కొత్త ప్రభుత్వం త్వరలో కొలువు తీరనుంది. ఇటీవల ఎన్నికల నేపథ్యంలో జరిగిన బదిలీల్లో మార్పులు చోటు చేసుకోనున్నాయి. అందుకే ఇప్పుడు అధికారులంతా కోరుకున్న చోట పోస్టింగుల కోసం పైరవీలతో ఫైళ్లు పట్టుకొని తిరుగుతున్నారు. పాలకపక్ష నేతలను ప్రసన్నం చేసుకునేందుకు ఎత్తులు వేస్తున్నారు. అనుకూలమైన కుర్చీ కోసం గట్టిగా యత్నిస్తున్నారు. పరిచయాలను వినియోగించుకొని ఒత్తిళ్లు తెస్తున్నారు. నాయకులను తెగ మొహమాట పెట్టేస్తున్నారు.
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : కొత్త ప్రభుత్వం కొలువుదీరడమే తరువాయి కోరుకున్న చోట పోస్టింగు దక్కించుకునేందుకు అధికారులు పావులు కదుపుతున్నారు. మరోవైపు అధికార పార్టీ నేతలు తమకు అనుకూలంగా ఉండే అధికారులకు పోస్టింగులు ఇప్పించుకునే ప్రయత్నాల్లో మునిగి తేలుతున్నారు. తమ కనుసన్నల్లో పనిచేసే అధికారుల కోసం నేతలు మరీ వెతుకులాట ప్రారంభించారు. రెవెన్యూ, పోలీసు విభాగాల్లో కాసులు రాలే చోట పోస్టింగు దక్కించుకునేందుకు అధికారులు తీవ్ర స్థాయిలో పోటీ పడుతున్నారు.
కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మండల, జిల్లా స్థాయిలో వివిధ ప్రభుత్వ విభాగాల్లో భారీగా బదిలీలు జరిగే అవకాశం ఉంది. మరోవైపు కొత్త రాష్ట్రం ఆవిర్భావం నేపథ్యం లో బదిలీలు, పదోన్నతులు కూడా ఉంటాయని ఉద్యోగవర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ పరిణామాలను అనుకూలంగా మార్చుకుని కోరుకున్న చోట పోస్టింగు దక్కించుకునేందుకు అధికారులు పావులు కదుపుతున్నారు. పోలీసు, రెవెన్యూ విభాగాల్లో బదిలీ కోరుకుంటున్న అధికారులు అధికారంలోకి రాబోయే పార్టీ నేతల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు.
ఎన్నికల నేపథ్యంలో జిల్లా నుంచి 49 మంది తహశీల్దార్లు పొరుగు జిల్లాలకు బదిలీపై వెళ్లగా, మరో 38 మంది ఇతర జిల్లాల నుంచి వచ్చారు. ఎన్నికల్ కోడ్ ఎత్తివేయడంతో తహశీల్దార్లను తిరిగి సొంత జిల్లాలకు బదిలీ చేసేందుకు మార్గం సుగమమైంది. జిల్లాకు తిరిగి వస్తున్న తహశీల్దార్లు కీలక మండలాల్లో పోస్టింగులు దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. హైదరాబాద్‌కు సమీపంలో వున్న కొత్తూరు, ఫరూఖ్‌నగర్, నవాబుపేట తదితర మండలాలతో పాటు జాతీయ రహదారిపై వున్న మండలాల్లో పోస్టింగులకు గిరాకీ ఉంది. ఇదే అదునుగా కొందరు పైరవీకారులు రంగ ప్రవేశం చేసి బేరసారాలు కుదుర్చుతున్నారు. ఓ ఉద్యోగ సంఘం నేతల కనుసన్నల్లోనే తహశీల్దార్ల పోస్టింగులు ఖరారవుతున్నట్లు సమాచారం. మరోవైపు పోలీసు పోస్టింగుల్లోనూ ఇదేరకమైన పరిస్థితి కనిపిస్తోంది. ఎన్నికల వేళ కొందరు ఎస్‌ఐ, సీఐ స్థాయి అధికారులు బదిలీపై వెళ్లినా, వారి స్థానంలో తాము కోరుకున్న వారినే కాంగ్రెస్ నేతలు రప్పించుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఎన్నికల సందర్భంగా కొందరు పోలీసు అధికారులకు కాంగ్రెస్ నేతలకు వత్తాసు పలికారనే విమర్శలు వచ్చాయి. ఇసుక, కల్లు మాఫియాలు పోలీసు అధికారుల పోస్టింగుల్లో కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది.
అనుకూలుర వేటలో..
టీఆర్‌ఎస్ అధికార పార్టీగా ఆవిర్భవించడంతో ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు తమకు అనుకూలంగా ఉండే అధికారుల కోసం వేట ప్రారంభించారు. ఆర్డీఓలు, డీఎస్పీ స్థాయి అధికారులను తమకు అనుకూలంగా ఉన్న వారిని రప్పించుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఓటమి పాలైన అభ్యర్థులు కూడా తమ నియోజకవర్గాల్లో అనుకూలంగా ఉండే అధికారులు ఉంటే విపక్ష ఎమ్మెల్యేలను ఎదుర్కోవచ్చనే వ్యూహంతో ఉన్నారు.
కీ‘లక్’ ఎత్తులు..!
Published Wed, May 28 2014 2:28 AM | Last Updated on Sat, Sep 2 2017 7:56 AM
Advertisement
Advertisement