ఫ్లెక్సీల రచ్చ
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: అనుచరులు చూపుతున్న అత్యుత్సాహం అధికార పార్టీ నేతలకు తలనొప్పిగా మారింది. వారి మధ్య అంతరాన్ని పెంచుతోంది. జిల్లా టీడీపీలో ప్రస్తుతం ఫ్లెక్సీల రాజకీయం నడుస్తోంది. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి జిల్లాలో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగారు. పార్టీలో ఆయన చెప్పిందే వేదం. ఎవరికి ఏ పదవి కావాలన్నా ఆయన ఆమోదముద్ర తప్పనిసరి. అయితే ప్రస్తుతం పరిస్థితి తారుమారైపోయింది. ఆయన స్థానాన్ని మరో కీలక నేత ఆక్రమించారు.
ఆయనే పురపాలకశాఖ మంత్రి పొంగూరు నారాయణ. ప్రస్తుతం ఆయన జిల్లాలోనే కాదు.. రాష్ట్రంలోనూ కీలకంగా మారారు. అటువంటి ఆయన దృష్టిలో పడేందుకు తమ్ముళ్లు కొందరు పోటాపోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి జిల్లా పార్టీ కార్యాలయం ముందు పోటాపోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. రెండు రోజులకొకరు మంత్రి ఫొటోతో.. సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, బీదా రవించద్ర ఫొటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. అందులోభాగంగా నూతన సంవత్సరం, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపే ఫ్లెక్సీలను జిల్లా పార్టీ కార్యాలయం ముందు ఏర్పాటు చేశారు. వివాదమంతా ఇక్కడే వచ్చింది.
నూతన సంవత్సరానికి నాలుగురోజుల ముందు పార్టీ కార్యాలయం ముందు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఫొటోతో రెండు ఫ్లెక్సీలు వెలిశాయి. అయితే 30న సోమిరెడ్డిని ‘లీడర్’గా అభివర్ణిస్తూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని తొలగించారు. దాని స్థానంలో మంత్రి నారాయణ ఫొటోతో ఉన్న ఫ్లెక్సీని అనుచరులు ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న సోమిరెడ్డి అనుచరులు కొందరు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఫ్లెక్సీని ఏర్పాటు చేసేందుకు పక్కనే స్థలం ఉన్నా... ఉన్న ఫ్లెక్సీని తొలగించి అక్కడే ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చిందని పలువురు కార్యకర్తలు చర్చించుకుంటున్నారు.
ప్రస్తుతం ఈ వివాదం పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నామినేటెడ్ పదవుల కోసం తెలుగు తమ్ముళ్లు ఇప్పటికే మూడు గ్రూపులుగా విడిపోయిన విషయం తెలిసిందే. పదవుల కోసం ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటూ.. ఒకరికి రాకుండా ఇంకొకరు అడ్డుపడుతున్నారనే ప్రచారం ఉంది. మరో వారంరోజుల్లో నామినేటెడ్ పదవులను భర్తీచేయనున్న నేపథ్యంలో ఈ ఫ్లెక్సీల వివాదం ఎక్కడికి దారితీస్తుందోనని తమ్ముళ్లు ఆందోళన చెందుతున్నారు.
అత్యుత్సాహంలో తమ్ముళ్లు...
పార్టీ అధికారంలోకి రావటంతో తమ్ముళ్లు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. రెండునెలల క్రితం జడ్. శివప్రసాద్ ఏకంగా నెల్లూరు నగర మేయరని బ్యానర్ ఏర్పాటు చేసిన విషయం పార్టీలో కలకలం రేపింది. అదేవిధంగా రెండు రోజుల క్రితం కోవూరు మార్కెట్‌యార్డు చైర్మన్‌గా విడవలూరుకు చెందిన విజయభానురెడ్డి ఫొటోతో ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం నియోజకవర్గంలో వివాదాస్పదమైంది.
అదేవిధంగా జిల్లా పార్టీలో పెద్ద దిక్కుగా ఉన్న నాయకుల మధ్య ఫ్లెక్సీల వివాదం పెద్ద తలనొప్పిగా మారింది. ఎమ్మెల్సీ పదవి తనకే దక్కుతుందన్న ధీమాతో సోమిరెడ్డి తన అనుచరులను ఎక్కడా నోరెత్తకుండా జాగ్రత్తపడుతున్నట్లు తెలిసింది. అయితే ఇవేమీ పట్టించుకోకుండా మంత్రి అనుచరులు మాత్రం జిల్లాలో తన హవాను కొనసాగిస్తుండటం గమనార్హం.