ధర్మవరం: ‘ఓటు వేసి గెలిపించిన ప్రజల సంక్షేమానికి ఎలాంటి చర్యలూ చేపట్టలేదు! ప్రజాక్షేత్రంలోకి వెళితే తిరస్కరణ తప్పదు’ అని భావించిన ధర్మవరం అధికార పార్టీ నేతలు.. ఈ సారి ఎన్నికల్లో అధికారం దక్కించుకునేందుకు కొత్త ఎత్తుగడలకు శ్రీకారం చుట్టారు. నకిలీ ఓటర్లను సృష్టించి మరోసారి గద్దెనెక్కేందుకు అనైతిక పనులకు తెరలేపారు. ఇందులో భాగంగానే తమ మాట వినని బూత్ లెవల్ ఆఫీసర్ (బీఎల్‌ఓ)లపై కక్ష సాధింపులు మొదలు పెట్టారు. వారికి పని రాదంటూ పొగపెట్టి సాగనంపసాగారు.
బీఎల్‌వోలుగా చిరుద్యోగులు
ధర్మవరం నియోజకవర్గ పరిధిలో ధర్మవరం మున్సిపాలిటీ, ధర్మవరం మండలం, ముదిగుబ్బ, బత్తలపల్లి, తాడిమర్రి మండలాల పరిధిలో మొత్తం 285 పోలింగ్ బూత్‌లున్నాయి. వీటి పరిధిలో మొత్తం 285 మంది బీఎల్‌ఓలు ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పని చేస్తున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా దాదాపు అన్ని ప్రాంతాల్లో అంగన్‌వాడీ టీచర్లు, ఆశ వర్కర్లు, వీఆర్‌ఓలు, వీఆర్‌ఏలు బూత్‌లెవల్ ఆఫీసర్లుగా వ్యవహరిస్తున్నారు. నూతన ఓటర్లను గుర్తించి, ఓటరు జాబితాలో వారిని చేర్చడం. గ్రామంలో లేని వారిని, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారిని ఓటరు జాబితా నుంచి తొలగించడం చేస్తుంటారు.
వేధింపులతో వైదొలిగిస్తూ..
ఎన్నికలు సమీపిస్తుండటంతో బూత్ లెవల్ ఆఫీసర్లపై అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు ఎక్కువయ్యాయి. తమకు అనుకూలంగా ఉన్న వారిని ఓటరు జాబితాలో చేర్చేందుకు, గ్రామాలు వదిలి వెళ్లిన వారి పేర్లను జాబితాలో కొనసాగించేందుకు దిగజారుడు రాజకీయాలకు తెరలేపారు. అదే సమయంలో తమకు ఓటు వేయని వారిని జాబితా నుంచి తొలగించేందుకు బీఎల్‌వోలపై ఒత్తిళ్లు తీసుకెళ్లసాగారు. తమమాట వినకపోతే బెదిరింపులకు దిగుతున్నారు. ధిక్కరించిన వారిపై వేధింపులు మొదలు పెట్టారు. చివరకు బలవంతంగా వారిని ఉన్నతాధికారుల ఎదుట హాజరు పరిచి బీఎల్‌ఓగా పనిచేయడం తమకిష్టం లేదంటూ సంతకాలు పెట్టించుకుని, వారి స్థానంలో తమకు అనుకూలంగా ఉన్నవారిని నియమించుకోసాగారు. ఇలా ధర్మవరం మున్సిపాలిటీలో వంద మంది బీఎల్‌వోలు ఉండగా వారిలో 12 మందితో తమకు పనిరాదనే సాకును బలవంతంగా వారితోనే చెప్పించి విధుల నుంచి తప్పించారు.
నకిలీ ఓటర్ల చేర్పులకు టార్గెట్
ఓటర్ల చేర్పులు, తొలగింపు వ్యవహారంలో అధికారపార్టీ నేతలు అక్రమాలకు తెరలేపారు. తమ మాట వినని బీఎల్‌వోలను, ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్‌ను ఇప్పటికే ఇక్కడి నుంచి బలవంతంగా పంపేశారు. తిరిగి తమకు అనుకూలమైన వారిని ఆయా పోస్టులో కూర్చోబెట్టి నకిలీ ఓటర్లను చేర్చేందుకు వ్యూహం పన్నారు. ఒక్కొక్కరు వంద నుంచి, రెండు వందల ఓటర్లను చేర్చించాలని దిగువస్థాయి నాయకులకు «టార్గెట్లు విధించినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో సదరు దిగువస్థాయి నాయకులు తమకు అనుకూలంగా ఉండి, ఇతర ప్రాంతాల్లో ఉన్నవారివి, ధర్మవరం పట్టణానికి వలస వచ్చిన ఇతర రాష్ట్రాలకు చెందిన వారి వివరాలు సేకరించి ఓటర్లుగా నమోదు చేయించే పనిలో ఉన్నారు. అయితే ఈ వ్యవహారంలో బీఎల్‌వోలది కీలక పాత్ర.. వారు అనుకూలంగా వ్యవహరిస్తేనే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగల్గుతారు. వారు వ్యతిరేకిస్తే తమ పని జరగదని భావించిన అధికార పార్టీ నేతలు ఈ తొలగింపుల పర్వానికి తెరలేపారు.
Comments
Please login to add a commentAdd a comment