‘రఘుపై నిర్భయ కేసు నమోదు చేయాలి’
అనంతపురం : గుమ్మఘట్ట మండలం బైరవానితిప్పకు చెందిన ఇద్దరు మహిళలను వంచించిన అధికార పార్టీ నేత సోదరుడు రఘుపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేయాలని వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు బోయ సుశీలమ్మ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమెతో పాటు రాష్ట్ర కార్యదర్శి కేఎల్ దేవి, జిల్లా ప్రధాన కార్యదర్శులు టి.కృష్ణవేణి, కె.పార్వతి, బీకేఎస్ కొండమ్మ మాట్లాడారు. రఘు ఓ బాలికతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూనే మరోవైపు తన అక్క కూతురిని వివాహం చేసుకున్నాడన్నారు. వివాహేతర సంబంధం విషయం తెలిసి మనస్థాపానికి గురైన కట్టుకున్న భార్య గతంలో ఆత్మహత్య చేసుకుందని గుర్తు చేశారు. మరోవైపు గర్భవతి అయిన బాలిక పెళ్లి చేసుకోవాలని కోరడంతో అధికారబలంతో బెదిరింపులకు పాల్పడ్డాడని ఆరోపించారు. దీంతో సదరు బాలిక కూడా ఆత్మహత్య చేసుకుందన్నారు.
తన సోదరుడు టీడీపీ నాయకుడనే ధైర్యంతోనే రఘు బరి తెగించాడని ధ్వజమెత్తారు. ఇద్దరు యువతుల జీవితాలతో చెలగాటం ఆడిన రఘును కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో అఖిలపక్ష మహిళా సంఘాలతో కలిపి ఉద్యమిస్తామని హెచ్చరించారు.