పిట్టలవానిపాలెం: గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుల ఆగడాలకు హద్దూపద్దూ లేకుండా పోతోంది. ఎన్నికలలో తమకు మద్దతు పలకలేదని ప్రత్యర్థి వర్గానికి చెందినవారిన గ్రామబహిష్కరణ చేయడానికి తెగబడుతున్నారు. గుంటూరు జిల్లా పిట్టలవానిపాలెం మండలం అల్లూరు శివారు రెడ్డిపాలెంలో పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారునికి ఓట్లు వేయలేదని అయిదు కుటుంబాలను వెలేశారు. బాధితులు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. అల్లూరు గ్రామంలో కాంగ్రెస్ మద్దతుదారుడిపై వైఎస్ఆర్ సిపి మద్దతుదారుడు స్పర్పంచ్గా గెలిచారు.
గ్రామపెద్దలు కాంగ్రెస్ మద్దతుదారులు కావడంతో తమ అభ్యర్థికి మద్దతు పలకలేదని అయిదు కుటుంబాలను వేధించడం మొదలు పెట్టారు. గ్రామం వదిలి వెళ్లిపోవాలని బెదిరిస్తున్నారు. ఈ పరిస్థితిలో బాధితులు పిట్టు శివారెడ్డి, పులుగు ఏడుకొండలు రెడ్డి, అక్కల నరసారెడ్డి, చీరాల సుబ్బారెడ్డి, చీరాల నారాయణ రెడ్డి జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. దుకాణాల్లో నిత్యావసర వస్తువులు సైతం తమకు అమ్మడంలేదని వారు తెలిపారు. తమతో ఎవరూ మాట్లాడకూడదని ఆంక్షలు విధించినట్లు వారు వాపోయారు. దీంతో మనస్థాపానికి గురైన అక్కల నరసారెడ్డి ఈ నెల 16వ తేదీన పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబ సభ్యులు అతనిని పొన్నూరులోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు కుమారుడు చంద్రశేఖర రెడ్డి చెప్పారు.
గ్రామంలో తమపై విధించిన ఆంక్షలను ఎత్తివేయించాలని, తమకు రక్షణ కల్పించాలని కోరుతూ బాధితులు జిల్లా కలెక్టర్ సురేష్ కుమార్, తెనాలి ఆర్టీఓ శ్రీనివాసమూర్తి, బాపట్ల డిఎస్పి భాస్కర్లకు లేఖలు రాశారు.