పథకం ప్రకారం విపక్షం ఓట్ల తొలగింపు.. | Bogus survey teams across the state | Sakshi
Sakshi News home page

ఓట్ల దొంగలొచ్చారు!

Published Sat, Jan 26 2019 4:57 AM | Last Updated on Wed, Apr 3 2019 5:52 PM

Bogus survey teams across the state - Sakshi

కొత్తచెరువులో సర్వేకు వచ్చిన యువకులను విచారిస్తున్న పోలీసులు(ఫైల్‌)

రాష్ట్రవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీ సానుభూతిపరుల ఓట్లను తొలగించేందుకు అధికార పక్షం కుయుక్తులు పన్నుతున్నట్లు స్పష్టమవుతోంది. ప్రభుత్వ పాలన ఎలా ఉందో వివరాలు సేకరిస్తున్నామంటూ ట్యాబ్‌లతో రకరకాల పేర్లతో పలుచోట్ల సర్వేలు నిర్వహిస్తున్న బృందాల సభ్యుల వద్ద టీడీపీ సభ్యత్వ గుర్తింపు కార్డులు బయటపడుతుండటం దీనికి బలం చేకూరుస్తోంది. బోగస్‌ బృందాలు గ్రామాల్లో తిరుగుతూ దశలవారీగా వివరాలు సేకరించి ఆధార్, ఓటరుకార్డు సంఖ్యలను ట్యాబ్‌ల్లో నమోదు చేస్తూ టీడీపీ సర్కారుకు సానుకూలం కాదని తేలిన పక్షంలో సర్వేలో పాల్గొంటున్న వారి ఓట్లను వెంటనే తొలగిస్తుండటం గమనార్హం. ట్యాబ్‌లో డిలీట్‌ బటన్‌ నొక్కగానే ఓటర్ల వివరాలు జాబితా నుంచి మాయమవుతున్నాయి. ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన ఓటు హక్కును తొలగించే అధికారం ఈ నకిలీ సర్వే బృందాలకు ఎలా వచ్చిందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

కేవలం ఎమ్మార్వో స్థాయి అధికారికి మాత్రమే ఉండే అధికారాలను ట్యాబ్‌లతో తిరిగే టీడీపీ అనుకూల బృందాలకు అప్పగించడం ప్రజాస్వామ్య వ్యవస్థను రాష్ట్ర సర్కారు ఎలా అపహాస్యం పాలు చేస్తోందో రుజువు చేస్తోందని పరిశీలకులు పేర్కొంటున్నారు. వైఎస్సార్‌ సీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించేందుకు సర్వేల పేరుతో అధికార పార్టీ నకిలీ  బృందాలను రంగంలోకి దించినట్లు ఈ వ్యవహారాల ద్వారా స్పష్టమవుతోంది. ‘మీకు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా? ఎవరంటే ఇష్టం? ఏ పార్టీకి ఓటు వేస్తారు? సాక్షి టీవీ చూస్తారా? ఈటీవీ చూస్తారా?’ అంటూ సర్వే బృందాలు ప్రజల నాడి పసిగట్టి ప్రభావితం చేసేందుకు వివరాలు సేకరిస్తున్నాయి. దీనిపై వైఎస్సార్‌సీపీ శ్రేణులతోపాటు, ప్రజలు తిరగబడుతున్నారు. కొన్నిచోట్ల సర్వే బృందాలను అడ్డుకుని పోలీసులకు అప్పగిస్తున్నా వారిని వదిలిపెట్టాలంటూ అధికార పార్టీ నేతలు తీవ్రంగా ఒత్తిళ్లు తెస్తున్నారు.   

 – సాక్షి నెట్‌వర్క్‌

విపక్ష మద్దతుదారుల ఇళ్ల వద్దే సర్వే..
అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో పబ్లిక్‌ సర్వే పేరుతో జనవరి 25న వివరాలు సేకరిస్తున్న బెంగళూరుకు చెందిన యువకులను వైఎస్సార్‌సీపీ నాయకులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. కొత్తచెరువు, బుక్కపట్నం మండలాల్లో వీరంతా వారం రోజుల పాటు పలు గ్రామాల్లో తిరిగారు. వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల ఇళ్ల వద్దకు మాత్రమే వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. కొత్తచెరువులో సర్వే చేస్తున్న కొందరు యువకులను వైఎస్సార్‌ సీపీ నేతలు పోలీసులకు అప్పగించారు. గుంతకల్లులో డిసెంబర్‌ 18న రహస్యంగా సర్వే నిర్వహిస్తున్న 40 మంది సభ్యులను కూడా పోలీసులకు అప్పగించారు. హిందూపురంలో స్పార్క్‌ సోషియో పొలిటికల్‌ ఎనాలసిస్‌ అండ్‌ రిఫ్రెష్‌ సెంటర్‌ పేరిట టీడీపీ నాయకులే సర్వేలు నిర్వహిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ బూత్‌ కన్వీనర్లు, ప్రజలను ప్రభావితం చేసే నాయకుల వ్యక్తిగత వివరాలను సేకరిస్తున్నారు. హిందూపురంలో ఇద్దరు వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లకు నేరుగా ఫోన్‌ చేసి బెదిరిస్తూ బేరసారాలకు దిగడంతో పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అయితే ఎమ్మెల్యే బాలకృష్ణ ఒత్తిడి మేరకు సర్వే యువకులపై దాడి చేసినట్లు వైఎస్సార్‌సీపీ నాయకులపై కేసులు బనాయించారు. 

నరసాపురంలో ఆధార్‌ వివరాలు అడుగుతూ...
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఓటరు జాబితాలను సర్వే చేస్తున్న ఓ బృందాన్ని 3 నెలల క్రితం స్థానికులు అడ్డుకున్నారు. 60 మంది యువకులతో కూడిన ఈ బృందం పట్టణంలోని ఓ హోటల్‌లో వారం పాటు మకాం వేసింది. ఓటు ఎవరికి వేస్తారు? మీ కులం ఏమిటి? అని ఆరా తీయడంతోపాటు ఆధార్‌ వివరాలు సేకరిస్తుండటంతో అనుమానించిన స్థానికులు వారిని పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. భారత్‌ టెలీసర్వీస్‌ కంపెనీ నుంచి తాము సర్వే చేస్తున్నామని వారు పేర్కొన్నారు. వారిని విచారించిన అనంతరం పోలీసులు విడిచిపెట్టారు. 

సర్కారుకు వ్యతిరేకంగా సమాధానాలిస్తే ఓట్లు గల్లంతే
వైఎస్సార్‌ జిల్లా పాత కడపలో సర్వే పేరుతో ఓట్లు తొలగిస్తున్న నరేష్, రవి, జగదీష్, సురేష్, బాబు, అశోక్‌కుమార్‌ అనే ఆరుగురు యువకులను శుక్రవారం రాత్రి స్థానికులు పట్టుకున్నారు. వారి దగ్గరి నుంచి ట్యాబ్‌లు స్వాధీనం చేసుకొని పోలీసులకు అప్పగించారు. వీరంతా అనంతపురం జిల్లా కదిరి పట్టణానికి చెందినవారుగా చెబుతున్నారు. పబ్లిక్‌ పాలసీ రీసెర్చ్‌ గ్రూప్‌ తరపున సర్వే కోసం తమను నియమించారని, నెలకు రూ.15 వేలు చొప్పున జీతం ఇస్తామని చెప్పారని వారు పేర్కొంటున్నారు. వీరివద్ద ఎలాంటి గుర్తింపు కార్డులు లేవు. మూడు దశల్లో ఈ సర్వే సాగుతోంది. ఓటరు కార్డు నంబర్‌ చెబితే సంబంధిత వ్యక్తుల ఇంట్లో ఉన్న ఓటర్ల వివరాలు అందులో కనిపిస్తున్నాయి. ప్రభుత్వానికి అనుకూలంగా సమాధానాలు ఇవ్వని పక్షంలో మూడో దశలో వారి ఓట్లన్నీ తొలగించి నిష్క్రమిస్తున్నట్లు వెల్లడవుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్‌ ఓటమి భయంతోనే ఈ దొంగ సర్వేలు నిర్వహిస్తూ ఓట్లను తొలగిస్తున్నారని 1వ డివిజన్‌ కార్పొరేటర్‌ ఇసుకపల్లి చైతన్య, 47వ డివిజన్‌ కార్పొరేటర్‌  పాకా సురేష్‌కుమార్‌ ఆరోపించారు. గత ఎన్నికల్లో కడపలో వైఎస్సార్‌ సీపీకి అత్యధిక మెజార్టీ రావడంతో 1.25 లక్షల ఓట్లను తొలగించారన్నారు. ఓటర్ల జాబితా వివరాలు సర్వే బృందాలకు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. 

సర్వే చేసేందుకు వచ్చిన యువకులను చుట్టుముట్టిన వైఎస్సార్‌ జిల్లా చింతకుంట గ్రామస్తులు  

మైదుకూరు మండలంలో అడ్డుకున్న స్థానికులు..
వైఎస్సార్‌ జిల్లా మైదుకూరు నియోజకవర్గం దువ్వూరు మండలం చింతకుంట, బయపనల్లె, సంగటి తిమ్మాయపల్లె, మీర్జాఖాన్‌పల్లె తదితర గ్రామాల్లో పబ్లిక్‌ పాలసీ రీసెర్చ్‌ గ్రూప్‌ ఐడీ కార్డులతో సంచరించిన కొందరు యువకులు ట్యాబ్‌ల్లో వివరాలు నమోదు చేసేందుకు ప్రయత్నించడం శుక్రవారం కలకలం రేపింది. ట్యాబ్‌ల్లో ఓటర్ల వివరాలు ఉండటాన్ని గుర్తించిన స్థానికులు వారిని అడ్డుకున్నారు. తమ ఓట్లు తొలగించేందుకే గ్రామాల్లోకి వచ్చారని గ్రామస్తులు మండిపడ్డారు. సర్వే బృందాలను పంపిన కంపెనీ నిర్వాహకులు తమ గ్రామానికి వచ్చేవరకు వారిని విడిచిపెట్టబోమని హెచ్చరించారు. అయితే సాయంత్రం వరకు కంపెనీ ప్రతినిధులు ఎవరూ అక్కడకు రాకపోవడం గమనార్హం. ఒక్కో బూత్‌లో 25 మందిని సర్వే చేస్తే తమకు రూ.800 చొప్పున చెల్లిస్తారని సర్వే బృందం వెల్లడించింది. ఓటర్ల వివరాలన్నీ ట్యాబ్‌లో నిక్షిప్తం చేయడాన్ని మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డికి గ్రామస్తులు ఫోన్‌ ద్వారా తెలిపారు. 

ట్యాబ్‌ల్లో ఓటర్ల జాబితాలు...
వైఎస్సార్‌ జిల్లా సిద్దవటంలో సర్వే పేరుతో వ్యక్తిగత వివరాలు సేకరిస్తున్న కర్నూలు జిల్లా పత్తికొండకు చెందిన నరసింహులు అనే వ్యక్తిని స్థానికులు శుక్రవారం పోలీసులకు అప్పగించారు. పీపుల్స్‌ సర్వే పేరుతో ట్యాబ్‌తో తిరుగుతూ ఓటరు కార్డు, ఆధార్‌ కార్డు ఇవ్వాలని అడగడంతో అనుమానించిన గ్రామస్థులు అతడిని పోలీసులకు అప్పగించారు. ట్యాబ్‌లో సిద్దవటంకు చెందిన ఓటర్ల జాబితా మొత్తం ఉందని స్థానికులు తెలిపారు. 

ఏ పార్టీకి ఓటేస్తారంటూ ఆరా
రాజంపేట మండలం తాళ్లపాకలోనూ రెండురోజుల క్రితం ఇద్దరు యువకులు సర్వే పేరుతో ఇంటింటికి వెళ్లి ఫోన్‌ నంబర్, ఓటరు కార్డు వివరాలను సేకరించారు. ఏ పార్టీకి ఓటు వేస్తారంటూ ఆరా తీశారు. వీరి వ్యవహార శైలి అనుమానాస్పదంగా ఉండండంతో గ్రామస్తులు వారిని పోలీసులకు అప్పగించారు. తాళ్లపాక, ఎల్లాగడ్డతో పాటు పలు గ్రామాల్లో సర్వే బృందాలు సర్వే చేస్తున్నాయి. రాజంపేట పట్టణం మన్నూరులో వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులను గుర్తించి ఓట్లను తొలగించేందుకు సర్వే బృందాలు చేస్తున్న ప్రయత్నాలను స్థానికులు అడ్డుకున్నారు. 

కర్నూలులో బోగస్‌ సర్వే... 29 వేల ఓట్ల తొలగింపు! 
కర్నూలు జిల్లాలో వైఎస్సార్‌ సీపీ మద్దతుదారుల ఓట్ల తొలగింపే లక్ష్యంగా పలు నియోజకవర్గాల్లో బోగస్‌ సర్వేలు జరుగుతున్నాయి. ఎమ్మిగనూరుతోపాటు కడిమెట్ల, ఎర్రకోట, గుడేకల్, కొటేకల్‌ తదితర గ్రామాల్లో ముగ్గురు నలుగురితో కూడిన సర్వే బృందం సంచరిస్తోంది. వీరిని స్థానికులు అడ్డుకుని పోలీసులకు అప్పగించారు. సర్వే బృందాలు వివరాలను నమోదు చేసుకుంటున్న ట్యాబ్‌లలో ఓటర్ల తొలగింపు ఆప్షన్‌ ఉన్నట్లు సమాచారం. పత్తికొండ నియోజకవర్గం వెల్దుర్తి మండలం చెరుకులపాడు, గోవర్ధనగిరి, ఎల్‌.బండ, వెల్దుర్తి, రత్నపల్లె, బొమ్మిరెడ్డిపల్లె, కృష్ణగిరి మండలం టి.గోకులపాడు, ఎస్‌.హెచ్‌.ఎర్రగుడి, ఎరుకలి చెరువు గ్రామాల్లో బోగస్‌ సర్వేలు జరిగాయి. వెల్దుర్తి మండలంలో 12 వేల ఓట్లను తొలగించినట్లు తెలుస్తోంది. ఆలూరు నియోజకవర్గం హొళగుంద మండలం గజ్జహల్లి, హెబ్బటం గ్రామాల్లో నకిలీ సర్వే బృందాలను వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. హాలహర్వి మండలం నిట్రవట్టి గ్రామంలో బోగస్‌ సర్వే జరిగింది. మంత్రాలయం నియోజకవర్గం కౌతాళం మండలం రౌడూరు, కామవరంలోనూ నకిలీ బృందాలు సర్వే చేశాయి. ఆదోని, ఆళ్లగడ్డ నియోజకవర్గాల్లోనూ ఈ సర్వేలు జరిగాయి. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో బోగస్‌ సర్వేలతో 29 వేల ఓట్లను తొలగించినట్లు తెలుస్తోంది.

‘తూర్పు’ సర్వే బృందాల వద్ద టీడీపీ గుర్తింపు కార్డులు
విపక్షం ఓట్లను తొలగిస్తున్న ఓ బృందాన్ని తూర్పు గోదావరి జిల్లాలో పార్టీ శ్రేణులు నవంబరు 12వ తేదీన అడ్డుకున్నాయి. అంబాజీపేట, రాజోలు మండలాల్లోని మాచవరం, వాకలగరవు గ్రామాల్లో 11 మంది యువకులు రెండు బృందాలుగా సర్వే నిర్వహించారు. మాచవరం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఆరుగురు యువకులను  వైఎస్సార్‌సీపీ నేతలు నిలదీయడంతో ‘సోషియో పొలిటికల్‌ ఎనాలసిస్‌’ (స్పా) సంస్థ నుంచి వచ్చినట్లు వెల్లడించారు. వారిని గుర్తింపు కార్డులు చూపాలని కోరడంతో జి.సాయి, గణేష్, నరేంద్ర, రాహుల్‌ మణికంఠ, వెంకటేశ్వరరావులుగా పేర్లు చెప్పుకున్న వ్యక్తులు పొంతనలేని సమాధానాలిచ్చారు. వారి వెంట వచ్చిన మిగతావారు జారుకోవడంతో అనుమానించిన స్థానికులు ఈ బృందాన్ని అంబాజీపేట పోలీస్‌ స్టేషన్‌లో అప్పగించి ఫిర్యాదు చేశారు. వారు ఇచ్చిన సమాచారం మేరకు తాటిపాకలోని సాయితేజ లాడ్డిలో తనిఖీలు చేయగా ‘స్పా’ బృంద సభ్యులు అక్కడ ఉన్నట్లు గుర్తించారు. వారి వద్ద టీడీపీ సభ్యత్వ గుర్తింపు కార్డులు, ల్యాప్‌ట్యాప్, ట్యాబ్‌లు బయట పడటం గమనార్హం. ఈ సర్వే ఎందుకు నిర్వహిస్తున్నారని ప్రశ్నించడంతో ఓ వ్యక్తి పరారైనట్లు వైఎస్సార్‌ సీపీ కో ఆర్డినేటర్‌ కొండేటి చిట్టిబాబు తెలిపారు. 

గుంటూరు జిల్లాలో 4 నెలలుగా సంచారం...
వైఎస్సార్‌ సీపీ అభిమానుల ఓట్ల తొలగింపే లక్ష్యంగా గుంటూరు జిల్లాలో గత నాలుగు నెలలుగా సర్వే బృందాలు తిరుగుతున్నాయి. గత ఏడాది అక్టోబర్‌లో సర్వే పేరుతో విపక్షం ఓట్లను తొలగిస్తున్న స్పా (సెంటర్‌ ఫర్‌ సోషియో పొలిటికల్‌ ఎనాలసిస్‌) బృందం సభ్యులు గుంటూరు తూర్పు, మంగళగిరి, పెదకూరపాడు, తెనాలి, వినుకొండ నియోజకవర్గాల్లో పట్టుబడ్డారు. అయితే ఆ మరుసటి రోజే పోలీసులు వారిని వదిలేశారు.  తెనాలి నియోజకవర్గం సంగంజాగర్లమూడిలో సర్వేల పేరుతో ఓట్లు తొలగిస్తున్న స్పా సంస్థ సభ్యులను పట్టుకుని ప్రశ్నించిన వైఎస్సార్‌ సీపీ నాయకులపై గత నవంబర్‌ నెలలో కేసులు నమోదు చేయడం గమనార్హం.

వాట్సాప్‌ డీపీలో లోకేష్‌ ఫొటో : ‘స్పా’ సంస్థ తరఫున సర్వే చేస్తున్న యువకుల వాట్సప్‌ గ్రూప్‌లో మంత్రి నారా లోకేష్‌ ఫొటో డీపీగా ఉండటం గమనార్హం. ఇటీవల గురజాల నియోజకవర్గం జంగమహేశ్వరపురంలో సర్వే పేరుతో వివరాలు సేకరిస్తున్న టీడీపీ బూత్‌ కమిటీ సభ్యుడు యలమందను స్థానికులు అడ్డుకున్నారు. అతడిని ప్రశ్నించిన వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి యెనుముల మురళీధర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ అమరారెడ్డితో పాటు మరో ఇద్దరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయడం గమనార్హం.

నోట్‌బుక్‌లో టీడీపీ కార్యకర్తల వివరాలు...
యూట్యూబ్‌ చానల్‌ సర్వే పేరుతో శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం బ్రహ్మదేవిలో ఇల్లిల్లూ తిరుగుతూ సర్వే చేస్తున్న ముగ్గురు వ్యక్తులను వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు శుక్రవారం అడ్డుకున్నారు. సోషల్‌ సర్వేయర్‌ పేరుతో చింతాల అనీల్‌కుమార్‌ అనే యువకుడు వివరాలు సేకరిస్తున్నట్లు గుర్తించారు. అయితే అతడి వద్ద ఉన్న నోట్‌బుక్‌ను పరిశీలించగా అందులో టీడీపీ కార్యకర్తల పేర్లు మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. దీంతో అనుమానించిన వైఎస్సార్‌ సీపీ మండల బూత్‌ కమిటీ కన్వీనర్‌ షేక్‌ మస్తాన్, కోఆప్షన్‌ సభ్యుడు బషీర్‌లు అతడిని స్థానిక పోలీసు స్టేషన్‌లో అప్పగించారు. గ్రామాల్లో అనుమానాస్పదంగా సంచరించవద్దని పోలీసులు అతడిని హెచ్చరించి పంపేశారు.

ఎన్డీటీవీ తరపున అంటూ... : గతేడాది నవంబర్‌ 1వ తేదీన ఇదే జిల్లా మనుబోలు మండలం మడమనూరు గ్రామంలో ఎన్డీటీవీ తరపున ఎన్నికల సర్వే నిర్వహిస్తున్నట్లు చెప్పుకుంటున్న నూర్‌అహ్మద్‌ అనే వ్యక్తి ఆధార్, ఓటరు గుర్తింపు కార్డు వివరాలను నమోదు చేస్తుండటంతో అనుమానించిన వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు పార్టీ నేత ఆనం రాంనారాయణరెడ్డి సూచనల మేరకు పోలీసులకు అప్పగించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement