revenue police
-
ఎర్రమట్టి దుమారం
► మట్టి తరలింపును అడ్డుకున్న ► గాజులపల్లెవాసులు ► ఉద్రిక్తత కు దారితీసిన వివాదం గాజులపల్లె(మహానంది): గాజులపల్లె సమీపంలోని అంకిరెడ్డి చెరువు నుంచి ఎర్రమట్టి తరలింపు తతంగం గురువారం వివాదానికి దారి తీసింది. అధికారపార్టీ నేతలు మట్టి తరలిస్తుండగా గాజులపల్లె గ్రామస్తులు అడ్డుకున్నారు. అక్కడున్న ప్రొక్లెయిన్లు, టిప్పర్, ఇతర వాహనాలను చెరువు నుంచి బయటకు పంపించడంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. ఇటుకల బట్టీలు, ఇతర అవసరాల నిమిత్తం అంకిరెడ్డి చెరువు నుంచి కొందరు కొన్ని రోజులుగా ఎర్రమట్టి తరలిస్తున్నారు. అయితే గ్రామస్తుల ఫిర్యాదు మేరకు భూగర్భ, రెవెన్యూ, పోలీసు అధికారులు అడ్డుకోవడంతో మూడు నాలుగురోజులుగా తరలింపు ఆగింది. తర్వాత మళ్లీ మొదలు కావడంతో గురువారం గాజులపల్లె గ్రామానికి చెందిన కొందరు అధికార పార్టీ నాయకులు, ప్రజలు సుమారు వందమంది వరకు వెళ్లి మట్టి తరలింపును అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మట్టి తరలింపు వల్ల చెరువుకు గండ్లు పడతాయని, అదే జరిగితే పొలాలకు సాగునీటి కొరత ఏర్పడుతుంద ని వాపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. విషయంపై నీటి పారుదల శాఖ అధికారులు సుధాకర్, రామ్మోహన్‌కు ఫిర్యాదు చేశామని గ్రామస్థులు, చెరువు సంఘం అధ్యక్షుడు పెద్ద హుసేని, రైతులు తెలిపారు. శ్రీశైలం నియోజకవర్గంలోని టీడీపీ ముఖ్యనేత, ఆయన బంధువులు, నంద్యాల నియోజకవర్గానికి చెందిన నేతల మధ్య ఉన్న విభేదాలే ఎర్రమట్టి తరలింపు వివాదానికి కాారణమన్న చర్చ సాగుతోంది. -
కీ‘లక్’ ఎత్తులు..!
కొత్త ప్రభుత్వం త్వరలో కొలువు తీరనుంది. ఇటీవల ఎన్నికల నేపథ్యంలో జరిగిన బదిలీల్లో మార్పులు చోటు చేసుకోనున్నాయి. అందుకే ఇప్పుడు అధికారులంతా కోరుకున్న చోట పోస్టింగుల కోసం పైరవీలతో ఫైళ్లు పట్టుకొని తిరుగుతున్నారు. పాలకపక్ష నేతలను ప్రసన్నం చేసుకునేందుకు ఎత్తులు వేస్తున్నారు. అనుకూలమైన కుర్చీ కోసం గట్టిగా యత్నిస్తున్నారు. పరిచయాలను వినియోగించుకొని ఒత్తిళ్లు తెస్తున్నారు. నాయకులను తెగ మొహమాట పెట్టేస్తున్నారు. సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : కొత్త ప్రభుత్వం కొలువుదీరడమే తరువాయి కోరుకున్న చోట పోస్టింగు దక్కించుకునేందుకు అధికారులు పావులు కదుపుతున్నారు. మరోవైపు అధికార పార్టీ నేతలు తమకు అనుకూలంగా ఉండే అధికారులకు పోస్టింగులు ఇప్పించుకునే ప్రయత్నాల్లో మునిగి తేలుతున్నారు. తమ కనుసన్నల్లో పనిచేసే అధికారుల కోసం నేతలు మరీ వెతుకులాట ప్రారంభించారు. రెవెన్యూ, పోలీసు విభాగాల్లో కాసులు రాలే చోట పోస్టింగు దక్కించుకునేందుకు అధికారులు తీవ్ర స్థాయిలో పోటీ పడుతున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మండల, జిల్లా స్థాయిలో వివిధ ప్రభుత్వ విభాగాల్లో భారీగా బదిలీలు జరిగే అవకాశం ఉంది. మరోవైపు కొత్త రాష్ట్రం ఆవిర్భావం నేపథ్యం లో బదిలీలు, పదోన్నతులు కూడా ఉంటాయని ఉద్యోగవర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ పరిణామాలను అనుకూలంగా మార్చుకుని కోరుకున్న చోట పోస్టింగు దక్కించుకునేందుకు అధికారులు పావులు కదుపుతున్నారు. పోలీసు, రెవెన్యూ విభాగాల్లో బదిలీ కోరుకుంటున్న అధికారులు అధికారంలోకి రాబోయే పార్టీ నేతల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఎన్నికల నేపథ్యంలో జిల్లా నుంచి 49 మంది తహశీల్దార్లు పొరుగు జిల్లాలకు బదిలీపై వెళ్లగా, మరో 38 మంది ఇతర జిల్లాల నుంచి వచ్చారు. ఎన్నికల్ కోడ్ ఎత్తివేయడంతో తహశీల్దార్లను తిరిగి సొంత జిల్లాలకు బదిలీ చేసేందుకు మార్గం సుగమమైంది. జిల్లాకు తిరిగి వస్తున్న తహశీల్దార్లు కీలక మండలాల్లో పోస్టింగులు దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. హైదరాబాద్‌కు సమీపంలో వున్న కొత్తూరు, ఫరూఖ్‌నగర్, నవాబుపేట తదితర మండలాలతో పాటు జాతీయ రహదారిపై వున్న మండలాల్లో పోస్టింగులకు గిరాకీ ఉంది. ఇదే అదునుగా కొందరు పైరవీకారులు రంగ ప్రవేశం చేసి బేరసారాలు కుదుర్చుతున్నారు. ఓ ఉద్యోగ సంఘం నేతల కనుసన్నల్లోనే తహశీల్దార్ల పోస్టింగులు ఖరారవుతున్నట్లు సమాచారం. మరోవైపు పోలీసు పోస్టింగుల్లోనూ ఇదేరకమైన పరిస్థితి కనిపిస్తోంది. ఎన్నికల వేళ కొందరు ఎస్ఐ, సీఐ స్థాయి అధికారులు బదిలీపై వెళ్లినా, వారి స్థానంలో తాము కోరుకున్న వారినే కాంగ్రెస్ నేతలు రప్పించుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఎన్నికల సందర్భంగా కొందరు పోలీసు అధికారులకు కాంగ్రెస్ నేతలకు వత్తాసు పలికారనే విమర్శలు వచ్చాయి. ఇసుక, కల్లు మాఫియాలు పోలీసు అధికారుల పోస్టింగుల్లో కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. అనుకూలుర వేటలో.. టీఆర్ఎస్ అధికార పార్టీగా ఆవిర్భవించడంతో ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు తమకు అనుకూలంగా ఉండే అధికారుల కోసం వేట ప్రారంభించారు. ఆర్డీఓలు, డీఎస్పీ స్థాయి అధికారులను తమకు అనుకూలంగా ఉన్న వారిని రప్పించుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఓటమి పాలైన అభ్యర్థులు కూడా తమ నియోజకవర్గాల్లో అనుకూలంగా ఉండే అధికారులు ఉంటే విపక్ష ఎమ్మెల్యేలను ఎదుర్కోవచ్చనే వ్యూహంతో ఉన్నారు. -
రైతుల తిరుగుబాటు
కోట, న్యూస్‌లైన్ : మండలంలోని తిన్నెలపూడి ఇసుక రీచ్ నుంచి యథేచ్ఛగా సాగుతున్న ఇసుక అక్రమ రవాణాపై రైతులు తిరుగుబాటు చేశారు. ఇసుకను అక్రమంగా తరలిస్తున్న 18 వాహనాలను రైతులు అడ్డుకుని పోలీసులకు అప్పగించారు. స్వర్ణముఖి చల్లకాలువ రీచ్‌లో నిబంధనలకు విరుద్ధంగా తవ్వేసి ఇసుకను అక్రమ రవాణా చేస్తుండటంతో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవాలని అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది. ఈ రీచ్ నుంచి ఇసుకను ట్రాక్టర్ల ద్వారా తరలించి చిట్టేడు, గూడలి సమీప పొలాల్లో డంపింగ్ చేసి రాత్రి పూట చెన్నైకు అక్రమంగా లారీల్లో తరలిస్తున్నారు. ఎక్కువగా రాత్రి సమయంలోనే ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. అక్రమ రవాణాను అడ్డుకునేందుకు నిఘా బృందాలు ఏర్పాటు చేసి, కేసులు నమోదు చేయాలని ఉన్నతాధికారులు సూచించినా ఫలితం లేదు. రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం మామూళ్ల మత్తులో జోగుతూ ఇసుక అక్రమ రవాణాదారుల నుంచి భారీగా ముడుపులు అందుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు స్థానిక రైతులందరూ ఒక్కటయ్యారు. వెంకన్నపాళెం, తిన్నెలపూడి గ్రామాల రైతులు శనివారం స్వర్ణముఖి చల్లకాలువ రీచ్ వద్దకు వెళ్లి ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తరలిస్తుండగా అడ్డుకున్నారు. 18 ట్రాక్టర్లను కోట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో కొన్ని ట్రాక్టర్లను తప్పించేందుకు తహశీల్దార్ కార్యాలయం సిబ్బంది ప్రయత్నించారు. దీంతో రైతులు వారితో వాదనకు దిగడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను తవ్వేస్తుండటంతో గ్రామాల్లో సాగు,తాగు నీటి సమస్యలు ఎక్కువయ్యాయని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో ఇసుక అక్రమరవాణాదారుల నుంచి బెదిరింపులు కూడా వస్తున్నాయన్నారు. వీరికి అధికారుల అండదండలు ఉన్నాయని ఆరోపించారు. పట్టించిన వాహనాలను వదలవద్దని, కేసులు నమోదు చేయాలని కోరారు. పట్టుబడిన ట్రాక్టర్లను మైనింగ్ అధికారులకు అప్పగిస్తామని ఎస్ఐ వీరనారాయణ తెలిపారు.