అగనంపూడిలోని సీహెచ్‌సీ
అగనంపూడి: పారిశ్రామిక ప్రాంత రోగుల పాలిట సంజీవని, మినీ ఘోషాసుపత్రిగా పేరొందిన అగనంపూడి సీహెచ్‌సీ స్థాయి పెంచుతాం... పరిసర ప్రాంతాల్లోనిప్రజలందరికీ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొస్తాం... అని గతంలో పల్లా శ్రీనివాసరావు ఓ హామీ ఇచ్చేశారు. అనంతరం ఆ విషయమే మరిచిపోయారు. ఇంతలో ఎన్నికలు సమీపిస్తుండడంతో హడావుడిగా ఓ జీవో తీసుకొచ్చేలా ప్రభుత్వంలో మంత్రాంగం నడిపారు. ఇంకేముంది ఘనత వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఓ జీవో జారీ చేసేశారు.
స్థానిక సీహెచ్‌సీని ఏరియా ఆస్పత్రిగా మారుస్తున్నామని ప్రకటించేశారు. అంతేతప్ప ఏరియా ఆస్పత్రిగా మారిస్తే ఎంత మంది వైద్యులు అవసరం, ఇతర సిబ్బంది నియామకం, వసతులు, ల్యాబొరేటరీ కల్పన తదితర అంశాలను మాత్రం పట్టించుకోలేదు. సరిగ్గా ఎన్నికల నోటిఫికేషన్‌కు 25 రోజుల ముందు తీసుకొచ్చిన ఈ జీవోపై అగనంపూడి, పరిసర ప్రాంతాల ప్రజలు మండిపడుతున్నారు. మళ్లీ మాయ జీవోలతో ఓట్లు దండుకునేందుకు టీడీపీ నాయకులు డ్రామాలాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఓట్ల కోసం హడావుడిగా జీవో జారీ
ప్రస్తుతమున్న సీహెచ్‌సీలో పూర్తిస్థాయి వసతులు లేకపోవడంతో పరిసర ప్రాంతాల వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసరమైతే ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించిన వేలాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఆర్థిక స్థోమత లేనివారు నగరంలోని కేజీహెచ్‌కు పరుగులు తీస్తున్నారు. ఈ పరిస్థితుల్లో స్థానిక సీహెచ్‌సీని ఏరియా ఆస్పత్రిగా మారిస్తే అందరికీ ప్రయోజనకరంగా ఉంటుందనే డిమాండ్ ఏళ్ల తరబడి ఉంది. ప్రస్తుతం సీహెచ్‌సీలో డాక్లర్టు 8 మంది, నర్సులు 9 మంది, ఫార్మాసిస్టు ఒకరు, జూనియర్ అసిస్టెంట్ ఒకరు, ల్యాబ్ అసిస్టెంట్ ఒకరు ఉన్నారు.
వీరితోపాటు అవుట్ సోర్సింగ్‌లో తీసుకున్న కాంట్రాక్ట్ సిబ్బంది 15 మంది పనిచేస్తున్నారు. దీన్ని ఏరియా ఆస్పత్రిగా మార్చేశామంటూ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుతోసహా టీడీపీ నాయకులంతా బాజా మోగిస్తున్నారు. అయితే కనీస చర్యలు చేపట్టకపోవడంతో ఈ ఉత్తర్వులు కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే ఇచ్చారని స్థానికులు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 28 ఆస్పత్రుల స్థాయి పెంచుతూ అగనంపూడిని కూడా ఆ జాబితాలో చేర్చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుకు చిత్తశుద్ధి ఉంటే సిబ్బంది పెంచడం లేదా సౌకర్యాలు కల్పించడానికి కృషి చేసేవారంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment