‘పక్కా’ రాజకీయం | 'pucca' politics | Sakshi
Sakshi News home page

‘పక్కా’ రాజకీయం

Published Thu, Feb 11 2016 2:00 AM | Last Updated on Sat, Jul 7 2018 2:56 PM

'pucca' politics

నెల్లూరు: పక్కా ఇళ్ల మంజూరులోనే అధికారపార్టీ నేతలు రాజకీయాలు చేస్తున్నారు. నిరుపేదలైన లబ్ధిదారులను పక్కనపెట్టి తనవారికే కట్టబెట్టేందుకు జాబితా సిద్ధం చేస్తున్నారు. అందులోనూ చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు తెలిసింది. వివరాల్లో కెళితే.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించాక పక్కా గృహాల మంజూరుకు ఏ ప్రభుత్వం పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. చాలా కాలం తరువాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పక్కా గృహాలను మంజూరు చేసినట్లు ప్రకటిం చాయి. కేంద్రప్రభుత్వం ‘అందరికీ ఇల్లు’ పేరుతో పట్టణ ప్రాంతాల్లో సొంత ఇల్లు లేని పేదల కోసం జిల్లాకు 20,681 పక్కాగృహాలను మంజూరు చేసింది. ఒక యూ నిట్ విలువ రూ.4.80 లక్షలు నిర్ణయించింది. అందులో లబ్ధిదారుడు రూ.50 వేలు చెల్లించాల్సి ఉంటుంది. రూ.2 లక్షలు ప్రభుత్వం బ్యాంకు నుంచి రుణం ఇప్పిస్తుంది. రూ.1.80 లక్షలు కేంద్రం, మరో రూ.50 వేలు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ భరిస్తుంది.

ఇందులో 5,240 గృహా లను గతంలో రాజీవ్ అవాస్‌యోజన కోసం దరఖాస్తు చేసుకున్న వారికి కేటాయించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ హౌసింగ్ పథకం కింద జిల్లా మొత్తానికి 10,500 ఇల్లు మంజూరు చేసింది. అవి కూడా కేవలం 8 నియోజకవర్గాలకు మాత్రమే. ఒక్కో నియోజకవర్గానికి 1250, నెల్లూరు రూరల్‌కి కేవలం 500 మాత్రం మంజూరు చేసినట్లు అధికారులు తెలిపారు. ఒక ఇంటికి రూ.2.75 లక్షలుగా నిర్ణయించారు. అందులో రూ.1.25 లక్షలు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. మరో రూ.1.50 లక్షలను బ్యాంకు నుంచి రుణం పొందాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీలకు అయితే రూ.1.75 లక్షలు సబ్సిడీ ఇస్తుంది. మరో రూ.లక్ష బ్యాంకు ద్వారా రుణం పొందాలి.
 
 ఇచ్చిన కొన్నింటికీ పైరవీలు
 సముద్రంలో ఇంగువ కలిపినట్లు లక్షలాది మంది సొంత ఇళ్లు లేని వారు ఉంటే... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి 31,181 పక్కా గృహాలు మంజూరు చేశాయి. ఇవైనా నేరుగా లబ్ధిదారులకు చేరుతాయా? అనుకుంటే పొరబాటే. వీటినీ జన్మభూమి కమిటీల చేతుల్లో పెట్టారు. కేంద్రప్రభుత్వం మంజూరు చేసిన వాటిని బీజేపీ నేతలు గుప్పెట్లో పెట్టుకుని నిజమైన పేదలకు దక్కకుండా చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. పక్కా గృహాలు కావాలంటే ఆ నేతల ఆశీర్వాదం ఉండాలి. ఆ పార్టీ నాయకులకు కొద్దో గొప్పో సమర్పించుకోవాలి. లబ్ధిదారుడు ముందుగా ఇంటి కోసం దరఖాస్తు చేసుకోవాలంటూ డబ్బు చెల్లిస్తేనే అప్లికేషన్. ఆ తరువాత దరఖాస్తు పూర్తి చేసి ఇస్తే దానికీ కొంత మొత్తం సమర్పించుకోవాలి.


అలా ఆ నేతలను సంతృప్తి పరిస్తేగానే పక్కాగృహాల జాబితాలో చోటు దక్కడం లేదని నెల్లూరుకు చెందిన లక్ష్మీదేవి, సుభద్రమ్మ, రమణయ్య ఆందోళన వ్యక్తం చేశారు. పక్కాగృహాల కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన ఆఖరుతేది ఈనెల 14 అని అధికారులు తెలిపారు. అయితే వెబ్‌సైట్ ఇంకా ఓపెన్‌కాలేదని, గడువు పెంచుతామని అధికారులు చెబుతున్నారు. లబ్ధిదారులు దరఖాస్తు చేసుకుంటే ఆ జాబితాను టీడీపీ, బీజేపీ నేతలు ఓకే చేసి ఎంపీడీఓ కార్యాలయానికి చేర్చుతారు. చివరగా ఎంపీడీఓ ఆ జాబితాను హౌసింగ్ అధికారులకు పంపుతారు. దరఖాస్తు చేసుకునేవారు ఆధార్, రేషన్, ఓటరు కార్డు, బ్యాంకు పాసుపుస్తకం, కులధ్రువీకరణ పత్రం తప్పనిసరి అని అధికారులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement