Nandyal municipal office
-
అవినీతి ‘విక్రమార్కుడు’
సాక్షి, బొమ్మలసత్రం: నంద్యాల మున్సిపల్ కార్యాలయంలో ఓ అవినీతి విక్రమార్కుడి దందాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. చిన్న పామును పెద్ద కర్రతో కొట్టాలన్న చందంగా చిన్న పనికి కూడా పెద్ద మొత్తాన్ని డిమాండ్ చేయడం ఆ ఉద్యోగి స్టైల్. స్థానిక ఎమ్మెల్యే పేరు చెప్పి ఉన్నతాధికారులను సైతం తన గుప్పెట్లో ఉంచుకున్నాడు. మాట వింటే వాటా ఇస్తాడు. వినకపోతే వార్నింగ్ ఇస్తాడు. కార్యాలయంలో వాహనాలను సైతం బినామీ పేర్లతో పెట్టుకున్నాడు. కొంత కాలంగా రెవన్యూ విభాగంలో పనిచేస్తున్న ఆ ఉద్యోగి తక్కువ సమయంలోనే లక్షలు గడించాడనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. స్థలం విలువ బట్టి మామాలు పట్టణంలో ఖాళీ స్థలాలు కొనుగోలు చేసిన యజమానులు స్థలానికి సంబంధించిన పన్ను వారి పేరు మీదకు మార్చుకోవాల్సి ఉంటుంది. అయితే అలా మార్చాలంటే ఆ ఉద్యోగి అడిగినంత ముట్టజెప్పాల్సిందే. స్థలం విలువను బట్టి మామూలు ఎంత ఇచ్చుకోవాలో నిర్ధారిస్తాడు. ఉద్యోగి అడిగినంత అప్పజెప్తే వెంటనే స్థలయజమానికి పన్ను రాసి ఇస్తాడు. ఈ నేపథ్యంలో నూతనంగా ఓ ఇళ్లు కొనుగోలు చేసిన ఓ వ్యక్తి ఆ ఉద్యోగిని పన్ను మార్పు కోసం సంప్రదిస్తే.. తాను అడిగినంత ఇస్తే పన్ను తగ్గించి రాస్తానని చెప్పినట్లు సమాచారం. ఇలా ఇతని ఆగడాలతో మున్సిపాలిటీకి భారీగా నష్టం వాటిల్లుతోంది. టీడీపీ నేతలకు పన్ను చెల్లింపుల్లో వెసులుబాటు... టీడీపీ నేతలకు చెందిన బిల్డింగ్‌లకు సంబంధించి పన్ను బకాయిలు రూ.లక్షల్లో ఉన్నా అధికారులు వారిపై చర్యలు తీసుకోకుండా అడ్డుకుంటున్నట్లు సమాచారం. గత నాలుగేళ్లగా కొందరు టీడీపీ నేతలు పన్నులు చెల్లించకుండా ఉన్నారు. వారి వద్దకు వెళ్లి బకాయిలు చెల్లించాలని వత్తిడి చేయకుండా చూస్తున్నట్లు తెలుస్తోంది. అద్దె వాహనాలూ అతనివే... స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఉన్నతాధికారుల అద్దె వాహనాలను సదరు ఉద్యోగి బినామి పేర్లతో ఉంచి సొమ్ము చేసుకుంటున్నట్లు సమాచారం. టీడీపీ నేతల అండదండలు ఉండటంతో ఉన్నతాధికారులను కూడా లెక్కచేయకుండా దందా కొనసాగిస్తున్నట్లు తెలిసింది. ఒక్కో వాహనానికి నెలకు దాదపు రూ.35 వేలు సంపాదించటమే కాక, ఉద్యోగ విధుల్లో అవినీతికి పాల్పడుతూ రూ.లక్షలు గడిస్తున్నా ఉన్నతాధికారులు మాత్రం అతడిపై ఎటువంటి చర్యలు చేపట్టక పోవటం విమర్శలకు దారి తీస్తోంది. -
తనిఖీల పేరుతో మంత్రి అఖిలప్రియ హల్చల్
సాక్షి, నంద్యాల: కర్నూలు జిల్లా నంద్యాల మున్సిపల్ కార్యాలయంలో మంత్రి అఖిలప్రియ హల్చల్ చేశారు. మున్సిపల్ చైర్‌పర్సన్‌కు మాట మాత్రమైనా చెప్పకుండా ఆమె లేని సమయంలో ఛాంబర్లోకి వెళ్లి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళవారం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ పుల్లారెడ్డి ఆధ్వర్యంలో మంత్రి భూమా అఖిలప్రియ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. తాము చెప్పిన వాళ్లకే పనులు చేయాలని ఉద్యోగులకు హుకుం జారీ చేశారు. హౌసింగ్ విభాగంలోకి వెళ్లి.. ‘మీపై చాలా ఆరోపణలు ఉన్నాయి. మిమ్మల్ని ఉద్యోగంలోకి తీసుకున్నది ఎవరు? జాగ్రత్తగా పని చేయకపోతే మిమ్మల్ని ఎవరూ కాపాడలేరం’టూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చైర్పర్సన్ చాంబర్లో హల్చల్ కార్యాలయంలో ఉద్యోగులపై మండిపడిన మంత్రి ఇంతటితో ఆగకుండా చైర్పర్సన్ లేని సమయంలో ఆమె చాంబర్లోకి వెళ్లడం విమర్శలకు తావిచ్చింది. చాంబర్లోకి వెళ్లీ వెళ్లడంతోనే ‘ఈమెకు (చైర్‌పర్సన్‌కు) ఇంత చాంబర్ అవసరమా?! గవర్నమెంట్ అధికారులకు కూడా ఇన్ని సౌకర్యాలు లేవు. ఇక్కడ ఇన్ని కుర్చీలు అవసరమా? ఆఫీసంతా సీసీ కెమెరాలున్నాయి. సీసీ కెమెరాల మానిటరింగ్ చైర్పర్సన్ చాంబర్లో ఎలా పెడతారు? ఆమె ఇక్కడ కూర్చొని కార్యాలయంలోకి ఎవరెవరు వస్తున్నారు.. ఏ విభాగంలో ఏం పనులు జరుగుతున్నాయి.. అని మానిటరింగ్ చేస్తోందా? వెంటనే వీటిని తొలగించండి’ అంటూ అధికారులను ఆదేశించారు. మంత్రి వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి ప్రజలు ఎన్నుకుంటే తాను మున్సిపల్ చైర్పర్సన్ అయ్యానని, వారికి ఏయే పనులు చేయాలో చూసుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని దేశం నంద్యాల మునిసిపల్ చైర్పర్సన్ సులోచన స్పష్టం చేశారు. మంత్రి మున్సిపల్ కార్యాలయానికి వచ్చినప్పుడు తనకు సమాచారం కూడా ఇవ్వకపోవడం ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు. తాను లేనప్పుడు చాంబర్లోకి వెళ్లి పరిశీలించే హక్కు మంత్రికి ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. తన చాంబర్లో సీసీ కెమెరాల మానిటరింగ్ లేదని, మంత్రి ఈ విషయం తెలుసుకోకుండా అసత్య ప్రచారాలు చేయడం మంచిది కాదని హితవు పలికారు. -
టీడీపీ నేతల వేధింపులు ఆపాలి
నంద్యాల మున్సిపల్ కార్యాలయం ఎదుట అంగన్వాడీల ధర్నా నూనెపల్లె (నంద్యాల): తమపై టీడీపీ నేతల వేధింపులు ఆపాలని అంగన్వాడీ కార్యకర్తలు నిరసనకు దిగారు. శనివారం ఏపీ అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నంద్యాల మున్సిపల్ కార్యాలయం వద్ద వారు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ నంద్యాల డివిజన్ అధ్యక్షుడు కేఎండీ గౌస్ మాట్లాడుతూ.. గోస్పాడు మండలం శ్రీరామ్‌నగర్‌కు చెందిన అంగన్వాడీ కార్యకర్త చెన్నమ్మపై అధికారపార్టీ నేతల వేధింపులు అధికమయ్యాయని చెప్పారు. ఆమె బంధువులు వేరే పార్టీలో ఉన్నారన్న నెపంతో టీడీపీ నాయకులు బెదిరింపులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. అధికార పార్టీకి మద్దతిస్తావా? లేదా ఉద్యోగం తొలగించమంటావా? అంటూ బెదిరిస్తున్నారని చెప్పారు. రాజకీయ వేధింపులు ఆపకపోతే యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు నిర్మలమ్మ, నాయకురాళ్లు నిర్మల, సారమ్మ, హన్నమ్మ, శాంత కుమారి, రమణమ్మ, అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు. -
నిను వీడని నీడను నేను!
నంద్యాల టౌన్: నంద్యాల మున్సిపల్ కార్యాలయానికి వాస్తు దోషం నీడలా వెంటాడుతోంది. కార్యాలయానికి మూడు ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. వాస్తు దోషం పేరిట గత కమిషనర్లు ఖాదర్‌సాహెబ్, చంద్రమౌళీశ్వరరెడ్డి రెండు గేట్లను మూయించారు. అయినా ఏడాదిన్నర కాకమునుపే అధికార పార్టీ నేతలు వీరిని అవమానించి, బదిలీ చేయించారు. గత కమిషనర్ రామచంద్రారెడ్డి వాస్తు దోషాలను పట్టించుకోలేదు. అయినా ఆయన కూడా ఇదే రీతిలో బదిలీ అయ్యారు. ప్రస్తుతం అధికార పార్టీ కౌన్సిలర్లు కౌన్సిల్‌హాల్‌ను వాస్తు ప్రకారం మార్పు చేసేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు సిద్ధం చేస్తున్నారు. గతంలో జరిగిన సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఓ టీడీపీ కౌన్సిలర్లు వాస్తు నిపుణుడితో పరిశీలన చేయించినట్లు తెలుస్తోంది. మున్సిపల్ కార్యాలయ భవనాన్ని 1986లో, మొదటి అంతస్తును 1987లో నిర్మించారు. అప్పట్లో నిర్మించిన కౌన్సిల్ హాల్లో ఐదుపాలక మండళ్లు సమావేశాలను నిర్వహించాయి. కౌన్సిల్ మీట్లలో తరచూ వాగ్వాదం, విపక్ష సభ్యులు చైర్ పర్సన్ వద్ద బైఠాయించడం, వాకౌట్ చేయడం, విమర్శలు, ప్రతివిమర్శలు తరచూ చోటు చేసుకొనేవి. కాని కౌన్సిలర్లు ఘర్షణకుయ పాల్పడటం జరగలేదు. 2010లో ఆగస్టులో రూ.46.68 లక్షల వ్యయంతో ప్రస్తుత కార్యాలయాన్ని నిర్మించారు. తర్వాత 2011లో మొదటి అంతస్తులో నూతన కౌన్సిల్ హాల్, నిర్మాణం చాంబర్ నిర్మాణాన్ని ప్రారంభించారు. కాని ఇప్పటికీ కాంట్రాక్టర్ నిర్మాణం వల్ల పనులు పూర్తి కాలేదు. సీలింగ్, పైకప్పు సీటు, ఫ్లోరింగ్, వాకిళ్లు, కిటికీల పనులు అసంపూర్తిగా నిలిచి పోయాయి. ఎలక్ట్రికల్ పనుల కాంట్రాక్ట్‌ను వేరే కాంట్రాక్టర్‌కు అప్పగించారు. కాని భవన నిర్మాణం పూర్తి కాకపోవడంతో ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ కూడా తన కాంట్రాక్టర్‌ను రద్దు చేయాలని మున్సిపల్ అధికారులను కోరారు. దీంతో సివిల్ కాంట్రాక్టర్ పేరును బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలని శుక్రవారం జరిగే మున్సిపల్ కౌన్సిల్ మీట్లో చర్చ జరగనుంది. ఈ ఏడాది మేలో ఎన్నికైన కొత్త కౌన్సిల్ పాత భవనంపై ఉన్న కౌన్సిల్ హాల్‌ను ఉపయోగించాల్సి వచ్చింది. ఒక భవనంపై నుంచి మరో భవనంలోకి వెళ్లడం దోషమట నూతన భవనం మొదటి అంతస్తుపై కౌన్సిల్ హాల్ నిర్మాణం పూర్తికాకపోవడంతో ఈ ఏడాది మేలో ఎంపికైన కొత్త కౌన్సిల్ పాత భవనంపై కౌన్సిల్ హాల్‌ను ఉపయోగించాల్సి వచ్చింది. నూతన భవనంలో చైర్మన్, కమిషనర్, మున్సిపల్ ఇంజనీరింగ్, మెయిన్ ఆఫీసు ఉండటంతో కౌన్సిల్ మీట్ జరిగినప్పుడు చైర్మన్, కౌన్సిలర్లు, సిబ్బంది ఈ భవనంపై నుంచి వెళ్లి , పాత భవనంపైన ఉన్న కౌన్సిల్ హాల్లోకి వెళ్తున్నారు. ఈ ప్రవేశ ముఖద్వారం వద్ద వాస్తు దోషం ఉన్నట్లు నిపుణుడు చెప్పిట్లు సమాచారం. ఇలా వెళ్లడం దోషమని, తక్షణమే మార్పు చేసుకోక తప్పదని చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో అధికారపార్టీ కౌన్సిలర్ ప్రత్యామ్నాయల గురించి యోచించినట్లు తెలిసింది. నూతన భవనంపై కౌన్సిల్ హాల్ నిర్మాణం పూర్తయ్యే వరకు జాప్యం జరిగే అవకాశం ఉంది. దీంతో పాత భవనంలో నుంచే కౌన్సిల్ హాల్లోకి వెళ్లాలని, ఇలాగైతే వాస్తు దోషం ఉండేదని భావిస్తున్నట్లు సమాచారం.