఉంటే నెల దాటి నెలలు గడుస్తున్నా ఆయన ఏమయ్యారని నగరవాసులు ప్రశ్నిస్తున్నారు. రాజకీయ దురుద్దేశమే కారణమా..? తాజాగా కొత్తూరు అమ్మవారిశాల కల్యాణ మండపం సీజ్ చేయడం వెనుక కూడా రాజకీయ దురుద్దేశం ఉన్నట్లు తెలుస్తోంది. పాలక వర్గంలోని కీలక నేతల సూచనలతోనే అధికారులు సీజ్ చేసినట్లు తెలుస్తోంది.. ఈ విషయం శుక్రవారం ‘సాక్షి’లో ప్రచురితం కావడంతో జిల్లా వ్యాప్తంగా ఆర్యవైశ్యులు తీవ్రంగా స్పందించారు. దీనిపై తాడోపేడో తేల్చుకునేందుకే ‘అనంత’లోని వైశ్య హాస్టల్లో శనివారం సమావేశం అవుతున్నారు. దీనికి అన్ని సంఘాలు తరలిరావాలని కొత్తూరు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు మచ్చా నరసింహులు పిలుపునిచ్చారు. ఆర్యవైశ్యులపై జరుగుతున్న పరిణామాలన్నీ రాజకీయ దురుద్దేశంతోనే జరుగుతున్నవేని తెలుస్తుండటంతో ఈ భేటీపై ఉత్కంఠ నెలకొంది. శుక్రవారం పలువురు ఆర్యవైశ్య ప్రముఖులు ఫోన్లో భవిష్యత్ కార్యాచరణపై చర్చించుకున్నట్లు తెలిసింది. కాగా కొత్తూరు అమ్మవారి శాలతో పాటు పాతూరు అమ్మవారి శాల కల్యాణ మండపాన్ని సైతం సీజ్ చేయడానికి అడిషనల్ కమిషనర్ పగడాల కృష్ణమూర్తి, డీసీ అజయ్కిశోర్, ఆర్ఓ నవనీతకృష్ణ తదితరులు గురువారం వెళ్లారు. అయితే నగర పాలక సంస్థ కమిషనర్ ఓబులేసు చివరి నిమిషంలో కలుగజేసుకోవడంతో అధికారులు మిన్నకుండిపోయినట్లు తెలిసింది. ఇదంతా గమనిస్తున్న ఆర్యవైశ్య ప్రముఖులు పక్కా ప్రణాళికతోనే తమను లక్ష్యంగా చేసుకుని అధికారులు, టీడీపీ ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. -
రూ. కోటి ఆస్తిపై కన్ను !
► నకిలీ డాక్యుమెంట్లతో బేరం ► నాల్గో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు ► నిందితులకు అధికార పార్టీ నేతల అండ? అనంతపురం: నగరంలో కబ్జారాయుళ్లు రెచ్చిపోతున్నారు. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ఖరీదైన స్థలాలను కారుచౌకగా కొట్టేస్తున్నారు. అసలు యజమాని సీనులోకి వస్తే తమకూ రిజిస్ట్రేషన్ అయిందంటూ బెదిరింపులకు గురి చేస్తున్నారు. పైగా అధికార పార్టీ నేతల అండ కూడా ఉండడంతో సామాన్య ప్రజలు భయపడిపోతున్నారు. తాజాగా అనంతపురం నగరంలోని మారుతీనగర్‌లో రూ. కోటి విలువైన ఆస్తిపై కొందరు కన్నేశారు. ఈ క్రమంలో నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి బేరం పెట్టారు. విషయం తెలుసుకున్న స్థల అసలు యజమాని లబోదిబోమంటున్నారు. ఈ క్రమంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలు.. మారుతీనగర్ శివారులో పది సెంట్ల స్థలాన్ని ఓ వ్యక్తి కొన్నేళ్ల క్రితం కొనుగోలు చేశాడు. ఈ స్థలంపై వేణుగోపాల్‌నగర్ తారకరామాపురం కొట్టాలకు చెందిన ఇద్దరు సోదరుల కన్నుపడింది. దీంతో అసలు యజమాని ప్రమేయం లేకుండానే ఈ స్థలాన్ని మరో నలుగురి వ్యక్తులపై రిజిస్ట్రేషన్ చేయించారు. ఆ నలుగురికి కొంత మొత్తం ఇచ్చేటట్లు ఒప్పందం చేసుకున్నారు. అసలు య జమాని డాక్యుమెంట్లను నకిలీవి సృష్టించారు. చివరకు రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు కూడా నకిలీకి జత చేసినట్లు తెలిసింది. నలుగురి పేర్ల మీద ఉన్న ఆస్తిని తిరిగి మరో వ్యక్తికి అమ్మేందుకు పూనుకున్నారు. ఈ క్రమంలో రూ.5 లక్షల వరకు అడ్వాన్స్ కూడా చెల్లించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఐదు రోజుల క్రితం కొనుగోలు చేసిన వ్యక్తి స్థలాన్ని శుభ్రం చేయిస్తున్నాడనే సమాచారంతో అసలు యజమాని అక్కడికి చేరుకున్నాడు. తనస్థలంలో ఎందుకు శుభ్రం చేయిస్తున్నారని ప్రశ్నించారు. తనకు ఫలానా వారు అమ్ముతున్నారని కొనుగోలు చేసిన వ్యక్తి చెప్పాడు. డాక్యుమెంట్లను పరిశీలించిన అసలు యజమాని తమ స్థలానికి సంబంధించి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించినట్లు గుర్తించారు. దీంతో లబోదిబోమంటూ నాల్గో పట్టణ పోలీస్‌స్టేషన్‌కు పరుగులు తీశాడు. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో నకిలీ డాక్యుమెంట్లు సృష్టించిన ఇద్దరు వ్యక్తులతో పాటు, రిజిస్ట్రేషన్ చేయించుకున్న నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వారిలో ఓ మహిళ కూడా ఉన్నట్లు తెలిసింది. కాగా సూత్రధారులైన ఇద్దరు సోదరులకు అధికార పార్టీకి చెందిన నేత ఒకరు సహకరిస్తున్నట్లు సమాచారం. -
ఎర్రమట్టి దుమారం
► మట్టి తరలింపును అడ్డుకున్న ► గాజులపల్లెవాసులు ► ఉద్రిక్తత కు దారితీసిన వివాదం గాజులపల్లె(మహానంది): గాజులపల్లె సమీపంలోని అంకిరెడ్డి చెరువు నుంచి ఎర్రమట్టి తరలింపు తతంగం గురువారం వివాదానికి దారి తీసింది. అధికారపార్టీ నేతలు మట్టి తరలిస్తుండగా గాజులపల్లె గ్రామస్తులు అడ్డుకున్నారు. అక్కడున్న ప్రొక్లెయిన్లు, టిప్పర్, ఇతర వాహనాలను చెరువు నుంచి బయటకు పంపించడంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. ఇటుకల బట్టీలు, ఇతర అవసరాల నిమిత్తం అంకిరెడ్డి చెరువు నుంచి కొందరు కొన్ని రోజులుగా ఎర్రమట్టి తరలిస్తున్నారు. అయితే గ్రామస్తుల ఫిర్యాదు మేరకు భూగర్భ, రెవెన్యూ, పోలీసు అధికారులు అడ్డుకోవడంతో మూడు నాలుగురోజులుగా తరలింపు ఆగింది. తర్వాత మళ్లీ మొదలు కావడంతో గురువారం గాజులపల్లె గ్రామానికి చెందిన కొందరు అధికార పార్టీ నాయకులు, ప్రజలు సుమారు వందమంది వరకు వెళ్లి మట్టి తరలింపును అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మట్టి తరలింపు వల్ల చెరువుకు గండ్లు పడతాయని, అదే జరిగితే పొలాలకు సాగునీటి కొరత ఏర్పడుతుంద ని వాపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. విషయంపై నీటి పారుదల శాఖ అధికారులు సుధాకర్, రామ్మోహన్‌కు ఫిర్యాదు చేశామని గ్రామస్థులు, చెరువు సంఘం అధ్యక్షుడు పెద్ద హుసేని, రైతులు తెలిపారు. శ్రీశైలం నియోజకవర్గంలోని టీడీపీ ముఖ్యనేత, ఆయన బంధువులు, నంద్యాల నియోజకవర్గానికి చెందిన నేతల మధ్య ఉన్న విభేదాలే ఎర్రమట్టి తరలింపు వివాదానికి కాారణమన్న చర్చ సాగుతోంది. -
‘పవర్’ పాలిటిక్స్!
► ప్రారంభానికి నోచని లాల్పురం విద్యుత్ సబ్‌స్టేషన్ ► మంత్రి, ఎంపీపీల మధ్య విభేదాలే కారణం ► లోఓల్టేజ్తో ఇబ్బంది పడుతున్నఆరు గ్రామాల ప్రజలు ప్రజలకు సేవ చేస్తామని ప్రమాణం చేసి పదవుల్లో కూర్చుంటున్న పెద్దలు పంతాలతో జనానికి సమస్యగా మారుతున్నారు. కోట్ల రూపాయలతో చేపట్టిన నిర్మాణాలు అక్కరకు రాక నిరుపయోగంగా మిగులుతున్నాయి. సాక్షి, గుంటూరు : గుంటూరు రూరల్ మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు అధికార పార్టీ నేతల మధ్య వర్గపోరుతో నలిగిపోతున్నారు. ఇక్కడ మంత్రి రావెల కిషోర్‌బాబు, ఎంపీపీ తోటా లక్ష్మీకుమారి వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఈ విషయం లాల్పురం గ్రామంలో ఏర్పాటు చేసిన విద్యుత్ సబ్ స్టేషన్ విషయంలో కూడా తేటతెల్లమవుతోంది. విద్యుత్ సబ్‌స్టేషన్ ప్రారంభోత్సవానికి ఎంపీపీని పిలవ వద్దంటూ మంత్రి, మంత్రి వస్తే తాను రానంటూ ఎంపీపీ భీష్మించుకుని కూర్చోవడంతో ఏం చేయాలో తెలియక విద్యుత్ శాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఎనిమిది నెలలు గడుస్తున్నా... లాల్పురం గ్రామ పంచాయతీ పరిధిలో 2015 ఫిబ్రవరి 5వ తేదీ రూ.2 కోట్ల వ్యయంతో 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రం ఏర్పాటుకు మంత్రి రావెల కిషోర్‌బాబు, ఎంపీపీ తోటా లక్ష్మీకుమారి శంకుస్థాపన నిర్వహించారు. నాలుగు నెలల్లో నిర్మాణం కూడా పూర్తయింది. అయితే ఈలోపు మంత్రి, ఎంపీపీ మధ్య వివాదాలు తారస్థాయికి చేరడంతో తాము చెప్పిందే జరగాలని పంతాలకు దిగుతున్నారు. విద్యుత్ ఉప కేంద్రంలో షిఫ్ట్ ఆపరేటర్ పోస్టును తాము చెప్పిన వారికే ఇవ్వాలంటూ ఇద్దరు పట్టుబట్టడంతో ఏమి చేయాలో తెలియక విద్యుత్ శాఖ అధికారులు గందరగోళానికి గురవుతున్నారు. దీంతో విద్యుత్ ఉప కేంద్రం పూర్తయి ఏడెనిమిది నెలలు గడుస్తున్నా ప్రారంభోత్సవం జరుపకుండా వదిలేశారు. ఆరు గ్రామాల సమస్య... విద్యుత్ ఉపకేంద్రం ప్రారంభమైతే లోఓల్టేజీ సమస్య తీరుతుందని ఆశించిన గుంటూరు రూరల్ మండలంలోని ఆరు గ్రామాల ప్రజలకు ప్రజాప్రతినిధుల పోరు శాపంగా మారింది. లాలుపురం, పొత్తూరు, లింగాయపాలెం, అంకిరెడ్డిపాలెం, బుడంపాడు, నాయుడుపేట గ్రామాల్లో ఈ సబ్‌స్టేషన్ ద్వారా లోఓల్టేజీ సమస్య తీరనుంది. లాల్పురం చుట్టుపక్కల సుమారు 30 కోల్డ్ స్టోరేజీలు, మరికొన్ని పరిశ్రమలకు సైతం ఈ విద్యుత్ ఉపకేంద్రం ఎంతగానో ఉపయోగపడనుంది. అయితే సబ్‌స్టేషన్ నిర్మాణం పూర్తయినా నిరుపయోగంగా మారిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు పంతాలకు పోయి ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా మంత్రి, ఎంపీపీ తమ వివాదాలు పక్కన పెట్టి ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని విద్యుత్ ఉప కేంద్రాన్ని ప్రారంభించి నాణ్యమైన విద్యుత్ సరఫరాను అందించాలని ప్రజలు కోరుతున్నారు. -
కుంట నక్కలు
సాక్షి ప్రతినిధి, కర్నూలు:అధికార పార్టీ నేతల అవినీతి దందా పరాకాష్టకు చేరింది. పంట పొలాల్లో తవ్వుతున్న కుంట(ఫాంపాండ్స్)లనూ వదలని పరిస్థితి. ఉపాధి కూలీలతో చేయించాల్సిన ఈ నిర్మాణాలను యంత్రాలతో చేయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ప్రధానంగా అధికార పార్టీకి చెందిన నేతలు తమ పొక్లెయిన్లనే ఇందుకోసం వినియోగిస్తున్నారు. అయితే, మస్టర్లో మాత్రం కార్మికులు పనికి వచ్చినట్టు దొంగ హాజరు సృష్టిస్తున్నారు. అధికార పార్టీ నేతలతో చేతులు కలిపి ఉపాధి హామీ ఫీల్డ్ సిబ్బంది కూడా అవినీతిలో పాలుపంచుకుంటున్నారు. సహకరించకపోతే ఉద్యోగం నుంచి తీసివేయిస్తామనే బెదిరింపుల నేపథ్యంలో ఏమీ చేయలేక తిలా పాపం తలా పిడికెడు చందంగా వీళ్లూ వంత పాడుతున్నారు. నేతల పాలిట ‘సంజీవని’ భూమిపై పడిన ప్రతి నీటిచుక్కనూ కాపాడుకుని భూగర్భ జలాలను పెంపొందించుకోవడంతో పాటు పంట కుంటల తవ్వకం ద్వారా కేవలం ఉపాధి కూలీలకు పనులు కల్పించాలనేది జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ ఆలోచన. ఎట్టి పరిస్థితుల్లోనూ యంత్రాలను ఉపయోగించవద్దని కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఒక్కో గ్రామ పంచాయతీలో 100 నుంచి 150 చొప్పున లక్ష నీటి కుంటలు తవ్వాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఒక్కో నీటి కుంటకు సైజును బట్టి 200 నుంచి 500 పనిదినాలను కల్పించవచ్చనేది ఆలోచన. అయితే, సగటున 300 పనిదినాలు కల్పించవచ్చనని అంచనా వేశారు. తద్వారా జిల్లాలో నిర్మించనున్న లక్ష నీటి కుంటల వల్ల 3కోట్ల పనిదినాలను కల్పించే వీలుంది. ఈ కార్యక్రమానికి పంట ‘సంజీవని’గా నామకరణం కూడా చేశారు. ఇది కాస్తా అధికార పార్టీ నేతలకు సంజీవనిగా మారిపోయింది. తమ యంత్రాలతో పనులు చేయిస్తూ కూలీలకు ఉపాధి లేకుండా చేస్తున్నారు. వాళ్ల నోట్లో మట్టి కొట్టి ఆ నగదును కాస్తా తమ అకౌంట్లలో జమ చేసుకుంటున్నారు. వలసబాటలో జనం జిల్లాలో ఉపాధి పనులను ప్రధానంగా పంట కుంటలను తవ్వేందుకే చేపట్టాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించుకుంది. కేవలం మూడు నెలల కాలం(జనవరి, ఫిబ్రవరి, మార్చి)లోనే వీటిని తవ్వించడం ద్వారా 3కోట్ల పనిదినాలను వేసవి కాలంలో కల్పించి వలసలు లేకుండా చూడాలని భావించారు. అయితే, ఈ పనులపై కన్నేసిన అధికార పార్టీ నేతలు యంత్రాలతో పని కానిచ్చేస్తున్నారు. ఫలితంగా జిల్లాలో లక్షలాది మంది జనం వలసబాట పడుతున్నారు. -
‘పక్కా’ రాజకీయం
నెల్లూరు: పక్కా ఇళ్ల మంజూరులోనే అధికారపార్టీ నేతలు రాజకీయాలు చేస్తున్నారు. నిరుపేదలైన లబ్ధిదారులను పక్కనపెట్టి తనవారికే కట్టబెట్టేందుకు జాబితా సిద్ధం చేస్తున్నారు. అందులోనూ చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు తెలిసింది. వివరాల్లో కెళితే.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించాక పక్కా గృహాల మంజూరుకు ఏ ప్రభుత్వం పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. చాలా కాలం తరువాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పక్కా గృహాలను మంజూరు చేసినట్లు ప్రకటిం చాయి. కేంద్రప్రభుత్వం ‘అందరికీ ఇల్లు’ పేరుతో పట్టణ ప్రాంతాల్లో సొంత ఇల్లు లేని పేదల కోసం జిల్లాకు 20,681 పక్కాగృహాలను మంజూరు చేసింది. ఒక యూ నిట్ విలువ రూ.4.80 లక్షలు నిర్ణయించింది. అందులో లబ్ధిదారుడు రూ.50 వేలు చెల్లించాల్సి ఉంటుంది. రూ.2 లక్షలు ప్రభుత్వం బ్యాంకు నుంచి రుణం ఇప్పిస్తుంది. రూ.1.80 లక్షలు కేంద్రం, మరో రూ.50 వేలు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ భరిస్తుంది. ఇందులో 5,240 గృహా లను గతంలో రాజీవ్ అవాస్‌యోజన కోసం దరఖాస్తు చేసుకున్న వారికి కేటాయించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ హౌసింగ్ పథకం కింద జిల్లా మొత్తానికి 10,500 ఇల్లు మంజూరు చేసింది. అవి కూడా కేవలం 8 నియోజకవర్గాలకు మాత్రమే. ఒక్కో నియోజకవర్గానికి 1250, నెల్లూరు రూరల్‌కి కేవలం 500 మాత్రం మంజూరు చేసినట్లు అధికారులు తెలిపారు. ఒక ఇంటికి రూ.2.75 లక్షలుగా నిర్ణయించారు. అందులో రూ.1.25 లక్షలు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. మరో రూ.1.50 లక్షలను బ్యాంకు నుంచి రుణం పొందాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీలకు అయితే రూ.1.75 లక్షలు సబ్సిడీ ఇస్తుంది. మరో రూ.లక్ష బ్యాంకు ద్వారా రుణం పొందాలి. ఇచ్చిన కొన్నింటికీ పైరవీలు సముద్రంలో ఇంగువ కలిపినట్లు లక్షలాది మంది సొంత ఇళ్లు లేని వారు ఉంటే... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి 31,181 పక్కా గృహాలు మంజూరు చేశాయి. ఇవైనా నేరుగా లబ్ధిదారులకు చేరుతాయా? అనుకుంటే పొరబాటే. వీటినీ జన్మభూమి కమిటీల చేతుల్లో పెట్టారు. కేంద్రప్రభుత్వం మంజూరు చేసిన వాటిని బీజేపీ నేతలు గుప్పెట్లో పెట్టుకుని నిజమైన పేదలకు దక్కకుండా చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. పక్కా గృహాలు కావాలంటే ఆ నేతల ఆశీర్వాదం ఉండాలి. ఆ పార్టీ నాయకులకు కొద్దో గొప్పో సమర్పించుకోవాలి. లబ్ధిదారుడు ముందుగా ఇంటి కోసం దరఖాస్తు చేసుకోవాలంటూ డబ్బు చెల్లిస్తేనే అప్లికేషన్. ఆ తరువాత దరఖాస్తు పూర్తి చేసి ఇస్తే దానికీ కొంత మొత్తం సమర్పించుకోవాలి. అలా ఆ నేతలను సంతృప్తి పరిస్తేగానే పక్కాగృహాల జాబితాలో చోటు దక్కడం లేదని నెల్లూరుకు చెందిన లక్ష్మీదేవి, సుభద్రమ్మ, రమణయ్య ఆందోళన వ్యక్తం చేశారు. పక్కాగృహాల కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన ఆఖరుతేది ఈనెల 14 అని అధికారులు తెలిపారు. అయితే వెబ్సైట్ ఇంకా ఓపెన్కాలేదని, గడువు పెంచుతామని అధికారులు చెబుతున్నారు. లబ్ధిదారులు దరఖాస్తు చేసుకుంటే ఆ జాబితాను టీడీపీ, బీజేపీ నేతలు ఓకే చేసి ఎంపీడీఓ కార్యాలయానికి చేర్చుతారు. చివరగా ఎంపీడీఓ ఆ జాబితాను హౌసింగ్ అధికారులకు పంపుతారు. దరఖాస్తు చేసుకునేవారు ఆధార్, రేషన్, ఓటరు కార్డు, బ్యాంకు పాసుపుస్తకం, కులధ్రువీకరణ పత్రం తప్పనిసరి అని అధికారులు వెల్లడించారు. -
అధికార పార్టీ జులుం మితిమీరింది
ఏఈపై టీడీపీ ఎంపీపీ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం ఏపీ జేఏసీ డిప్యూటీ సెక్రటరీ జనరల్ చంద్రశేఖర్‌రెడ్డి హైదరాబాద్: అధికార పార్టీ నాయకుల ఆగడాలు మితిమీరి పోయాయని, ఇలాగైతే రాష్ట్రంలో ఉద్యోగులు పనిచేయలేరని ఏపీ ఉద్యోగుల జేఏసీ డిప్యూటీ సెక్రటరీ జనరల్ చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. అధికార పార్టీకి చెందిన ఎంపీపీ ప్రతాపరెడ్డి ఇటీవలే బద్వేలులో గ్రామీణ నీటిసరఫరా (ఆర్‌డబ్ల్యుఎస్) విభాగానికి చెందిన అసిస్టెంట్ ఇంజనీర్ ప్రసాద్‌పై దాడిచేయడాన్ని హేయమైన చర్యగా వర్ణించారు. శుక్రవారం ఆయన ఏపీ జేఏసీ ఉద్యోగ సంఘాల నేతలతో పాటు ఆర్‌డబ్ల్యుస్, పంచాయతీరాజ్ ఇంజినీర్ల సంఘాలతో కలిసి సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. ‘మొన్నటికి మొన్న కృష్ణా జిల్లాకు చెందిన తహసిల్దార్ వనజాక్షిని అధికార పార్టీ ఎమ్మెల్యే దారుణంగా కొట్టారు. ఇప్పుడేమో ఏఈపై ఎంపీపీ దాడి చేశారు. ఉద్యోగులు పనిచేయాలంటేనే భయపడుతున్నా’రని అన్నారు. అధికార పార్టీ ఎంపీపీ పదిమంది గూండాలను తీసుకెళ్లి ఇష్టారాజ్యంగా దాడిచేయడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. కలెక్టర్లు ప్రభుత్వ తొత్తులు కాదు జిల్లా కలెక్టర్లు అధికార పార్టీకి తొత్తులు కాదని, ఉద్యోగులపై దాడి జరిగితే అండగా నిలవాలని చంద్రశేఖర్‌రెడ్డి సూచించారు. దాడికి గురైన ఆర్డబ్ల్యూ ఏఈ.. కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తే స్పందించకపోవడమే కాకుండా ఎస్సీ, ఎస్టీ అట్రా కేసు నమోదు చేస్తే కేసును ఉపసంహరించుకోవాలని కోరడం దారుణమన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని, 24 గంటల్లో ఏఈపై దాడి చేసిన వారిని అరెస్టు చెయ్యకపోతే ఇంజినీర్లందరూ విధులు బహిష్కరిస్తామని ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్ల సంఘం అధ్యక్షుడు నాగేశ్వరరావు, పంచాయతీరాజ్ ఇంజినీర్ల సంఘం కార్యదర్శి మురళీకృష్ణలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. -
ఫ్లెక్సీల రచ్చ
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: అనుచరులు చూపుతున్న అత్యుత్సాహం అధికార పార్టీ నేతలకు తలనొప్పిగా మారింది. వారి మధ్య అంతరాన్ని పెంచుతోంది. జిల్లా టీడీపీలో ప్రస్తుతం ఫ్లెక్సీల రాజకీయం నడుస్తోంది. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి జిల్లాలో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగారు. పార్టీలో ఆయన చెప్పిందే వేదం. ఎవరికి ఏ పదవి కావాలన్నా ఆయన ఆమోదముద్ర తప్పనిసరి. అయితే ప్రస్తుతం పరిస్థితి తారుమారైపోయింది. ఆయన స్థానాన్ని మరో కీలక నేత ఆక్రమించారు. ఆయనే పురపాలకశాఖ మంత్రి పొంగూరు నారాయణ. ప్రస్తుతం ఆయన జిల్లాలోనే కాదు.. రాష్ట్రంలోనూ కీలకంగా మారారు. అటువంటి ఆయన దృష్టిలో పడేందుకు తమ్ముళ్లు కొందరు పోటాపోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి జిల్లా పార్టీ కార్యాలయం ముందు పోటాపోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. రెండు రోజులకొకరు మంత్రి ఫొటోతో.. సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, బీదా రవించద్ర ఫొటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. అందులోభాగంగా నూతన సంవత్సరం, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపే ఫ్లెక్సీలను జిల్లా పార్టీ కార్యాలయం ముందు ఏర్పాటు చేశారు. వివాదమంతా ఇక్కడే వచ్చింది. నూతన సంవత్సరానికి నాలుగురోజుల ముందు పార్టీ కార్యాలయం ముందు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఫొటోతో రెండు ఫ్లెక్సీలు వెలిశాయి. అయితే 30న సోమిరెడ్డిని ‘లీడర్’గా అభివర్ణిస్తూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని తొలగించారు. దాని స్థానంలో మంత్రి నారాయణ ఫొటోతో ఉన్న ఫ్లెక్సీని అనుచరులు ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న సోమిరెడ్డి అనుచరులు కొందరు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఫ్లెక్సీని ఏర్పాటు చేసేందుకు పక్కనే స్థలం ఉన్నా... ఉన్న ఫ్లెక్సీని తొలగించి అక్కడే ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చిందని పలువురు కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వివాదం పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నామినేటెడ్ పదవుల కోసం తెలుగు తమ్ముళ్లు ఇప్పటికే మూడు గ్రూపులుగా విడిపోయిన విషయం తెలిసిందే. పదవుల కోసం ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటూ.. ఒకరికి రాకుండా ఇంకొకరు అడ్డుపడుతున్నారనే ప్రచారం ఉంది. మరో వారంరోజుల్లో నామినేటెడ్ పదవులను భర్తీచేయనున్న నేపథ్యంలో ఈ ఫ్లెక్సీల వివాదం ఎక్కడికి దారితీస్తుందోనని తమ్ముళ్లు ఆందోళన చెందుతున్నారు. అత్యుత్సాహంలో తమ్ముళ్లు... పార్టీ అధికారంలోకి రావటంతో తమ్ముళ్లు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. రెండునెలల క్రితం జడ్. శివప్రసాద్ ఏకంగా నెల్లూరు నగర మేయరని బ్యానర్ ఏర్పాటు చేసిన విషయం పార్టీలో కలకలం రేపింది. అదేవిధంగా రెండు రోజుల క్రితం కోవూరు మార్కెట్‌యార్డు చైర్మన్‌గా విడవలూరుకు చెందిన విజయభానురెడ్డి ఫొటోతో ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం నియోజకవర్గంలో వివాదాస్పదమైంది. అదేవిధంగా జిల్లా పార్టీలో పెద్ద దిక్కుగా ఉన్న నాయకుల మధ్య ఫ్లెక్సీల వివాదం పెద్ద తలనొప్పిగా మారింది. ఎమ్మెల్సీ పదవి తనకే దక్కుతుందన్న ధీమాతో సోమిరెడ్డి తన అనుచరులను ఎక్కడా నోరెత్తకుండా జాగ్రత్తపడుతున్నట్లు తెలిసింది. అయితే ఇవేమీ పట్టించుకోకుండా మంత్రి అనుచరులు మాత్రం జిల్లాలో తన హవాను కొనసాగిస్తుండటం గమనార్హం. -
నిను వీడని నీడను నేను!
నంద్యాల టౌన్: నంద్యాల మున్సిపల్ కార్యాలయానికి వాస్తు దోషం నీడలా వెంటాడుతోంది. కార్యాలయానికి మూడు ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. వాస్తు దోషం పేరిట గత కమిషనర్లు ఖాదర్‌సాహెబ్, చంద్రమౌళీశ్వరరెడ్డి రెండు గేట్లను మూయించారు. అయినా ఏడాదిన్నర కాకమునుపే అధికార పార్టీ నేతలు వీరిని అవమానించి, బదిలీ చేయించారు. గత కమిషనర్ రామచంద్రారెడ్డి వాస్తు దోషాలను పట్టించుకోలేదు. అయినా ఆయన కూడా ఇదే రీతిలో బదిలీ అయ్యారు. ప్రస్తుతం అధికార పార్టీ కౌన్సిలర్లు కౌన్సిల్‌హాల్‌ను వాస్తు ప్రకారం మార్పు చేసేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు సిద్ధం చేస్తున్నారు. గతంలో జరిగిన సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఓ టీడీపీ కౌన్సిలర్లు వాస్తు నిపుణుడితో పరిశీలన చేయించినట్లు తెలుస్తోంది. మున్సిపల్ కార్యాలయ భవనాన్ని 1986లో, మొదటి అంతస్తును 1987లో నిర్మించారు. అప్పట్లో నిర్మించిన కౌన్సిల్ హాల్లో ఐదుపాలక మండళ్లు సమావేశాలను నిర్వహించాయి. కౌన్సిల్ మీట్లలో తరచూ వాగ్వాదం, విపక్ష సభ్యులు చైర్ పర్సన్ వద్ద బైఠాయించడం, వాకౌట్ చేయడం, విమర్శలు, ప్రతివిమర్శలు తరచూ చోటు చేసుకొనేవి. కాని కౌన్సిలర్లు ఘర్షణకుయ పాల్పడటం జరగలేదు. 2010లో ఆగస్టులో రూ.46.68 లక్షల వ్యయంతో ప్రస్తుత కార్యాలయాన్ని నిర్మించారు. తర్వాత 2011లో మొదటి అంతస్తులో నూతన కౌన్సిల్ హాల్, నిర్మాణం చాంబర్ నిర్మాణాన్ని ప్రారంభించారు. కాని ఇప్పటికీ కాంట్రాక్టర్ నిర్మాణం వల్ల పనులు పూర్తి కాలేదు. సీలింగ్, పైకప్పు సీటు, ఫ్లోరింగ్, వాకిళ్లు, కిటికీల పనులు అసంపూర్తిగా నిలిచి పోయాయి. ఎలక్ట్రికల్ పనుల కాంట్రాక్ట్‌ను వేరే కాంట్రాక్టర్‌కు అప్పగించారు. కాని భవన నిర్మాణం పూర్తి కాకపోవడంతో ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ కూడా తన కాంట్రాక్టర్‌ను రద్దు చేయాలని మున్సిపల్ అధికారులను కోరారు. దీంతో సివిల్ కాంట్రాక్టర్ పేరును బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలని శుక్రవారం జరిగే మున్సిపల్ కౌన్సిల్ మీట్లో చర్చ జరగనుంది. ఈ ఏడాది మేలో ఎన్నికైన కొత్త కౌన్సిల్ పాత భవనంపై ఉన్న కౌన్సిల్ హాల్‌ను ఉపయోగించాల్సి వచ్చింది. ఒక భవనంపై నుంచి మరో భవనంలోకి వెళ్లడం దోషమట నూతన భవనం మొదటి అంతస్తుపై కౌన్సిల్ హాల్ నిర్మాణం పూర్తికాకపోవడంతో ఈ ఏడాది మేలో ఎంపికైన కొత్త కౌన్సిల్ పాత భవనంపై కౌన్సిల్ హాల్‌ను ఉపయోగించాల్సి వచ్చింది. నూతన భవనంలో చైర్మన్, కమిషనర్, మున్సిపల్ ఇంజనీరింగ్, మెయిన్ ఆఫీసు ఉండటంతో కౌన్సిల్ మీట్ జరిగినప్పుడు చైర్మన్, కౌన్సిలర్లు, సిబ్బంది ఈ భవనంపై నుంచి వెళ్లి , పాత భవనంపైన ఉన్న కౌన్సిల్ హాల్లోకి వెళ్తున్నారు. ఈ ప్రవేశ ముఖద్వారం వద్ద వాస్తు దోషం ఉన్నట్లు నిపుణుడు చెప్పిట్లు సమాచారం. ఇలా వెళ్లడం దోషమని, తక్షణమే మార్పు చేసుకోక తప్పదని చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో అధికారపార్టీ కౌన్సిలర్ ప్రత్యామ్నాయల గురించి యోచించినట్లు తెలిసింది. నూతన భవనంపై కౌన్సిల్ హాల్ నిర్మాణం పూర్తయ్యే వరకు జాప్యం జరిగే అవకాశం ఉంది. దీంతో పాత భవనంలో నుంచే కౌన్సిల్ హాల్లోకి వెళ్లాలని, ఇలాగైతే వాస్తు దోషం ఉండేదని భావిస్తున్నట్లు సమాచారం. -
ప్ర‘దక్షిణలు’!
* అధికార పార్టీ నేతలను చుట్టేస్తున్న త్రిబుల్స్టార్లు * పోట్లదుర్తికి క్యూ * ఎంపీకి పత్రికా ప్రకటన ఇచ్చిన సీఐకి చిన్నచౌక్ ఖరారు * కొన్ని సర్కిళ్లకు రూ.10 లక్షలు పలుకుతున్న వైనం సాక్షి ప్రతినిధి, కడప: వారంతా ఉన్నతోద్యోగులు. సమాజంలో బాధ్యతాయుతంగా మెలగాల్సిన అధికారులు. అయితే కాసులు కురిపించే సర్కిళ్లలో పోస్టింగ్ కోసం అధికార పార్టీ నేతల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు. కోరుకున్న పోస్టింగ్ కోసం లక్షలను వెచ్చించేందుకు సైతం ఏమాత్రం వెనుకాడటం లేదు. త్వరలో పోలీసు ఇన్స్పెక్టర్ల బదిలీలు ఉంటాయనే సమాచారం రావడంతో పైరవీలను ముమ్మరం చేశారు. గతంలో జిల్లాలో పనిచేసి బదిలీపై వెళ్లిన అధికారి ఒకరు ఏకంగా ఓ సర్కిల్ కోసం రూ.10 లక్షలు ఆఫర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ నేతలకు జీఓ నెంబర్ 175 కలిసి వస్తోంది. ఆ ఉత్తర్వుల కారణంగా కాసుల వర్షం కురుస్తోంది. అవసరాన్ని బట్టి ఎగ్జిక్యూటివ్ అధికారుల నియామకాలు చేపట్టవచ్చని ఉత్తర్వులు వివరిస్తున్నాయి. దీంతో అధికారపార్టీ నేతలకు డిమాండ్ పెరిగింది. కోరుకున్న పోస్టింగ్ కోసం పోలీసు ఇన్స్పెక్టర్లు అధికార పార్టీ నేతల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు. ఆ క్రమంలో త్రిబుల్‌స్టార్ అధికారులు పోట్లదుర్తికి అధికంగా వెళ్తున్నట్లు సమాచారం. జిల్లాలో పనిచేసి వెళ్లిన కొంతమంది పోలీసు అధికారులు పాత పరిచయాలతో నేతలను మచ్చిక చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అందివచ్చిన అవకాశాన్ని సొమ్ము చేసుకునే ప్రయత్నంలో అధికార పార్టీ నేతలు ఉన్నారు. ఎంపీకి శుభాకాంక్షలు చెప్పినందుకు..... రాజ్యసభ సభ్యుడిగా సీఎం రమేష్‌కు అవకాశం దక్కడంతో ఓ సర్కిల్ ఇన్స్పెక్టర్ అప్పట్లో పోలీసు యూనిఫాంతో శుభాకాంక్షలు చెబుతూ పత్రికల్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. ఆయన కోరుకున్న చిన్నచౌక్ సర్కిల్లో పోస్టింగ్ ఖరారైనట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఇటీవల హోమంత్రి పర్యటనలో కాపులు నిర్వహించిన వనభోజన కార్యక్రమంలో ఖర్చులు భరించిన ఓ సీఐకి కడప అర్బన్ సర్కిల్ ఖరారైనట్లు సమాచారం. అదే సర్కిల్లో తనకు అవకాశం ఇవ్వాలని అందుకోసం రూ.10లక్షల వరకూ ఇవ్వగలనని జిల్లా కేంద్రంలో పనిచేసి వెళ్లిన ఓ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ సర్కిల్ కుదరకపోతే యర్రగుంట్ల సర్కిల్లో అవకాశం ఇచ్చినా సమ్మతమే అన్నట్లుగా సమాచారం. డీఎస్పీలుగా పదోన్నతి పొందడంతో ఖాళీలు పడ్డ కడప రూరల్, వన్‌టౌన్ సర్కిళ్లకు పోటీ తీవ్రతరంగా ఉన్నట్లు సమాచారం. కాగా ప్రొద్దుటూరు, జమ్మలమడుగు నియోజకవర్గాల పరిధిలోని పోస్టింగ్‌లకు ఏకపక్షంగా పనిచేసే అధికారుల కోసం ఆన్వేషణ చేస్తున్నట్లు తెలుస్తోంది. చెరొక సర్కిల్‌ను పంచుకున్న మహిళా నేతలు... జిల్లాలోని మాజీ మహిళా ఎమ్మెల్యే, గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన నాయకురాలు ఇరువురు సర్కిల్ ఇన్స్పెక్టర్ల నియామకాలలో పోటీ పడుతున్నారు. ఇటీవల ఇరువురు ఓ ఒప్పందానికి వచ్చినట్లు సమాచారం. వారి వారి నివాసాల పరిధిలోని సర్కిళ్లకు వారు సూచించిన అధికారిని నియమించుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఆ మేరకు మాజీ ఎమ్మెల్యే తన హయాంలో హెడ్‌క్వార్టర్‌లో ఎస్‌ఐగాను, కొండాపురం సర్కిల్ సీఐగా పనిచేసి వెళ్లిన అధికారి పేరును సిఫార్సు చేసినట్లు సమాచారం. మరోనేత ఎన్నికల్లో పనిచేసి వెళ్లిన అధికారితోపాటు, తన సామాజిక వర్గానికి చెందిన ఓ సీఐ పేరు సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. యాదవ సామాజిక వర్గానికి చెందిన అధికారులకు అవకాశం ఇవ్వాలని మైదుకూరు, రిమ్స్ సర్కిళ్ల కోసం ఆయా ప్రాంతాలకు చెందిన ఇరువురు నేతలు పట్టుబడుతున్నారు. ఇలా ఎవరి పరిధిలో అధికారులు, నాయకులు పెద్ద ఎత్తున పైరవీలు చేస్తున్నారు. -
గుట్టు రట్టు
ఆత్మకూరు రూరల్ అధికారులు, అధికార పార్టీ నేతల అండదండలతో స్వయం సహాయక సంఘాల నాయకులు అక్రమాలకు తెరలేపారు. సభ్యులందరికీ మంజూరైన నిధులను కొందరికి ఇచ్చి.. మరికొందరికి ఎగనామం పెట్టారు. గ్రామీణ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాల బలోపేతానికి కృషి చేయాల్సిన ఐకేపీ కార్యాలయం అక్రమార్కులకు అడ్డాగా మారింది. గుట్టుగా సాగుతున్న వీరి అవినీతి బాగోతం సమాచార హక్కు చట్టంతో రట్టు అయింది. వెంటనే బాధితులు అక్రమార్కులపై డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు, గ్రామైక్య సంఘ లీడర్లు కేసును నీరుగార్చేందుకు బాధితుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి. ఆత్మకూరు మండలంలోని నల్లకాల్వ గ్రామంలో భవానీ, అపరంజీ, సమీర అనే మూడు గ్రామైక్య సంఘాలు ఉన్నాయి. దళిత, గిరిజన ఉప ప్రణాళికలో భాగంగా దళిత, గిరిజనులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఈ ఏడాది ఏప్రిల్ నెలలో గ్రామంలోనీ భవానీ గ్రామైక్య సంఘంలో 34 మందికి రూ.10.50 లక్షలు మంజూరయ్యాయి. అయితే గ్రామైక్య సంఘం అధ్యక్షురాలు సరళమ్మ, ఆమె భర్త శ్రీనివాసులు అధికారులతో కుమ్మక్కై లబ్ధిదారులకు ఆ రుణాలు ఇవ్వకుండా తమకు అనుకూలమైన వారికి కొంతమేర రుణాలు అందజేశారు. రూ.40 వేలు వచ్చిన వారికి రూ.20 వేలు, రూ.30 వేలు వచ్చిన వారికి రూ.15 వేల చొప్పున కేవలం 14 మందికి మాత్రమే ఇచ్చారు. అయితే రికార్డుల్లో, బాండు పేపర్లలో మాత్రం లబ్ధిదారులకు మాత్రమే రుణాలు ఇచ్చినట్లు రాసుకున్నారు. రుణాల విషయాలను నిలదీసిన వారికి మాత్రం గుట్టుచప్పుడు కాకుండా రూ.10 వేల చొప్పున ఇద్దరికి ఇచ్చినట్లు సమాచారం. గ్రామంలో కొందరికి మాత్రమే రుణాలు రావడంతో కొన్ని సందర్భాల్లో రుణాల విషయాలను తమకు తెలపాలంటూ అధికారులను, గ్రామైక్య సంఘాల లీడర్లను, సభ్యులను అడిగినా వారు సరైన సమాచారం ఇవ్వకపోవడంతో అనుమానం వచ్చిన బాధితులు సమాచార హక్కు చట్టంతో అక్రమాలను బయటకు తీశారు. వెంటనే తమకు న్యాయం చేయాలని డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. అక్రమాలు బయట పడడంతో అవినీతికి పాల్పడిన గ్రామైక్య సంఘ లీడర్లు, సంబంధిత అధికారులకు ముచ్చెమటలు పట్టాయి. దీంతో వారు కేసును నీరుగార్చేందుకు బాధితుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. బాధితులు నరసింహుడు, బాలనాగమ్మ, మహానంది, సామేలు, శేఖర్, ప్రభుదాసు, పక్కీరయ్య, జయపాల్, నాగేశ్వరరావు అక్రమార్కులపై కేసు నమోదు చేసి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. సమాచార హక్కు చట్టం లేకుంటే తమను పట్టించుకునే వారు కాదని, ఆ నిధుల గురించి తెలిసేది కాదని బాధితులు వాపోతున్నారు. ఇవే కాకుండా గ్రామంలోని మూడు గ్రామైక్య సంఘాల్లో అభయహస్తం, ఆమ్ఆద్మీ, విద్యార్థుల స్కాలర్షిప్పులు, జీవనోపాదుల కింద గొర్రెలు, బర్రెల కోసం మంజూరు చేసిన నిధులలో దాదాపు రూ.40 లక్షల మేర అవినీతి జరిగిందని బాధితులు ఆరోపిస్తున్నారు. అందువల్ల అవినీతి అక్రమాలకు పాల్పడిన గ్రామైక్య, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. అక్రమార్కులకు అధికార టీడీపీ అండ గ్రామంలో అక్రమార్కులకు, అధికారులకు అధికార పార్టీ నేతల అండదండలు ఉండడంతో వారిని ఎదురించేందుకు ఎవ్వరూ సాహసించడంలేదు. ఫలితంగా వచ్చిన డబ్బునంతా నేతలు, వారి బంధువులు, అధికారులు మాత్రమే పంచుకుంటున్నారు. ఈ విధంగా వారి అక్రమాలు మూడుపువ్వులు ఆరుకాయలుగా సాగుతోంది. అంతేకాకుండా ప్రతి సంవత్సరానికి గ్రామైక్య, గ్రూపు లీడర్ల మార్పు జరగాలి. కానీ అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. గ్రామైక్య సంఘ లీడర్లుగా వారే గత 12 సంవత్సరాలుగా కొనసాగుతున్నారు. గతంలో మాజీ మంత్రి ఏరాసు అనుచరులుగా, ప్రస్తుతం శిల్పా అనుచరులుగా ఉంటున్నారు. అధికారులు సైతం అక్రమార్కులకే కొమ్ము కాస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. రుణాలతో వడ్డీ వ్యాపారం బ్యాంకుల ద్వారా, జీవనోపాదుల కింద, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు, ఐకేపీ ప్రత్యేక నిధులు మంజూరైతే అటు గ్రామైక్య సంఘ లీడర్లు, ఇటు అధికారులు కొందరికి మాత్రమే ఇస్తున్నారు. మిగిలిన డబ్బులతో వడ్డీ వ్యాపారం చేస్తున్నట్లు సమాచారం. ఈ విధంగా వీరు అక్రమంగా సంపాదిస్తూ అందరికీ అన్యాయం చేస్తున్నారని బాధితులు మండిపడుతున్నారు. జిల్లా అధికారులకు ఫిర్యాదు చేయనున్న బాధితులు అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని డీఎస్పీకి ఫిర్యాదు చేసినా బాధితులకు న్యాయం జరగడంలేదు. నాలుగు రోజులుగా విచారిస్తున్నా చర్యలు తీసుకోకపోవడంతో జిల్లా అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు బాధితులు తెలిపారు. -
పోలీస్ X టీఆర్ఎస్
కామారెడ్డి: కామారెడ్డి సబ్ డివిజన్ పరిధిలో పోలీసు అధికారులకు, అధికార పార్టీ నేతలకు మధ్య వార్ నడుస్తోంది. కొంతకాలంగా డివిజన్లో పనిచేస్తున్న పలువురు అధికారులపై టీఆర్ఎస్ గుర్రుగా ఉంది. అధికారులను బదిలీ చేయించడానికి అధికార పక్ష నేతలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే కామారెడ్డి నియోజకవర్గంలో ఇద్దరు సీఐలు బదిలీ అయ్యారు. డీఎస్పీని సాగనంపడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిసింది. తాజాగా దేవునిపల్లి ఎస్ఐ సెలవుపై వెళ్లారు. వారికి అనుకూలమనే గత ప్రభుత్వంలో పోలీస్ సబ్ డివిజన్లో పోస్టింగులు తెచ్చుకున్న అధికారులు, గతంలో తమకు సహకరించలేద ని, వారిని సాగనంపడం ద్వారా తమ ఆధిపత్యాన్ని చాటుకోవాలని అధికార పార్టీ నేతలు ఉన్నతాధికారులపై ఒత్తిడి తీసుకువచ్చారు. డీఎస్పీ సురేందర్‌రెడ్డిని మొదటగా బదిలీ చేయించాలని ప్రయత్నిస్తున్నారని తెలిసింది. భిక్కనూరు, కామారెడ్డి రూ రల్ సీఐలు కాంగ్రెస్ నేతలకు అనుకూలంగా వ్యవహరించారని, వారిపై అధికార పక్షం నేతలు ఆగ్రహంగా ఉన్నారు. వారిని బదిలీ చేయించడానికి చేసిన ప్రయత్నాలు సఫలమయ్యాయి. భిక్కనూరు సీఐ సర్దార్‌సింగ్‌కు ముం దుగా బదిలీ జరిగింది. తర్వాత కామారెడ్డి రూరల్ సీఐ సుభాష్‌చంద్రబోస్ బదిలీ జరిగింది. మొదట్లో కామారెడ్డి పట్టణ సీఐ కృష్ణ బదిలీ జరుగుతుం దని భావించినా, కొంతకాలం కొనసాగించాలని ఆయన అధికార పక్షం నేతలను కోరడంతో బదిలీ ఆగిపోయినట్టు సమాచారం. దేవునిపల్లి ఎస్ఐ నరేందర్‌రెడ్డి బదిలీ జరిగినా, తర్వాత రద్దయింది. ఆందోళనకు దిగిన నేతలు ఈనెల 11న రాత్రిపూట క్యాసంపల్లి స్టేజీ సమీపంలోని ఓ దాబాలో కొందరు టీఆర్ఎస్ నేతలు మద్యం సేవిస్తుండగా దేవునిపల్లి ఎస్ఐ దాడి చేశారు. ఎస్ఐ కావాలనే చేస్తున్నారని ఆ పార్టీ నేతలు ఠాణాలో ఆందోళనకు దిగారు. ఆయన వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్పీ సురేందర్‌రెడ్డి జోక్యం చేసుకుని వారిని శాంతింపజేశారు. టీఆర్ఎస్ నేతలు దేవునిపల్లి ఎస్సై బదిలీ విషయంలో పట్టుబట్టే అవకాశాలు ఉన్నాయి. ఆ రోజు జరిగిన సంఘటన తో మనస్తాపానికి గురైన దేవునిపల్లి ఎస్ఐ నరేందర్‌రెడ్డి సెలవుపై వెళ్లారు. ఆయన బదిలీ చేయించుకునే ప్రయత్నాలలోనే ఉన్నట్టు తెలుస్తోంది. గత ప్ర భుత్వ హయాంలో డివిజన్లోని పోలీసు అధికారులు, అప్పటి అధికార పక్ష నేతలకు అనుకూలంగా వ్యవహరించారని టీఆర్ఎస్ నేతలు వారిని టార్గెట్ చేశారని అంటున్నారు. తమకు అనుకూలమైన అధికారులకు పోస్టింగులు ఇప్పించుకోవడం ద్వారా తమ ఆధిపత్యం చాటుకోవాలని భావిస్తున్నారని చెబుతున్నారు. -
ఇసుకాసురులు
ధర్మవరం : దర్మవరం నియోజకవర్గ పరిధిలో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతోంది. అధికార పార్టీ నాయకులు తాడిమర్రి, బత్తలపల్లి, ధర్మవరం, ముదిగుబ్బ మండలాల్లోని చిత్రావతి నది పరీవాహక ప్రాంతం నుంచి రోజూ వందలాది లారీల ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. బెంగళూరు, బాగేపల్లి, యలహంక, అనంతపురం, హిందూపురం, ధర్మవరం తదితర ప్రాంతాల్లో విక్రయిస్తూ భారీగా ఆర్జిస్తున్నారు. అక్రమ రవాణాను అడ్డుకోవాల్సిన పోలీసులు, రెవెన్యూ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ధర్మవరం మండల పరిధిలోని సీసీ కొత్తకోట, కనంపల్లి, పోతుల నాగేపల్లి వద్ద నుంచి ఇసుకను ట్రాక్టర్లలో తరలించి.. డంప్‌లలో నిల్వ చేస్తున్నారు. అక్కడి నుంచి జేసీబీల ద్వారా లారీలకు లోడ్ చేసి బెంగళూరుకు తరలిస్తున్నారు. ధర్మవరం మండలం కనంపల్లి- చెన్నేకొత్తపల్లి మండలం చిన్నపరెడ్డిపల్లి గ్రామాల మధ్య ఒకటి, ధర్మవరం మండలం కొత్తకోట వద్ద, చెన్నేకొత్తపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో, బసంపల్లి చెరువులో డంప్‌లు ఏర్పాటు చేసుకున్నారు. చిత్రావతి నది నుంచి డంప్ వద్దకు ఒక లారీకి సరిపడే ఇసుక (5 లోడ్లు) తరలించినందుకు గాను ట్రాక్టర్ బాడుగ రూ.10 వేలు చొప్పున చెల్లిస్తున్నారు. లారీ ఇసుకను బెంగళూరులో రూ.70 వేలు, బాగేపల్లిలో రూ.50 వేలు, హిందూపురంలో రూ.45 వేల చొప్పున విక్రయిస్తున్నారు. తాడిమర్రి మండలం పెద్దకోట్ల, మోదుగులకుంట, దాడితోట గ్రామాల వద్దనున్న చిత్రావతి నది నుంచి ఇసుకను ఏకంగా టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా తరలించి మండల పరిధిలోని చిల్లావారిపల్లి సమీపంలో, దాడితోట కనంలో డంప్ చేస్తున్నారు. అక్కడి నుంచి లారీల్లో చిల్లావారిపల్లి-నార్పల మండలం గూగూడు మీదుగా పెద్దపప్పూరుకు చేర్చి.. అక్కడి నుంచి బత్తలపల్లి మీదుగా బెంగళూరుకు తరలిస్తున్నారు. మర్రిమాకులపల్లి వద్ద నుంచి బత్తలపల్లి మండలం రామాపురం, అప్రాశ్చెరువు, ధర్మవరం మీదుగా బెంగళూరుకు తీసుకెళుతున్నారు. ముదిగుబ్బ మండలం ఉప్పలపాడు వద్ద చిత్రావతి నది నుంచి, సంకేపల్లి వద్ద జిల్లేడుబండ ఏరు నుంచి ఇసుకను తీసుకెళ్లి సమీప ప్రాంతాల్లో డంప్ చేస్తున్నారు. అక్కడి నుంచి కృష్ణాపురం క్రాస్, బుక్కపట్నం, గోరంట్ల మీదుగా జిల్లా సరిహద్దులు దాటిస్తున్నారు. అందరికీ వాటాలు ఇసుక దందాలో గ్రామ స్థాయిలో ఉండే వీఆర్ఓల నుంచి తహశీల్దార్ల వరకు, గ్రామ పోలీస్ నుంచి సీఐ దాకా ముడుపులు అందుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ విషయాన్ని అధికార పార్టీ నాయకులే బాహాటంగా చెబుతున్నారు. పేపర్లలో వార్తలు వచ్చినప్పుడు మాత్రం నామమాత్రంగా దాడులు నిర్వహిస్తూ.. జరిమానా విధిస్తున్నారు. ఆ తర్వాత యథావిధిగా దందా నడుస్తోంది. మార్గం మధ్యలో ఉన్న అన్ని చెక్‌పోస్టులలో కూడా ప్రతిలోడుకూ మామూళ్లు ఇచ్చి సరిహద్దులను దాటిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక మొబైల్ టీం కూడా ఏర్పాటు చేసుకున్నట్లు తెలిసింది. ఘరానా మోసం ఇసుకను తరలించే లారీలను పట్టుకోవడం అంత తేలికైన విషయం కాదు. ఇసుకను లారీలో నింపిన తరువాత దానిపై ఒక అడుగుమేర పశువుల దాణా(తౌడు) కానీ, వరిపొట్టు కానీ వేసి టార్పాలిన్‌ను గట్టిగా బిగించి వేస్తున్నారు. ఎవరైనా తనిఖీ చేపట్టినప్పుడు పశువుల దాణా అని చెబుతూ తప్పించుకుంటున్నారు. -
కీ‘లక్’ ఎత్తులు..!
కొత్త ప్రభుత్వం త్వరలో కొలువు తీరనుంది. ఇటీవల ఎన్నికల నేపథ్యంలో జరిగిన బదిలీల్లో మార్పులు చోటు చేసుకోనున్నాయి. అందుకే ఇప్పుడు అధికారులంతా కోరుకున్న చోట పోస్టింగుల కోసం పైరవీలతో ఫైళ్లు పట్టుకొని తిరుగుతున్నారు. పాలకపక్ష నేతలను ప్రసన్నం చేసుకునేందుకు ఎత్తులు వేస్తున్నారు. అనుకూలమైన కుర్చీ కోసం గట్టిగా యత్నిస్తున్నారు. పరిచయాలను వినియోగించుకొని ఒత్తిళ్లు తెస్తున్నారు. నాయకులను తెగ మొహమాట పెట్టేస్తున్నారు. సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : కొత్త ప్రభుత్వం కొలువుదీరడమే తరువాయి కోరుకున్న చోట పోస్టింగు దక్కించుకునేందుకు అధికారులు పావులు కదుపుతున్నారు. మరోవైపు అధికార పార్టీ నేతలు తమకు అనుకూలంగా ఉండే అధికారులకు పోస్టింగులు ఇప్పించుకునే ప్రయత్నాల్లో మునిగి తేలుతున్నారు. తమ కనుసన్నల్లో పనిచేసే అధికారుల కోసం నేతలు మరీ వెతుకులాట ప్రారంభించారు. రెవెన్యూ, పోలీసు విభాగాల్లో కాసులు రాలే చోట పోస్టింగు దక్కించుకునేందుకు అధికారులు తీవ్ర స్థాయిలో పోటీ పడుతున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మండల, జిల్లా స్థాయిలో వివిధ ప్రభుత్వ విభాగాల్లో భారీగా బదిలీలు జరిగే అవకాశం ఉంది. మరోవైపు కొత్త రాష్ట్రం ఆవిర్భావం నేపథ్యం లో బదిలీలు, పదోన్నతులు కూడా ఉంటాయని ఉద్యోగవర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ పరిణామాలను అనుకూలంగా మార్చుకుని కోరుకున్న చోట పోస్టింగు దక్కించుకునేందుకు అధికారులు పావులు కదుపుతున్నారు. పోలీసు, రెవెన్యూ విభాగాల్లో బదిలీ కోరుకుంటున్న అధికారులు అధికారంలోకి రాబోయే పార్టీ నేతల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఎన్నికల నేపథ్యంలో జిల్లా నుంచి 49 మంది తహశీల్దార్లు పొరుగు జిల్లాలకు బదిలీపై వెళ్లగా, మరో 38 మంది ఇతర జిల్లాల నుంచి వచ్చారు. ఎన్నికల్ కోడ్ ఎత్తివేయడంతో తహశీల్దార్లను తిరిగి సొంత జిల్లాలకు బదిలీ చేసేందుకు మార్గం సుగమమైంది. జిల్లాకు తిరిగి వస్తున్న తహశీల్దార్లు కీలక మండలాల్లో పోస్టింగులు దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. హైదరాబాద్‌కు సమీపంలో వున్న కొత్తూరు, ఫరూఖ్‌నగర్, నవాబుపేట తదితర మండలాలతో పాటు జాతీయ రహదారిపై వున్న మండలాల్లో పోస్టింగులకు గిరాకీ ఉంది. ఇదే అదునుగా కొందరు పైరవీకారులు రంగ ప్రవేశం చేసి బేరసారాలు కుదుర్చుతున్నారు. ఓ ఉద్యోగ సంఘం నేతల కనుసన్నల్లోనే తహశీల్దార్ల పోస్టింగులు ఖరారవుతున్నట్లు సమాచారం. మరోవైపు పోలీసు పోస్టింగుల్లోనూ ఇదేరకమైన పరిస్థితి కనిపిస్తోంది. ఎన్నికల వేళ కొందరు ఎస్ఐ, సీఐ స్థాయి అధికారులు బదిలీపై వెళ్లినా, వారి స్థానంలో తాము కోరుకున్న వారినే కాంగ్రెస్ నేతలు రప్పించుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఎన్నికల సందర్భంగా కొందరు పోలీసు అధికారులకు కాంగ్రెస్ నేతలకు వత్తాసు పలికారనే విమర్శలు వచ్చాయి. ఇసుక, కల్లు మాఫియాలు పోలీసు అధికారుల పోస్టింగుల్లో కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. అనుకూలుర వేటలో.. టీఆర్ఎస్ అధికార పార్టీగా ఆవిర్భవించడంతో ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు తమకు అనుకూలంగా ఉండే అధికారుల కోసం వేట ప్రారంభించారు. ఆర్డీఓలు, డీఎస్పీ స్థాయి అధికారులను తమకు అనుకూలంగా ఉన్న వారిని రప్పించుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఓటమి పాలైన అభ్యర్థులు కూడా తమ నియోజకవర్గాల్లో అనుకూలంగా ఉండే అధికారులు ఉంటే విపక్ష ఎమ్మెల్యేలను ఎదుర్కోవచ్చనే వ్యూహంతో ఉన్నారు. -
ఏమైనా చేస్తాం..
కందుకూరు రూరల్, న్యూస్‌లైన్: అధికారం చేతుల్లో ఉంది కదా అని అధికార పార్టీ నాయకులు పేట్రేగిపోతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్నవేళ తమ నేతల కనుసన్నల్లో నడుస్తూ రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడుస్తున్నారు. ఓట్ల మార్పులు.. చేర్పుల ప్రక్రియలో అర్హులకు అన్యాయం చేస్తూ.. అనర్హులను మాత్రం అందలం ఎక్కిస్తున్నారు. మండల పరిధిలోని శ్రీరంగరాజపురంలో అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడికి బీఎల్ఓతో పాటు రెవెన్యూ అధికారుల అండదండలు సమృద్ధిగా లభించాయి. ఇంకేముందీ అర్హుల ఓట్లను తొలగించి.. పెద్ద ఎత్తున అనర్హుల పేర్లు ఓటరు లిస్టులో వచ్చేలా చేశాడు. 61 బోగస్ ఓట్లు.. గ్రామంలో ఉన్నట్లు ఎలాంటి గుర్తింపులేని వారి పేర్లు భారీగా జాబితాలో చేరాయంటే అతని ప్రభావం ఏమేరకు ఉందో అర్థం చేసుకోవచ్చు. జరుగుమల్లి వద్ద జయవరానికి చెందిన క్రాంతికుమార్, సుభాషిణి, లేళ్లపల్లి క్రాంతికుమార్ పేర్లు ఓటర్ల జాబితాలో నమోదు చేశారు. అలాగే కరేడుకు చెందిన గోపిరెడ్డి శింగారెడ్డి, పిచ్చిరెడ్డి, శేషమ్మ.. కొన్నేళ్లుగా శ్రీశైలంలో ఉంటున్న శివరాత్రి శ్రీనివాసులు, రాజ్యలక్ష్మి, కందుకూరులో నివాసం ఉంటున్న మల్లెల రుక్మిణమ్మ, పోలమ్మ, టి.వజ్రమ్మ, పొన్నలూరు మండలం శింగరబొట్లపాలెంలో ఉంటున్న దన్యాసి త్రివేణిలు.. ఇంకా ఉలవపాడు, చాకిచర్ల, చినపవని, సింగరాయకొండల్లో స్థిర నివాసం ఉంటున్న వారి పేర్లు కలుపుకొని మొత్తం 61 బోగస్ ఓట్లు జాబితాలో చేర్చారు. వీరంతా అధికార పార్టీకి చెందినవారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నచ్చకపోతే అంతే.. వాస్తవానికి గ్రామానికి చెందిన యువతులకు పెళ్లి అయితే వారి పేర్లు తొలగించాల్సి ఉంటుంది. కానీ బీఎల్ఓ దాని గురించి పట్టించుకోలేదు. అలాగే మరణించిన వారు, ఇంతకు ముందు ఓటరు జాబితాలో బోగస్ ఓట్లుగా ఉన్న వారి పేర్లను కూడా తొలగించాల్సి ఉన్నా.. బీఎల్ఓ ఎలాంటి విచారణ చేపట్టలేదు. అయితే అధికార పార్టీ నాయకులు పెద్దమొత్తంలో దరఖాస్తు చేసుకంటే వాటిని పరిశీలించకుండానే ఓటర్ల జాబితాలో చేర్చారు. ఓట్లు తొలగించాలని ఫారం-7 ద్వారా దరఖాస్తు చేస్తేనే పరిశీలించి తొలగించాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం గత పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీకి వ్యతిరేకంగా ఏజెంట్లుగా నిలబడిన వారిపేర్లు, నాయకత్వం వహించిన వారి కుటుంబాల్లోని పేర్లు, అధికార పార్టీకి వ్యతిరేకంగా ఓట్లు వేసిన వారి పేర్లను తొలగించారు. ఇలా మొత్తం 46 మంది అర్హులకు జాబితాలో చోటు లేకుండా చేశారు. అదే సమయంలో కొత్తగా దరఖాస్తు చేసుకున్న 50 మంది పేర్లను బుట్టదాఖలు చేశారు. మొత్తం మీద బీఎల్ఓ వ్యవహార శైలిపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. -
అది మావోడికే..
రూ.147 కోట్ల పనికి అధికార పార్టీ నేత పట్టు ఎన్‌హెచ్-365 విస్తరణ పనులకు ‘టెండర్’ తాను చెప్పిన వారికే కట్టబెట్టాలని బెట్టు ఎన్నికల ‘నిధి’ సేకరణకు యత్నాలు పూర్తిగా సహకరిస్తున్న కేంద్ర మంత్రి సాక్షి ప్రతినిధి, వరంగల్ : రాజకీయ పయనంలో కీలకమైనది ఎన్నికల పోరు. ఇందులో ముందుండేందుకు ప్రధాన వనరు అరుున నిధుల విషయంలో అధికార పార్టీ నేతలు ఇప్పటినుంచే అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సూక్తిని చక్కగా అమలు చేస్తున్నారు. ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులతో చేపట్టిన పనులను సొంత వ్యక్తులకు కట్టబెట్టి... ఎన్నికల ఖర్చును సమీకరించుకునే పనిలో వేగం పెంచారు. ఇందులో భాగంగా అర్హత ఉన్న ఇతర కాంట్రాక్టర్లను పక్కనబెట్టే పనిలో పడ్డారు. మంచిగా చెప్పి ఒప్పించడం... వినకుంటే వారిని బెదిరించడం చేస్తున్నారు. కొత్తగా మంజూరైన జాతీయ రహదారి నిర్మాణానికి సంబంధించి రూ.147 కోట్ల ప్యాకేజీ పనుల కాంట్రాక్ట్‌ను కట్టబెట్టే వ్యవహారం ఇప్పుడు అధికార పార్టీకి చెందిన ముఖ్య నేత కనుసన్నల్లోనే జరుగుతోంది. తన నియోజకవర్గంలో జరిగే ఈ పనుల కాంట్రాక్ట్‌ను తాను చెప్పిన వారికి ఇస్తే సరిపోతుందని... ఎన్నికల ఖర్చు కోసం ఏమీ ఇవ్వకున్నా ఫర్వాలేదని ఆ ముఖ్య నేత స్పష్టం చేయడంతో కేంద్ర మంత్రి సైతం ఇందుకు తలాడించినట్లు సమాచారం. మహారాష్ట్రలోని సిరొంచ నుంచి చిత్తూరు జిల్లా రేణిగుంట వరకు 643 కిలోమీటర్ల మేర చేపట్టిన జాతీయ రహదారి (ఎన్‌హెచ్-365) మన జిల్లాలో ములుగు, నర్సంపేట, గూడూరు, మహబూబాబాద్, మరిపెడ ప్రాంతాలను కలుపుతూ తానంచర్ల మీదుగా నల్లగొండ జిల్లాకు వెళ్తుంది. మన జిల్లాలో 115 కిలోమీటర్లు ఉన్న ఈ రహదారి పనులను రెండు ప్యాకేజీలుగా చేపట్టారు. మొదటి ప్యాకేజీలో రూ.147 కోట్లు, రెండో ప్యాకేజీలో రూ.127 కోట్లు కేటాయించారు. ప్రొక్యూర్మెంట్ పద్ధతిలో ప్రస్తుతం టెండర్ల ప్రక్రియ కొనసాగుతోంది. రూ.147 కోట్లతో చేపట్టే ప్యాకేజీ పనులను జిల్లాలోని కాంగ్రెస్ ముఖ్యనేత ఒకరు హైదరాబాద్‌కు చెందిన ఓ కాంట్రాక్టర్‌కు ఇప్పించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ టెండర్‌ను 7 శాతం పెంచి రూ.157 కోట్లకు ఇప్పిస్తే... మొత్తం ప్యాకేజీలో 10 శాతం కమీషన్ ఇచ్చేలా కాంట్రాక్టర్, అధికార పార్టీ ముఖ్యనేతకు మధ్య ఒప్పందం జరిగినట్లు తెలిసింది. అరుుతే అంచనా మొత్తాన్ని పెంచాలంటే... ఒకే టెండరు దాఖలు చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు ఎవరూ టెండర్ వేయకుండా కాంగ్రెస్‌కు చెందిన సదరు ముఖ్యనేత ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే పలు పనులను ఇదే తరహాలో తాను అనుకున్న కాంట్రాక్టర్‌కు ఇప్పించిన అనుభవం ఉన్న ఆ నేత... ఇప్పుడు అన్ని పార్టీల వారిని దీనికోసం సంప్రదిస్తున్నారు. ముందుగా నిర్ణయించిన రూ.147 కోట్ల కంటే అంచనాలను పెంచి అనుకున్న కాంట్రాక్టర్‌కు టెండర్ ఇప్పించేందుకు కేంద్ర మంత్రి సహకారం కూడా తీసుకుంటున్నట్లు కాంట్రాక్టర్లు చెబుతున్నారు. మొదటి ప్యాకేజీలో రూ.147 కోట్ల పనులకు టెండర్లు వేయవద్దని, ఈపీసీ పద్ధతిన టెండర్లు వేస్తే... గతంలో చేసిన పనుల నాణ్యతపై చర్యలు తీసుకునేలా చేస్తానని కేంద్ర మంత్రి స్థాయిలో బెదిరింపులు వస్తున్నట్లు వారు పేర్కొంటున్నారు. ఎన్నికల తరుణంలో ఈ ఒక్కసారి తమ మాట వినాలని లేకుంటే... బ్లాక్ లిస్ట్‌లో పెట్టాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నట్లు సమాచారం.