సచివాలయానికి వాస్తు దోషం!
దక్షిణంవైపు గోడ నిర్మించాలని సీఎం కేసీఆర్ ఆదేశం
హైదరాబాద్: తెలంగాణ సచివాలయానికి వాస్తుదోషం ఉందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు భావిస్తున్నారు. ఇటీవల వాస్తు పండితులు సెక్రటేరియెట్‌ను సందర్శించిన సమయంలో.. సచివాలయానికి దక్షిణం వైపు ఉన్న ప్రాంతం మొత్తం మూసేయాలని సూచించినట్లు సమాచారం. దీంతో భారీ ఐరన్ గ్రిల్స్ ఉన్నచోటును మొత్తం ప్లాస్టిక్ షీట్స్‌తో పూర్తిగా మూసేయాలని ఇటీవల ఛత్తీస్‌గఢ్ వెళ్లే ముందు అధికారులకు సూచించారు. ఛత్తీస్‌గఢ్ నుంచి తిరిగి వచ్చేసరికి ఈ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. సచివాలయ అధికారులు ఆగమేఘాల మీద ఆ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. తాజాగా ఆ గ్రిల్స్, కొత్తగా ఏర్పాటు చేసిన షీట్స్ కూడా తొలగించి ప్రహరీ నిర్మించాలని ఆదేశించినట్లు అధికార వర్గాలు వివరించాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని మంచి కార్యక్రమాలు చేపడుతున్నా.. ఆశించిన స్థాయిలో పేరురాకపోగా విమర్శలు అధికమవుతున్నాయని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారని తెలిసింది. అందుకు రాష్ట్ర పరిపాలన ప్రధాన కేంద్రంలో వాస్తు దోషాలు ఉన్నట్లు వాస్తు నిపుణులు తేల్చడంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ముఖ్యమంత్రి క్యాంపు నివాసం ముందున్న అధికారిక భవనాన్ని కూడా వాస్తు దోషం కారణంగా సీఎం వినియోగించుకోని విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి తన వాహన శ్రేణిని కూడా నల్ల రంగు నుంచి తెలుపు రంగుగా మార్చుకోవడం గమనార్హం.
సచివాలయం వరకు బస్సులు
తెలంగాణ సచివాలయ ఉద్యోగులు ఆర్టీసీ బస్సుల ద్వారా నేరుగా ఉత్తరం వైపున్న ప్రధాన గేటు వరకు వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు ఆర్టీసీకి, నగర ట్రాఫిక్ అదనపు సీపీకి సచివాలయ వర్గాలు లేఖ రాశాయి. వర్షాకాలం, వేసవిలో ఉద్యోగులకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు షెల్టర్లు కూడా నిర్మించనున్నారు.