Architectural error
-
కూల్చివేత తెలివిలేని నిర్ణయం: ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: పటిష్టంగా ఉన్న సచివాలయాన్ని వాస్తు పేరుతో కూల్చాలన్న నిర్ణయాన్ని మార్చుకోవాలని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సూచించారు. తెలివిలేని, సహేతుకం కాని ఈ నిర్ణయాన్ని మార్చుకోవాలని కోరుతూ ముఖ్యమంత్రికి గురువారం బహిరంగ లేఖ రాశారు. పటిష్టంగా ఉన్న సచివాలయాన్ని పేద ప్రజల కష్టార్జితాన్ని, పన్నుల రూపేణా ప్రజల నుంచి వసూలు చేసిన సొమ్మును దుర్వినియోగం చేయొద్దని కోరారు. 1998, 2003, 2008లలో నిర్మించిన పలు బ్లాకులు చాలా పటిష్టంగా, ధృడంగా ఉన్నాయని, కేవలం వాస్తు లోపం సాకుతో భవనాలను కూల్చడం మంచిదికాదని సూచించారు. గతంలో ముఖ్యమంత్రులుగా ఎన్టీఆర్, చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి, మంత్రులంతా భద్రత లేకుండానే పనిచేశారా అని ప్రశ్నించారు. జడ్‌ప్లస్ భద్రత ఉన్న వీరు ఫైర్ సేఫ్టీ జాగ్రత్తలు తీసుకోలేదా అని ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు. హైకోర్టు లేవనెత్తిన ప్రశ్నలకు, అనుమానాలకు ప్రభుత్వం సరైన సమాధానం ఇవ్వాలన్నారు. ఏపీ సచివాలయాన్ని అమరావతికి తరలిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వానికి అవసరమైన దానికన్నా ఎక్కువ స్థలం ఉంటుందన్నారు. సచివాలయం కూల్చివేతను ప్రతిపక్ష పార్టీలు, మేధావులు, నిపుణులు వ్యతిరేకిస్తున్నారని పేర్కొన్నారు. -
నిను వీడని నీడను నేను!
నంద్యాల టౌన్: నంద్యాల మున్సిపల్ కార్యాలయానికి వాస్తు దోషం నీడలా వెంటాడుతోంది. కార్యాలయానికి మూడు ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. వాస్తు దోషం పేరిట గత కమిషనర్లు ఖాదర్‌సాహెబ్, చంద్రమౌళీశ్వరరెడ్డి రెండు గేట్లను మూయించారు. అయినా ఏడాదిన్నర కాకమునుపే అధికార పార్టీ నేతలు వీరిని అవమానించి, బదిలీ చేయించారు. గత కమిషనర్ రామచంద్రారెడ్డి వాస్తు దోషాలను పట్టించుకోలేదు. అయినా ఆయన కూడా ఇదే రీతిలో బదిలీ అయ్యారు. ప్రస్తుతం అధికార పార్టీ కౌన్సిలర్లు కౌన్సిల్‌హాల్‌ను వాస్తు ప్రకారం మార్పు చేసేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు సిద్ధం చేస్తున్నారు. గతంలో జరిగిన సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఓ టీడీపీ కౌన్సిలర్లు వాస్తు నిపుణుడితో పరిశీలన చేయించినట్లు తెలుస్తోంది. మున్సిపల్ కార్యాలయ భవనాన్ని 1986లో, మొదటి అంతస్తును 1987లో నిర్మించారు. అప్పట్లో నిర్మించిన కౌన్సిల్ హాల్లో ఐదుపాలక మండళ్లు సమావేశాలను నిర్వహించాయి. కౌన్సిల్ మీట్లలో తరచూ వాగ్వాదం, విపక్ష సభ్యులు చైర్ పర్సన్ వద్ద బైఠాయించడం, వాకౌట్ చేయడం, విమర్శలు, ప్రతివిమర్శలు తరచూ చోటు చేసుకొనేవి. కాని కౌన్సిలర్లు ఘర్షణకుయ పాల్పడటం జరగలేదు. 2010లో ఆగస్టులో రూ.46.68 లక్షల వ్యయంతో ప్రస్తుత కార్యాలయాన్ని నిర్మించారు. తర్వాత 2011లో మొదటి అంతస్తులో నూతన కౌన్సిల్ హాల్, నిర్మాణం చాంబర్ నిర్మాణాన్ని ప్రారంభించారు. కాని ఇప్పటికీ కాంట్రాక్టర్ నిర్మాణం వల్ల పనులు పూర్తి కాలేదు. సీలింగ్, పైకప్పు సీటు, ఫ్లోరింగ్, వాకిళ్లు, కిటికీల పనులు అసంపూర్తిగా నిలిచి పోయాయి. ఎలక్ట్రికల్ పనుల కాంట్రాక్ట్‌ను వేరే కాంట్రాక్టర్‌కు అప్పగించారు. కాని భవన నిర్మాణం పూర్తి కాకపోవడంతో ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ కూడా తన కాంట్రాక్టర్‌ను రద్దు చేయాలని మున్సిపల్ అధికారులను కోరారు. దీంతో సివిల్ కాంట్రాక్టర్ పేరును బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలని శుక్రవారం జరిగే మున్సిపల్ కౌన్సిల్ మీట్లో చర్చ జరగనుంది. ఈ ఏడాది మేలో ఎన్నికైన కొత్త కౌన్సిల్ పాత భవనంపై ఉన్న కౌన్సిల్ హాల్‌ను ఉపయోగించాల్సి వచ్చింది. ఒక భవనంపై నుంచి మరో భవనంలోకి వెళ్లడం దోషమట నూతన భవనం మొదటి అంతస్తుపై కౌన్సిల్ హాల్ నిర్మాణం పూర్తికాకపోవడంతో ఈ ఏడాది మేలో ఎంపికైన కొత్త కౌన్సిల్ పాత భవనంపై కౌన్సిల్ హాల్‌ను ఉపయోగించాల్సి వచ్చింది. నూతన భవనంలో చైర్మన్, కమిషనర్, మున్సిపల్ ఇంజనీరింగ్, మెయిన్ ఆఫీసు ఉండటంతో కౌన్సిల్ మీట్ జరిగినప్పుడు చైర్మన్, కౌన్సిలర్లు, సిబ్బంది ఈ భవనంపై నుంచి వెళ్లి , పాత భవనంపైన ఉన్న కౌన్సిల్ హాల్లోకి వెళ్తున్నారు. ఈ ప్రవేశ ముఖద్వారం వద్ద వాస్తు దోషం ఉన్నట్లు నిపుణుడు చెప్పిట్లు సమాచారం. ఇలా వెళ్లడం దోషమని, తక్షణమే మార్పు చేసుకోక తప్పదని చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో అధికారపార్టీ కౌన్సిలర్ ప్రత్యామ్నాయల గురించి యోచించినట్లు తెలిసింది. నూతన భవనంపై కౌన్సిల్ హాల్ నిర్మాణం పూర్తయ్యే వరకు జాప్యం జరిగే అవకాశం ఉంది. దీంతో పాత భవనంలో నుంచే కౌన్సిల్ హాల్లోకి వెళ్లాలని, ఇలాగైతే వాస్తు దోషం ఉండేదని భావిస్తున్నట్లు సమాచారం. -
సచివాలయానికి వాస్తు దోషం!
దక్షిణంవైపు గోడ నిర్మించాలని సీఎం కేసీఆర్ ఆదేశం హైదరాబాద్: తెలంగాణ సచివాలయానికి వాస్తుదోషం ఉందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు భావిస్తున్నారు. ఇటీవల వాస్తు పండితులు సెక్రటేరియెట్‌ను సందర్శించిన సమయంలో.. సచివాలయానికి దక్షిణం వైపు ఉన్న ప్రాంతం మొత్తం మూసేయాలని సూచించినట్లు సమాచారం. దీంతో భారీ ఐరన్ గ్రిల్స్ ఉన్నచోటును మొత్తం ప్లాస్టిక్ షీట్స్‌తో పూర్తిగా మూసేయాలని ఇటీవల ఛత్తీస్‌గఢ్ వెళ్లే ముందు అధికారులకు సూచించారు. ఛత్తీస్‌గఢ్ నుంచి తిరిగి వచ్చేసరికి ఈ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. సచివాలయ అధికారులు ఆగమేఘాల మీద ఆ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. తాజాగా ఆ గ్రిల్స్, కొత్తగా ఏర్పాటు చేసిన షీట్స్ కూడా తొలగించి ప్రహరీ నిర్మించాలని ఆదేశించినట్లు అధికార వర్గాలు వివరించాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని మంచి కార్యక్రమాలు చేపడుతున్నా.. ఆశించిన స్థాయిలో పేరురాకపోగా విమర్శలు అధికమవుతున్నాయని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారని తెలిసింది. అందుకు రాష్ట్ర పరిపాలన ప్రధాన కేంద్రంలో వాస్తు దోషాలు ఉన్నట్లు వాస్తు నిపుణులు తేల్చడంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ముఖ్యమంత్రి క్యాంపు నివాసం ముందున్న అధికారిక భవనాన్ని కూడా వాస్తు దోషం కారణంగా సీఎం వినియోగించుకోని విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి తన వాహన శ్రేణిని కూడా నల్ల రంగు నుంచి తెలుపు రంగుగా మార్చుకోవడం గమనార్హం. సచివాలయం వరకు బస్సులు తెలంగాణ సచివాలయ ఉద్యోగులు ఆర్టీసీ బస్సుల ద్వారా నేరుగా ఉత్తరం వైపున్న ప్రధాన గేటు వరకు వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు ఆర్టీసీకి, నగర ట్రాఫిక్ అదనపు సీపీకి సచివాలయ వర్గాలు లేఖ రాశాయి. వర్షాకాలం, వేసవిలో ఉద్యోగులకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు షెల్టర్లు కూడా నిర్మించనున్నారు.