కాపురాల్లో చిచ్చుపెట్టుకోవద్దు
ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్‌లో పలువురు దంపతులకు కౌన్సెలింగ్
గుంటూరు క్రైం: మనస్పర్థల కారణంగా పచ్చని కాపురాలను విచ్ఛిన్నం చేసుకోవద్దని విశ్రాంత ఏఎస్పీ తుపాకుల వెంకటేశ్వర్లు చెప్పారు. స్థానిక నగరంపాలెంలోని ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్‌లో శనివారం కౌన్సెలింగ్ నిర్వహించి పలువురు భార్యాభర్తలను ఒక్కటి చేశారు. ఈ సందర్భంగా విశ్రాంత ఏఎస్పీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ చిన్నచిన్న కారణాలతో జీవితాలను అంధకారం చేసుకుంటున్నవారు సమాజంలో ఎక్కవగా వున్నరన్నారు. ఒకరికి కోపం వస్తే మరొకరు ప్రశాంతంగా వుంటే గొడవలు లేకుండా సజావుగా కాపురం చేసుకోవచ్చని తెలిపారు. పిల్లల భవిష్యత్తును ప్రతి తల్లిదండ్రలు గుర్తుంచుకొని సర్దుకుపోవడం అలవరుచుకోవాలని హితవు పలికారు. క్షణికావేశ కారణాల వల్ల కొన్ని కాపురాల్లో సమస్యలు వస్తుంటే, మరికొన్ని కాపురాల్లో ఒకరి కంటే మరొకరు గొప్ప అనే భావనతో సమస్యలు తలెత్తుతున్నాయని వివరించారు.
నాలుగు బృందాలుగా ఏర్పడిన కౌన్సెలర్లు భార్యాభర్తల మధ్య తలెత్తిన వివాదాల్లో ఇద్దరికీ సర్దిచెప్పి ఒక్కటి చేయడంలో నిమగ్నమయ్యారు. మంగళగిరికి చెందిన వెంకటేశ్వరమ్మ తన భర్త వేధింపులకు గురిచేస్తున్నాడని ఫిర్యాదు చేయడంతో దంపతులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. తన భర్త కట్నం వేధింపులకు పాల్పడుతున్నాడని నెహ్రూనగర్‌కు చెందిన నాగమణి ఫిర్యాదుచేయగా.. భార్యాభర్తలకు కౌన్సెలింగ్ ఇచ్చి కాపురాన్ని చక్కదిద్దారు. కౌన్సెలర్లు రిటైర్డ్ ఏఎస్పీ ఠాగూర్, రెహమాన్, శ్రీనివాసరావు, మహిళా పోలీస్‌స్టేషన్ సీఐ పూర్ణచంద్రరావు, సీతామహాలక్ష్మి, సంజయ్, నూర్జహాన్, సుజాత, హనుమంతరావు, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
ఏఎస్పీ అకస్మిక తనిఖీ..
ఫామిలీ కౌన్సెలింగ్ సెంటర్‌ను ఏఎస్పీ జె.భాస్కరరావు అకస్మికంగా తనిఖీచేశారు. కౌన్సెలింగ్ కోసం వేచివున్న బాధితులు, వారి బంధువుల వివరాలు అడిగి తెలసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కౌన్సెలింగ్ సెంటర్‌లో కౌన్సెలర్ల సూచనలు పాటిస్తూ కాపురాలను చక్కదిద్దుకోవాలని ఏఎస్పీ సూచించారు. కౌన్సెలింగ్ ద్వారా సమస్యలు పరిష్కారం కాకుంటే సంబంధిత ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి నిజమైన నిందితులను అరెస్టు చేసి బాధితులకు న్యాయం చేస్తామని ఏఎస్పీ భాస్కరరావు హామీఇచ్చారు.