టీడీపీ నేతల వేధింపులు ఆపాలి
నంద్యాల మున్సిపల్ కార్యాలయం ఎదుట అంగన్‌వాడీల ధర్నా
నూనెపల్లె (నంద్యాల): తమపై టీడీపీ నేతల వేధింపులు ఆపాలని అంగన్‌వాడీ కార్యకర్తలు నిరసనకు దిగారు. శనివారం ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నంద్యాల మున్సిపల్ కార్యాలయం వద్ద వారు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ నంద్యాల డివిజన్ అధ్యక్షుడు కేఎండీ గౌస్ మాట్లాడుతూ.. గోస్పాడు మండలం శ్రీరామ్‌నగర్‌కు చెందిన అంగన్‌వాడీ కార్యకర్త చెన్నమ్మపై అధికారపార్టీ నేతల వేధింపులు అధికమయ్యాయని చెప్పారు. ఆమె బంధువులు వేరే పార్టీలో ఉన్నారన్న నెపంతో టీడీపీ నాయకులు బెదిరింపులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు.
అధికార పార్టీకి మద్దతిస్తావా? లేదా ఉద్యోగం తొలగించమంటావా? అంటూ బెదిరిస్తున్నారని చెప్పారు. రాజకీయ వేధింపులు ఆపకపోతే యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు నిర్మలమ్మ, నాయకురాళ్లు నిర్మల, సారమ్మ, హన్నమ్మ, శాంత కుమారి, రమణమ్మ, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు.