ఇసుకాసురులు
ధర్మవరం : దర్మవరం నియోజకవర్గ పరిధిలో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతోంది. అధికార పార్టీ నాయకులు తాడిమర్రి, బత్తలపల్లి, ధర్మవరం, ముదిగుబ్బ మండలాల్లోని చిత్రావతి నది పరీవాహక ప్రాంతం నుంచి రోజూ వందలాది లారీల ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు.
బెంగళూరు, బాగేపల్లి, యలహంక, అనంతపురం, హిందూపురం, ధర్మవరం తదితర ప్రాంతాల్లో విక్రయిస్తూ భారీగా ఆర్జిస్తున్నారు. అక్రమ రవాణాను అడ్డుకోవాల్సిన పోలీసులు, రెవెన్యూ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ధర్మవరం మండల పరిధిలోని సీసీ కొత్తకోట, కనంపల్లి, పోతుల నాగేపల్లి వద్ద నుంచి ఇసుకను ట్రాక్టర్లలో తరలించి.. డంప్‌లలో నిల్వ చేస్తున్నారు. అక్కడి నుంచి జేసీబీల ద్వారా లారీలకు లోడ్ చేసి బెంగళూరుకు తరలిస్తున్నారు.
ధర్మవరం మండలం కనంపల్లి- చెన్నేకొత్తపల్లి మండలం చిన్నపరెడ్డిపల్లి గ్రామాల మధ్య ఒకటి, ధర్మవరం మండలం కొత్తకోట వద్ద, చెన్నేకొత్తపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో, బసంపల్లి చెరువులో డంప్‌లు ఏర్పాటు చేసుకున్నారు. చిత్రావతి నది నుంచి డంప్ వద్దకు ఒక లారీకి సరిపడే ఇసుక (5 లోడ్‌లు) తరలించినందుకు గాను ట్రాక్టర్ బాడుగ రూ.10 వేలు చొప్పున చెల్లిస్తున్నారు. లారీ ఇసుకను బెంగళూరులో రూ.70 వేలు, బాగేపల్లిలో రూ.50 వేలు, హిందూపురంలో రూ.45 వేల చొప్పున విక్రయిస్తున్నారు.
తాడిమర్రి మండలం పెద్దకోట్ల, మోదుగులకుంట, దాడితోట గ్రామాల వద్దనున్న చిత్రావతి నది నుంచి ఇసుకను ఏకంగా టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా తరలించి మండల పరిధిలోని చిల్లావారిపల్లి సమీపంలో, దాడితోట కనంలో డంప్ చేస్తున్నారు. అక్కడి నుంచి లారీల్లో చిల్లావారిపల్లి-నార్పల మండలం గూగూడు మీదుగా పెద్దపప్పూరుకు చేర్చి.. అక్కడి నుంచి బత్తలపల్లి మీదుగా బెంగళూరుకు తరలిస్తున్నారు.
మర్రిమాకులపల్లి వద్ద నుంచి బత్తలపల్లి మండలం రామాపురం, అప్రాశ్చెరువు, ధర్మవరం మీదుగా బెంగళూరుకు తీసుకెళుతున్నారు. ముదిగుబ్బ మండలం ఉప్పలపాడు వద్ద చిత్రావతి నది నుంచి, సంకేపల్లి వద్ద జిల్లేడుబండ ఏరు నుంచి ఇసుకను తీసుకెళ్లి సమీప ప్రాంతాల్లో డంప్ చేస్తున్నారు. అక్కడి నుంచి కృష్ణాపురం క్రాస్, బుక్కపట్నం, గోరంట్ల మీదుగా జిల్లా సరిహద్దులు దాటిస్తున్నారు.
అందరికీ వాటాలు
ఇసుక దందాలో గ్రామ స్థాయిలో ఉండే వీఆర్‌ఓల నుంచి తహశీల్దార్ల వరకు, గ్రామ పోలీస్ నుంచి సీఐ దాకా ముడుపులు అందుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ విషయాన్ని అధికార పార్టీ నాయకులే బాహాటంగా చెబుతున్నారు. పేపర్లలో వార్తలు వచ్చినప్పుడు మాత్రం నామమాత్రంగా దాడులు నిర్వహిస్తూ.. జరిమానా విధిస్తున్నారు. ఆ తర్వాత యథావిధిగా దందా నడుస్తోంది.
మార్గం మధ్యలో ఉన్న అన్ని చెక్‌పోస్టులలో కూడా ప్రతిలోడుకూ మామూళ్లు ఇచ్చి సరిహద్దులను దాటిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక మొబైల్ టీం కూడా ఏర్పాటు చేసుకున్నట్లు తెలిసింది.
ఘరానా మోసం
ఇసుకను తరలించే లారీలను పట్టుకోవడం అంత తేలికైన విషయం కాదు. ఇసుకను లారీలో నింపిన తరువాత దానిపై ఒక అడుగుమేర పశువుల దాణా(తౌడు) కానీ, వరిపొట్టు కానీ వేసి టార్పాలిన్‌ను గట్టిగా బిగించి వేస్తున్నారు. ఎవరైనా తనిఖీ చేపట్టినప్పుడు పశువుల దాణా అని చెబుతూ తప్పించుకుంటున్నారు.