కూల్చివేత తెలివిలేని నిర్ణయం: ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: పటిష్టంగా ఉన్న సచివాలయాన్ని వాస్తు పేరుతో కూల్చాలన్న నిర్ణయాన్ని మార్చుకోవాలని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సూచించారు. తెలివిలేని, సహేతుకం కాని ఈ నిర్ణయాన్ని మార్చుకోవాలని కోరుతూ ముఖ్యమంత్రికి గురువారం బహిరంగ లేఖ రాశారు. పటిష్టంగా ఉన్న సచివాలయాన్ని పేద ప్రజల కష్టార్జితాన్ని, పన్నుల రూపేణా ప్రజల నుంచి వసూలు చేసిన సొమ్మును దుర్వినియోగం చేయొద్దని కోరారు. 1998, 2003, 2008లలో నిర్మించిన పలు బ్లాకులు చాలా పటిష్టంగా, ధృడంగా ఉన్నాయని, కేవలం వాస్తు లోపం సాకుతో భవనాలను కూల్చడం మంచిదికాదని సూచించారు.
గతంలో ముఖ్యమంత్రులుగా ఎన్టీఆర్, చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి, మంత్రులంతా భద్రత లేకుండానే పనిచేశారా అని ప్రశ్నించారు. జడ్‌ప్లస్ భద్రత ఉన్న వీరు ఫైర్ సేఫ్టీ జాగ్రత్తలు తీసుకోలేదా అని ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు. హైకోర్టు లేవనెత్తిన ప్రశ్నలకు, అనుమానాలకు ప్రభుత్వం సరైన సమాధానం ఇవ్వాలన్నారు. ఏపీ సచివాలయాన్ని అమరావతికి తరలిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వానికి అవసరమైన దానికన్నా ఎక్కువ స్థలం ఉంటుందన్నారు. సచివాలయం కూల్చివేతను ప్రతిపక్ష పార్టీలు, మేధావులు, నిపుణులు వ్యతిరేకిస్తున్నారని పేర్కొన్నారు.