ఏమైనా చేస్తాం.. | Designed the electoral list as ruling party leader | Sakshi
Sakshi News home page

ఏమైనా చేస్తాం..

Published Mon, Feb 17 2014 1:43 AM | Last Updated on Wed, Apr 3 2019 5:52 PM

Designed the electoral list as ruling party leader

 కందుకూరు రూరల్, న్యూస్‌లైన్:  అధికారం చేతుల్లో ఉంది కదా అని అధికార పార్టీ నాయకులు పేట్రేగిపోతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్నవేళ తమ నేతల కనుసన్నల్లో నడుస్తూ రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడుస్తున్నారు. ఓట్ల మార్పులు.. చేర్పుల ప్రక్రియలో అర్హులకు అన్యాయం చేస్తూ.. అనర్హులను మాత్రం అందలం ఎక్కిస్తున్నారు. మండల పరిధిలోని శ్రీరంగరాజపురంలో అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడికి బీఎల్‌ఓతో పాటు రెవెన్యూ అధికారుల అండదండలు సమృద్ధిగా లభించాయి. ఇంకేముందీ అర్హుల ఓట్లను తొలగించి.. పెద్ద ఎత్తున అనర్హుల పేర్లు ఓటరు లిస్టులో వచ్చేలా చేశాడు.

 61 బోగస్ ఓట్లు..
 గ్రామంలో ఉన్నట్లు ఎలాంటి గుర్తింపులేని వారి పేర్లు భారీగా జాబితాలో చేరాయంటే అతని ప్రభావం ఏమేరకు ఉందో అర్థం చేసుకోవచ్చు. జరుగుమల్లి వద్ద జయవరానికి చెందిన క్రాంతికుమార్, సుభాషిణి, లేళ్లపల్లి క్రాంతికుమార్ పేర్లు ఓటర్ల జాబితాలో నమోదు చేశారు. అలాగే కరేడుకు చెందిన గోపిరెడ్డి శింగారెడ్డి, పిచ్చిరెడ్డి, శేషమ్మ.. కొన్నేళ్లుగా శ్రీశైలంలో ఉంటున్న శివరాత్రి శ్రీనివాసులు, రాజ్యలక్ష్మి, కందుకూరులో నివాసం ఉంటున్న మల్లెల రుక్మిణమ్మ, పోలమ్మ, టి.వజ్రమ్మ, పొన్నలూరు మండలం శింగరబొట్లపాలెంలో ఉంటున్న దన్యాసి త్రివేణిలు.. ఇంకా ఉలవపాడు, చాకిచర్ల, చినపవని, సింగరాయకొండల్లో స్థిర నివాసం ఉంటున్న వారి పేర్లు కలుపుకొని మొత్తం 61 బోగస్ ఓట్లు జాబితాలో చేర్చారు. వీరంతా అధికార  పార్టీకి చెందినవారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

 నచ్చకపోతే అంతే..
 వాస్తవానికి గ్రామానికి చెందిన యువతులకు పెళ్లి అయితే వారి పేర్లు తొలగించాల్సి ఉంటుంది. కానీ బీఎల్‌ఓ దాని గురించి పట్టించుకోలేదు. అలాగే మరణించిన వారు, ఇంతకు ముందు ఓటరు జాబితాలో బోగస్ ఓట్లుగా ఉన్న వారి పేర్లను కూడా తొలగించాల్సి ఉన్నా.. బీఎల్‌ఓ ఎలాంటి విచారణ చేపట్టలేదు. అయితే అధికార పార్టీ నాయకులు పెద్దమొత్తంలో దరఖాస్తు చేసుకంటే వాటిని పరిశీలించకుండానే ఓటర్ల జాబితాలో చేర్చారు. ఓట్లు తొలగించాలని ఫారం-7 ద్వారా దరఖాస్తు చేస్తేనే పరిశీలించి తొలగించాల్సి ఉంటుంది.

 కానీ ఇక్కడ మాత్రం గత పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీకి వ్యతిరేకంగా ఏజెంట్లుగా నిలబడిన వారిపేర్లు, నాయకత్వం వహించిన వారి కుటుంబాల్లోని పేర్లు, అధికార పార్టీకి వ్యతిరేకంగా ఓట్లు వేసిన వారి పేర్లను తొలగించారు. ఇలా మొత్తం 46 మంది అర్హులకు జాబితాలో చోటు లేకుండా చేశారు. అదే సమయంలో కొత్తగా దరఖాస్తు చేసుకున్న 50 మంది పేర్లను బుట్టదాఖలు చేశారు. మొత్తం మీద బీఎల్‌ఓ వ్యవహార శైలిపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement