నీరు-చెట్టు.. అవినీతిదే పెమైట్టు
► అడిగిన కాడికి ఇస్తేనే చెరువుల పూడిక తీత
► అగ్రిమెంట్ వసూళ్లలో పోటీ పడుతున్న నీటిపారుదల శాఖ అధికారులు
కర్నూలు సిటీ: నీరు చెట్టు కార్యక్రమం లక్ష్యం నీరుగారుతోంది. అధికారులు, అధికార పార్టీ నేతలు ఈ కార్యక్రమాన్ని ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు. 100 ఎకరాల్లోపు ఆయకట్టు ఉన్న చెరువులను ఆయా గ్రామ పంచాయతీల్లో ఉన్న జన్మభూమి కమిటీలతో, ఆపైన ఆయకట్టు ఉన్న చెరువులను నీటి వినియోగదారుల సంఘాలతో పూడికతీత పనులు చేయించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే పనులు చేయించే వ్యక్తితో అగ్రిమెంట్ చేసుకోవాలని అందులో పేర్కొంది. దీనిని అవకాశంగా తీసుకున్న నీటిపారుదల శాక అధికారులు అగ్రిమెంట్ చేసేందుకు నీటి సంఘాలకు ఓ రేటు, జన్మభూమి కమిటీలకు మరో రేటు పెట్టి వసూళ్లు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చేసిన వసూళ్లలో అధికారపార్టీ నేతలకు సైతం వాటాలు ఇస్తున్నట్లు సమాచారం.
అగ్రిమెంట్ వసూళ్లు ఇలా!
జిల్లాలో చిన్న నీటి పారుదల శాఖ, పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో మొత్తం 634 చెరువులు ఉన్నాయి. ఈ ఏడాది మొత్తం 400 చెరువుల్లో పూడికతీత పనులు చేయాలని లక్ష్యం. ఇప్పటీ వరకు 323 పనులకు కలెక్టర్ అనుమతులు ఇచ్చారు. ఈనెల 13 వరకు 203 చెరువుల్లో మాత్రమే పూడికతీత పనులు ప్రారంభమయ్యాయి. నీటి సంఘం చేయించే పనికి రూ. 15 వేల నుంచి రూ. 40 వేల వరకు, జన్మభూమి కమిటీలకు అప్పగించిన వారి దగ్గర నుంచి రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు వసూళ్లు చేస్తున్నారు. నంద్యాల డివిజన్‌కు చెందిన ఓ చెరువు పూడికతీత పని చేయిస్తున్న వ్యక్తి అక్కడి సాంకేతిక విభాగం అధికారుల వసూళ్లపై ఫిర్యాదు చేసేందుకు ఇటీవల కర్నూలుకు వచ్చారు. ఎస్‌ఈ సెలవుల్లో వెళ్లారని తెలుసుకుని వెనక్కి వెళ్లారు.
ఈ వసూళ్ల పర్యంపై ఓ అధికారిని అడిగితే నంద్యాల డివిజన్‌లో పని చేస్తున్న ఓ అధికారి వసూలు చేస్తున్నట్లు తెలిసిందని, కర్నూలు డివిజన్‌లో పని చేసే ఓ అధికారి కూడా అలా చేస్తున్నారని, అయితే అవి ఆఫీస్ ఖర్చులకు వాడుకుంటారని చెప్పడం గమనార్హం. ఈ అక్రమ వసూళ్లకు నంద్యాల ప్రాంతానికి చెందిన అధికార పార్టీ నేత అండ ఉండటంతో, అతనికి వాటా కూడా ముడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొత్తంమీద వసూళ్ల పర్వంలో కర్నూలు డివిజన్ కంటే నంద్యాల డివిజన్ అధికారులే ముందున్నారని సమాచారం.
విచారించి చర్యలు తీసుకుంటాం
నీరు-చెట్టు కార్యక్రమం కింద పూడికతీత పనులను నీటి వినియోగదారుల సంఘాలకు, జన్మభూమి కమిటీలకు ఇస్తున్నాం. అయితే అగ్రిమెంట్ చేసుకునేందుకు నంద్యాల, కర్నూలు డివిజన్ల కార్యాలయాల్లో డబ్బులు వసూలు చేస్తున్నారనే విషయం మా దృష్టికి అయితే రాలేదు. విచారించి చర్యలు తీసుకుంటాం. అగ్రిమెంట్‌కు డబ్బులు ఇవ్వడం, తీసుకోవడం నేరం కిందికి వస్తుంది.
- చంద్రశేఖర్ రావు, జల వనరుల శాఖ పర్యవేక్షక ఇంజినీర్