
సాక్షి, తిరుమల: టీటీడీ దాతల నకిలీ పాస్ పుస్తకాల కుంభకోణం మరువకముందే.. రూ.300 నకిలీ టికెట్ల ఉదంతం బయటపడింది. ముంబైకి చెందిన 192 మంది భక్తులు బుధవారం తిరుమలకు వచ్చారు. అందరూ రూ.300 దర్శనం టికెట్లతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోకి చేరుకున్నారు. విజిలెన్స్ స్కానింగ్ కేంద్రంలో టికెట్లపై బార్‌కోడ్‌ను తనిఖీ చేయగా.. 4 టికెట్లు మినహా మిగిలిన 188 టికెట్లు నకిలీవని తేలింది. దీంతో వారిని శ్రీవారి దర్శనానికి అనుమతించలేదు. వీరిని తీసుకొచ్చిన ముంబైకి చెందిన ప్రశాంత్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. టీటీడీ సీవీఎస్‌వో రవికృష్ణ మాట్లాడుతూ.. ప్రశాంత్‌పై క్రిమినల్ కేసు నమోదు చేస్తామని తెలిపారు. ముంబై భక్తుల తప్పేమీ లేదన్నారు. విజిలిన్స్ తనిఖీలు, బార్‌కోడింగ్ వ్యవస్థ పటిష్టంగా ఉండటం వల్లే నకిలీ టికెట్లను గుర్తించగలిగామన్నారు. సమావేశంలో వీఎస్‌వోలు సదాలక్ష్మి, రవీంద్రారెడ్డి పాల్గొన్నారు.
17 నుంచి సుప్రభాతం రద్దు..
శ్రీవారి ఆలయంలో పవిత్రమైన ధనుర్మాసం పూజలు ఈనెల 16 నుంచి 2018 జనవరి 14 వరకు జరగనున్నాయి. 17 నుంచి శ్రీవారికి సుప్రభాతం బదులు గోదాదేవి విరచిత తిరుప్పావై పాశురాలు పారాయణం చేయనున్నారు. రోజుకొకటి చొప్పున నెలరోజుల పాటు మొత్తం 30 పాసురాలు వేద పండితులు పారాయణం చేయనున్నారు. ఈ నెల రోజులు గర్భాలయంలో భోగ శ్రీనివాసమూర్తికి బదులుగా శ్రీకృష్ణస్వామి వారికి నిత్య కైంకర్యాలు నిర్వహిస్తారు. ధనుర్మాసం అంటే దివ్యప్రార్థనకు అనువైన మాసమని అర్థం. ఆండాల్ అమ్మవారి పూజ, తిరుప్పావై పఠనం, గోదా కల్యాణం ప్రసాదాలు ధనుర్మాసంలోనే నిర్వహిస్తారు. 2018 జనవరి 15 నుంచి యథావిధిగా సుప్రభాత సేవ పునఃప్రారంభిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment