నిను వీడని నీడను నేను!
నంద్యాల టౌన్: నంద్యాల మున్సిపల్ కార్యాలయానికి వాస్తు దోషం నీడలా వెంటాడుతోంది. కార్యాలయానికి మూడు ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. వాస్తు దోషం పేరిట గత కమిషనర్లు ఖాదర్‌సాహెబ్, చంద్రమౌళీశ్వరరెడ్డి రెండు గేట్లను మూయించారు. అయినా ఏడాదిన్నర కాకమునుపే అధికార పార్టీ నేతలు వీరిని అవమానించి, బదిలీ చేయించారు. గత కమిషనర్ రామచంద్రారెడ్డి వాస్తు దోషాలను పట్టించుకోలేదు. అయినా ఆయన కూడా ఇదే రీతిలో బదిలీ అయ్యారు.
ప్రస్తుతం అధికార పార్టీ కౌన్సిలర్లు కౌన్సిల్‌హాల్‌ను వాస్తు ప్రకారం మార్పు చేసేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు సిద్ధం చేస్తున్నారు. గతంలో జరిగిన సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఓ టీడీపీ కౌన్సిలర్లు వాస్తు నిపుణుడితో పరిశీలన చేయించినట్లు తెలుస్తోంది. మున్సిపల్ కార్యాలయ భవనాన్ని 1986లో, మొదటి అంతస్తును 1987లో నిర్మించారు.
అప్పట్లో నిర్మించిన కౌన్సిల్ హాల్‌లో ఐదుపాలక మండళ్లు సమావేశాలను నిర్వహించాయి. కౌన్సిల్ మీట్‌లలో తరచూ వాగ్వాదం, విపక్ష సభ్యులు చైర్ పర్సన్ వద్ద బైఠాయించడం, వాకౌట్ చేయడం, విమర్శలు, ప్రతివిమర్శలు తరచూ చోటు చేసుకొనేవి. కాని కౌన్సిలర్లు ఘర్షణకుయ పాల్పడటం జరగలేదు. 2010లో ఆగస్టులో రూ.46.68 లక్షల వ్యయంతో ప్రస్తుత కార్యాలయాన్ని నిర్మించారు. తర్వాత 2011లో మొదటి అంతస్తులో నూతన కౌన్సిల్ హాల్, నిర్మాణం చాంబర్ నిర్మాణాన్ని ప్రారంభించారు.
కాని ఇప్పటికీ కాంట్రాక్టర్ నిర్మాణం వల్ల పనులు పూర్తి కాలేదు. సీలింగ్, పైకప్పు సీటు, ఫ్లోరింగ్, వాకిళ్లు, కిటికీల పనులు అసంపూర్తిగా నిలిచి పోయాయి. ఎలక్ట్రికల్ పనుల కాంట్రాక్ట్‌ను వేరే కాంట్రాక్టర్‌కు అప్పగించారు. కాని భవన నిర్మాణం పూర్తి కాకపోవడంతో ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ కూడా తన కాంట్రాక్టర్‌ను రద్దు చేయాలని మున్సిపల్ అధికారులను కోరారు. దీంతో సివిల్ కాంట్రాక్టర్ పేరును బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలని శుక్రవారం జరిగే మున్సిపల్ కౌన్సిల్ మీట్‌లో చర్చ జరగనుంది. ఈ ఏడాది మేలో ఎన్నికైన కొత్త కౌన్సిల్ పాత భవనంపై ఉన్న కౌన్సిల్ హాల్‌ను ఉపయోగించాల్సి వచ్చింది.
ఒక భవనంపై నుంచి మరో భవనంలోకి వెళ్లడం దోషమట
నూతన భవనం మొదటి అంతస్తుపై కౌన్సిల్ హాల్ నిర్మాణం పూర్తికాకపోవడంతో ఈ ఏడాది మేలో ఎంపికైన కొత్త కౌన్సిల్ పాత భవనంపై కౌన్సిల్ హాల్‌ను ఉపయోగించాల్సి వచ్చింది. నూతన భవనంలో చైర్మన్, కమిషనర్, మున్సిపల్ ఇంజనీరింగ్, మెయిన్ ఆఫీసు ఉండటంతో కౌన్సిల్ మీట్ జరిగినప్పుడు చైర్మన్, కౌన్సిలర్లు, సిబ్బంది ఈ భవనంపై నుంచి వెళ్లి , పాత భవనంపైన ఉన్న కౌన్సిల్ హాల్‌లోకి వెళ్తున్నారు.
ఈ ప్రవేశ ముఖద్వారం వద్ద వాస్తు దోషం ఉన్నట్లు నిపుణుడు చెప్పిట్లు సమాచారం. ఇలా వెళ్లడం దోషమని, తక్షణమే మార్పు చేసుకోక తప్పదని చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో అధికారపార్టీ కౌన్సిలర్ ప్రత్యామ్నాయల గురించి యోచించినట్లు తెలిసింది. నూతన భవనంపై కౌన్సిల్ హాల్ నిర్మాణం పూర్తయ్యే వరకు జాప్యం జరిగే అవకాశం ఉంది. దీంతో పాత భవనంలో నుంచే కౌన్సిల్ హాల్‌లోకి వెళ్లాలని, ఇలాగైతే వాస్తు దోషం ఉండేదని భావిస్తున్నట్లు సమాచారం.