సీనియర్లకు మళ్లీ అవే శాఖలు... కేబినెట్ కూర్పుపై మోదీ ముద్ర
షాకు హోం, రాజ్‌నాథ్‌కు రక్షణ, నిర్మలకు ఆర్థికం
జైశంకర్‌కు విదేశాంగం, గడ్కరీకి రోడ్లు, హైవేలు
వైష్ణవ్‌కు ప్రమోషన్.. రైల్వే, ఐటీతో పాటు సమాచారం
శివరాజ్‌కు ప్రాధాన్యం.. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి
నడ్డా, ఖట్టర్‌లకూ రెండేసి ప్రధాన శాఖల బాధ్యతలు
జేడీయూకు పంచాయతీ, జేడీఎస్‌కు ఉక్కు, సేనకు ఆయుష్
రామ్మోహన్‌కు విమానయానం
వర్మకు భారీ పరిశ్రమలు, ఉక్కు (సహాయ)
పెమ్మసానికి గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ (సహాయ)
న్యూఢిల్లీ: అనుభవానికి పెద్దపీట వేస్తూ, అదే సమయంలో యువతకు సముచిత ప్రాధాన్యమిస్తూ నూతన కేంద్ర మంత్రులకు శాఖల కేటాయింపు జరిగింది. కసరత్తులో ఆసాంతం మోదీ–షా ముద్రే ప్రతిఫలించింది. పదేళ్లుగా మోదీ తొలి, మలి మంత్రివర్గాల్లో కీలకంగా వ్యవహరించిన బీజేపీ మంత్రులకు ఈసారీ ప్రాధాన్యం కొనసాగింది.
హోం శాఖ బాధ్యతలు మరోసారి అమిత్ షానే చేపట్టగా రాజ్‌నాథ్‌సింగ్ రక్షణ, నిర్మలా సీతారామన్ ఆర్థిక, జైశంకర్ విదేశాంగ శాఖల్లో కొనసాగనున్నారు. మోదీతో పాటు మొత్తం 72 మందితో ఆదివారం ఎన్డీఏ మంత్రివర్గం కొలువుదీరడం తెలిసిందే. మోదీ సిఫార్సు మేరకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వారికి సోమవారం శాఖలు కేటాయించారు.
గత రెండుసార్లకు భిన్నంగా ఈసారి బీజేపీకి సొంతంగా మెజారిటీ రాకపోవడంతో ప్రభుత్వ మనుగడలో ఎన్డీఏ పక్షాలు కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో టీడీపీ, జేడీ(యూ) తదితర భాగస్వాములకు శాఖల కేటాయింపులో సముచిత ప్రాధాన్యమే దక్కినా కీలక శాఖలన్నింటినీ బీజేపీయే అట్టిపెట్టుకునేలా అన్ని జాగ్రత్తలూ తీసుకున్నట్టు స్పష్టంగా కని్పంచింది.
కీలక శాఖలు కావాలని జేడీ(యూ), టీడీపీ ముందుగానే కోరినా కుదరదని బీజేపీ పెద్దలు స్పష్టం చేయడం తెలిసిందే. అందుకు తగ్గట్టుగానే వ్యూహాత్మక ప్రాధాన్యమున్న అత్యధిక పోర్టుఫోలియోలు బీజేపీ మంత్రులకే దక్కాయి. దేశవ్యాప్తంగా రోడ్డు నెట్‌వర్క్ అభివృద్ధి, విస్తరణ, ఆధునీకరణలో తనదైన మార్కు చూపిన నితిన్ గడ్కీరీకి మరోసారి రోడ్లు–హైవే శాఖ దక్కింది.
మోదీకి ప్రీతిపాత్రుడైన అశ్వినీ వైష్ణవ్‌కు కీలకమైన రైల్వే, ఐటీ–ఎలక్ట్రానిక్స్ శాఖలను కొనసాగించడమే గాక సమాచార–ప్రసార శాఖ బాధ్యతలు కూడా కట్టబెట్టడం విశేషం. గత ప్రభుత్వంలో ఆ బాధ్యతలు చూసిన అనురాగ్ ఠాకూర్‌కు ఈసారి మంత్రివర్గంలో చోటు దక్కకపోవడం తెలిసిందే. ఆయనకు బీజేపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించవచ్చని వార్తలొస్తున్నాయి.
ధర్మేంద్ర ప్రధాన్‌కు విద్య, పీయూష్ గోయల్‌కు వాణిజ్య, పరిశ్రమల శాఖలను కొనసాగించారు. హర్దీప్‌సింగ్ పురికి పెట్రోలియం శాఖను కొనసాగిస్తూ హౌజింగ్–పట్టణ వ్యవహారాలను తప్పించారు. తొలుత న్యాయ, తర్వాత అర్త్ సైన్సెస్ బాధ్యతలు చూసిన కిరెణ్ రిజిజుకు ప్రధానమైన పార్లమెంటరీ వ్యవహారాలు అప్పగించారు.
‘మామ’కు వ్యవసాయం
రాష్ట్రాల్లో ఏళ్ల తరబడి చక్రం తిప్పి కొత్తగా మోదీ కేబినెట్లో చేరిన బీజేపీ దిగ్గజాలకు ప్రధాన శాఖలే కేటాయించారు. వారిలో మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్‌సింగ్‌కు కీలకమైన వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖలు దక్కాయి. ఐదేళ్ల తర్వాత కేబినెట్లో అడుగు పెట్టిన బీజేపీ అధ్యక్షుడు జగత్‌ప్రకాశ్ నడ్డాకు
మరోసారి మోదీ తొలి మంత్రివర్గంలో
నిర్వర్తించిన ఆరోగ్య శాఖతో పాటు ఎరువులు–రసాయనాల శాఖ కూడా దక్కింది. ఇప్పటిదాకా ఆ రెండు శాఖలనూ మాండవీయ చూశారు. హరియాణా మాజీ సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్‌కు విద్యుత్‌తో పాటు పట్టణ వ్యవహారాలను అప్పగించారు. న్యాయ శాఖకు అర్జున్‌రాం మేఘ్వాల్, షిప్పింగ్‌కు సర్బానంద సోనోవాల్, పర్యావరణానికి భూపేందర్ యాదవ్, సామాజిక న్యాయానికి వీరేంద్ర కుమార్
కొనసాగారు. గిరిజన శాఖ బాధ్యతలు జ్యుయల్ ఓరంకు దక్కాయి.
తెలుగు రాష్ట్రాల నుంచి...
మోదీ 3.0 మంత్రివర్గంలో తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురికి చోటు దక్కడం తెలిసిందే. వారిలో కిషన్‌కు బొగ్గు, గనులు, ఏపీ నుంచి టీడీపీకి చెందిన రామ్మోహన్‌కు విమానయానం రూపంలో కేబినెట్ హోదా బెర్తులు దక్కాయి. గతంలో వాజ్‌పేయి సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో కూడా టీడీపీ నేత అశోక్ గజపతిరాజు పౌర విమానయాన శాఖ మంత్రిగా చేశారు.
తెలంగాణ నుంచి బండి సంజయ్‌కుమార్, ఏపీ నుంచి భూపతిరాజు శ్రీనివాస వర్మ, టీడీపీ నేత పెమ్మసాని చంద్రశేఖర్‌కు సహాయ మంత్రి పదవులు దక్కడం తెలిసిందే. బండికి హోం శాఖ కేటాయించారు. వర్మకు భారీ పరిశ్రమలు, ఉక్కు, పెమ్మసానికి గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల రూపంలో రెండేసి శాఖల బాధ్యతలు అప్పగించారు.
భాగస్వాములకు ఇలా...
ఎన్డీఏ భాగస్వాముల్లో జేడీ(యూ) నేత లలన్‌సింగ్‌కు పంచాయతీరాజ్, మత్స్య–పశుసంవర్ధకం–పాడి శాఖలు దక్కాయి. వ్యవసాయ శాఖపై ఆశలు పెట్టుకున్న జేడీ(ఎస్) చీఫ్ కుమారస్వామికి ఉక్కు, భారీ పరిశ్రమల బాధ్యతలు అప్పగించారు. హెచ్‌ఏఎం(ఎస్) చీఫ్ జితన్‌రాం మాంఝీకి ఎంఎస్‌ఎంఈ; ఎల్జేపీ (ఆర్‌వీ) అధ్యక్షుడు చిరాగ్ పాస్వాన్‌కు ఫుడ్ ప్రాసెసింగ్, టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడికి పౌర విమానయాన శాఖలు దక్కాయి. భాగస్వామ్య పక్షాలకు ఐదు కేబినెట్, రెండు స్వతంత్ర, నాలుగు సహాయ పదవులివ్వడం తెలిసిందే. ఇక స్వతంత్ర హోదా మంత్రుల్లో శివసేన నుంచి జి.పి.జాదవ్‌కు ఆయు‹Ù, ఆరెల్డీ నేత జయంత్ చౌదరికి నైపుణ్యాభివృద్ధి శాఖలిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment