బెజవాడపై నిఘా
► నల్లమల నుంచి నగరానికి పెద్ద సంఖ్యలో మావోయిస్టులు
► భూతం అన్నపూర్ణ అరెస్ట్‌తో పోలీసులు అప్రమత్తం
► నగరంలో సానుభూతి పరుల కదలికలపై ఆరా
సాక్షి, విజయవాడ : మావోయిస్టు షెల్టర్ జోన్‌గా ఉన్న బెజవాడ నగరంపై పోలీసులు నిఘా ఉంచారు. నగరంలోకి కొత్తగా ఎవరెవరు వస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా ఉన్నారా, సానుభూతిపరులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉంది లాంటి అంశాలపై నగర కమిషనరేట్ పోలీసులు దృష్టి సారించారు. మావోయిస్టు పార్టీ ఆంధ్ర-ఒడిస్సా బోర్డర్ దళ డెప్యూటీ కమాండర్ భూతం అన్నపూర్ణ అలియాస్ అరుణ, సృజనను గుంటూరు రూరల్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో మావోయిస్టు సానుభూతిపరుల కదలికలపై రెండు జిల్లాల్లో పోలీస్ నిఘా పెరిగింది.
మళ్లీ కలకలం...
విజయవాడ నగరం ఎన్నో ఏళ్లుగా మావోయిస్టులకు షెల్టర్ జోన్‌గా ఉంది. నగరంలో మావోయిస్టు సానుభూతిపరులు అధికంగా ఉన్నారు. ముఖ్యంగా నల్లమల నుంచి మావోయిస్టులు నగరంలో తలదాచుకోవటంతో పాటు వైద్య సేవల కోసం ఎక్కువగా వస్తుంటారు. ఈ క్రమంలో 2004కు ముందు విజయవాడలో వెంకటేశ్వర్లు అనే మావోయిస్టు లొంగిపోవటం మినహా ఇతర ఘటనలు చోటుచేసుకోలేదు. ముఖ్యంగా ఇక్కడి గుంటూరు, కృష్ణా జిల్లాలో అధికార పార్టీ నేతల ఆగడాలు, ఇసుక మాఫియా ఆగడాలపై మావోయిస్టు పార్టీ స్పందించి కొందరు నేతలకు అల్టిమేటం ఇచ్చింది. ఈ క్రమంలో పోలీసులు భద్రతాపరంగా చర్యలు తీసుకుంటూ దీనిపై దృష్టిసారించారు.