కోట, న్యూస్‌లైన్ : మండలంలోని తిన్నెలపూడి ఇసుక రీచ్ నుంచి యథేచ్ఛగా సాగుతున్న ఇసుక అక్రమ రవాణాపై రైతులు తిరుగుబాటు చేశారు. ఇసుకను అక్రమంగా తరలిస్తున్న 18 వాహనాలను రైతులు అడ్డుకుని పోలీసులకు అప్పగించారు. స్వర్ణముఖి చల్లకాలువ రీచ్‌లో నిబంధనలకు విరుద్ధంగా తవ్వేసి ఇసుకను అక్రమ రవాణా చేస్తుండటంతో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవాలని అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది. ఈ రీచ్ నుంచి ఇసుకను ట్రాక్టర్ల ద్వారా తరలించి చిట్టేడు, గూడలి సమీప పొలాల్లో డంపింగ్ చేసి రాత్రి పూట చెన్నైకు అక్రమంగా లారీల్లో తరలిస్తున్నారు. ఎక్కువగా రాత్రి సమయంలోనే ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. అక్రమ రవాణాను అడ్డుకునేందుకు నిఘా బృందాలు ఏర్పాటు చేసి, కేసులు నమోదు చేయాలని ఉన్నతాధికారులు సూచించినా ఫలితం లేదు. రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం మామూళ్ల మత్తులో జోగుతూ ఇసుక అక్రమ రవాణాదారుల నుంచి భారీగా ముడుపులు అందుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ క్రమంలో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు స్థానిక రైతులందరూ ఒక్కటయ్యారు. వెంకన్నపాళెం, తిన్నెలపూడి గ్రామాల రైతులు శనివారం స్వర్ణముఖి చల్లకాలువ రీచ్ వద్దకు వెళ్లి ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తరలిస్తుండగా అడ్డుకున్నారు. 18 ట్రాక్టర్లను కోట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో కొన్ని ట్రాక్టర్లను తప్పించేందుకు తహశీల్దార్ కార్యాలయం సిబ్బంది ప్రయత్నించారు. దీంతో రైతులు వారితో వాదనకు దిగడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను తవ్వేస్తుండటంతో గ్రామాల్లో సాగు,తాగు నీటి సమస్యలు ఎక్కువయ్యాయని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో ఇసుక అక్రమరవాణాదారుల నుంచి బెదిరింపులు కూడా వస్తున్నాయన్నారు. వీరికి అధికారుల అండదండలు ఉన్నాయని ఆరోపించారు. పట్టించిన వాహనాలను వదలవద్దని, కేసులు నమోదు చేయాలని కోరారు. పట్టుబడిన ట్రాక్టర్లను మైనింగ్ అధికారులకు అప్పగిస్తామని ఎస్‌ఐ వీరనారాయణ తెలిపారు.
రైతుల తిరుగుబాటు
Published Sun, May 25 2014 2:24 AM | Last Updated on Sat, Sep 2 2017 7:48 AM
Advertisement
Advertisement