
హైదరాబాద్ : ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం మధ్యాహ్నం రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. ఆంధ్రప్రదేశ్ ఓటర్ల జాబితా నుంచి అక్రమంగా ఓట్ల తొలగింపు, అవకతవకలపై ఆయన ఈ సందర్భంగా గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. అలాగే పోలీస్ అధికారుల నియామకాల్లోనూ అధికార దుర్వినియోగంపై వైఎస్ జగన్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. వైఎస్ జగన్‌తో పాటు గవర్నర్‌ను కలిసినవారిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు విజయసాయిరెడ్డి, ధర్మాన ప్రసాదరావు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తదితరులు ఉన్నారు.
కాగా ఎన్నికలు సజావుగా జరగాలంటే డీజీపీ ఠాకుర్, ఇంటెలిజెన్స్ ఐజీ వెంకటేశ్వరరావు, డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్‌రావును వెంటనే బదిలీ చేయాలని కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈసీ) సునీల్ అరోరాను ఢిల్లీలో వైఎస్ జగన్ కోరిన విషయం తెలిసిందే.