కలకలం... | Maoists letter on the sand mafia | Sakshi
Sakshi News home page

కలకలం...

Published Wed, Dec 18 2013 4:22 AM | Last Updated on Tue, Oct 9 2018 2:51 PM

Maoists letter on the sand mafia

భద్రాచలం, న్యూస్‌లైన్ : ఇసుకమాఫియా ఆగడాలను అడ్డుకుంటామంటూ మావోయిస్టు ఉత్తర తెలంగాణ ప్రచార కమిటీ కార్యదర్శి జగన్ పేరుతో లేఖ విడుదలైనట్లుగా ప్రసార మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచా రం కావటంతో తీవ్రచర్చ జరుగుతోంది. మావోయిస్టులు తమ లేఖలో ఏకంగా కొంతమంది రాజకీయ నాయకుల పేర్లను కూడా ప్రస్తావించటం చర్చకు దారితీ సింది. జగన్ పేరుతో విడుదలైనట్లుగా చెబుతున్న లేఖలో జిల్లాకు చెందిన నాయకుల పేర్లు ఉండటం అన్ని రాజకీయ పార్టీల్లో కలకలం రేపింది. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు వనమా వెంకటేశ్వరరావు, భద్రాచలం ఎమ్మెల్యే కుంజా సత్యవతి, టీడీపీకి చెందిన ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ పేర్లు ఉన్నట్లుగా ప్రచారం జరిగింది. కాగా, ఇసుక మాఫియాతో సంబంధం ఉన్నట్లుగా వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని వారు కొట్టిపారేశారు. గోదావరి ఇసుకకు రాష్ట్ర స్థాయిలో మంచి డిమాండ్ ఉంది.
 
 భద్రాచలం, పాల్వంచ డివిజన్‌ల పరిధిలో ఈసారి గోదావరి నదిలో ఇసుకను తవ్వుకునేందుకు గిరిజన మిహ ళలతో ఏర్పడిన సొసైటీలకు అప్పగించారు. పీసా చట్టం అమల్లో భాగంగానే కాంట్రాక్ట్ వ్యవస్థను కాదని, ఎటువంటి టెండర్లు లేకుండా ఇసుక రీచ్‌ల నిర్వహణను సొసైటీలకు అప్పగించారు. మొదటి ఏడాది రీచ్‌ల నిర్వహణలో అనేక లోపాలు తలెత్తినట్లు పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. సొసైటీ సభ్యుల మాటున కొంతమంది బినామీలు రీచ్‌లపై పెత్తనం చేసి నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను తరలించారనే ఆరోపణలు కూడా వచ్చాయి. ఇక్కడ పనిచేసిన ఓ డివిజన్ స్థాయి అధికారిపై కూడా అవినీతిలో కూరుకుపోయినట్లుగా విమర్శలు వచ్చాయి. రోజులు గడుస్తున్నప్పటికీ రెండో ఏడాది ఇసుక రీచ్‌లను తెరవకపోవటం కూడా ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తోందని పలువురు అంటున్నారు. తాజాగా మావోయిస్టులు కూడా ఇసుక రీచ్‌ల్లో తలెత్తిన లోపాలపై దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది.  తమ లాభాలను కొంతమంది బడా వ్యాపారులు కొల్లగొట్టుకుపోయారనే విషయాన్ని కొంతమంది  సొసైటీ సభ్యులు మావోయిస్టుల దృష్టికితీసుకెళ్లటంతోనే వారు ఇటీవల కాలంలో తరచూ ఇసుక మాఫియాపై ప్రకటనలు చేస్తున్నారనే ప్రచారం ఉంది.
 
 సొసైటీల లెక్కలు తేలేదెప్పుడో..? : భద్రాచలం, పాల్వంచ డివిజన్‌లలో ఎనిమిది సొసైటీలను ఏర్పాటు చేసి ఇసుక రీచ్‌ల నిర్వహణను వారికి అప్పగించారు. వీటిలో దాదాపు అన్ని రీచ్‌లలో కూడా సభ్యుల మధ్య విభేదాలు తలెత్తాయి. బూర్గంపాడు మండ లం రెడ్డిపాలం వద్ద ఇసుక రీచ్‌పై ఏకంగా కోర్డును కూడా ఆశ్రయించారు. రెడ్డిపాలెంతోపాటు భద్రాచలం ఇసుక రీచ్ వద్ద కూడా ప్రస్తుతం పెద్ద ఇసుక కుప్పలు నిల్వ ఉన్నాయి. ఇప్పటి వరకూ వీటి లెక్కలు తేలకపోవటంతో దాన్ని తరలించే అవకాశం లేకుండా పోయింది. ఇసుక రీచ్‌లను నిర్వహించిన సొసైటీల ఆదాయ వ్యయాలపై నివేదికలు సిద్ధం కాకపోవటంతో వీటికి రెండో ఏడాది రీచ్‌ల నిర్వహణ అప్పగించేందుకు అధికారులు వెనుకంజ వేస్తున్నట్లుగా తెలిసింది. సొసైటీల్లో కోట్లాది రూపాయిలు అవకతవకలు జరిగినట్లుగా పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. దీనిపై ఉన్నతాధికారులు దృష్టి సారిస్తే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని సొసైటీ సభ్యులు అంటున్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement