మంచానికి పరిమితమైన పంచాయతీ కార్మికుడు పాపన్న , అన్నం తినిపిస్తున్న భార్య లక్ష్మి
పెద్దలిచ్చిన ఆస్తిపాస్తులు లేవు..పెద్ద కుటుంబమేమీ కాదు..కూలి పని చేస్తే రోజు గడుస్తుంది..లేదంటే పస్తులతో కాలం వెళ్లదీయాల్సిందే..ఉన్నదాంట్లో సర్దుకుపోతున్న తరుణంలో కుటుంబ పెద్దకు పెద్ద కష్టమొచ్చింది. మతిస్థిమితం కోల్పోవడంతోపాటు కాళ్లు విరిగి మంచానికే పరిమితమయ్యాడు. సహచరి ధైర్యాన్ని కోల్పోకుండా భర్త కోసం రెక్కల కష్టాన్ని నమ్ముకుంది. ఎప్పటికైనా మంచి రోజులు వస్తాయనే ఆశతో ఆమె పోరాటం చేస్తోంది. ఇటీవల చిన్న కుమారుడు కూడా అస్వస్థతకు గురయ్యాడు. దీంతో ఆమె దుఃఖాన్ని దిగమింగి.. గుండె దిటువు చేసుకుంది. ఏ దేవుడైనా రాకపోతాడా.. తమను ఆశీర్వదించకపోతాడా అనే ఆశతో ఆమె బతుకుతోంది. పత్తికొండలోని మడ్డిగేరికి చెందిన లక్ష్మీ దేవి కుటుంబం దీనగాథ ఇది..
కర్నూలు, పత్తికొండ రూరల్: పత్తికొండ మేజర్ గ్రామపంచాయతీలో కాంట్రాక్టు పారిశుద్ధ్ద్య కార్మికుడుగా పాపన్న పనిచేస్తుండే వాడు. పూరిగుడిసెలో నివాసం ఉంటున్న పాపన్న, లక్ష్మీ దంపతులకు కుమార్, కుమారి, పుల్లన్న సంతానం. పెద్దకుమారుడైన కుమార్ ఆరేళ్ల కిందటే వివాహం చేసుకుని వేరుగా కాపురం ఉంటున్నాడు. పంచాయతీ కార్మికుడుగా ఉన్న పాపన్న 2011లో పక్షవాతానికి గురయ్యాడు. ఆదోని, కర్నూలు ఆసుపత్రుల్లో సుమారు రూ.2లక్షల వరకు ఖర్చుచేసి వైద్యం చేయించినా వ్యాధి నయం కాలేదు. మెదడులో సమస్య ఉందని కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యులు ధ్రువీకరించారు. మతిస్థిమితం కూడా కోల్పోయి వీధిలో వెళ్తున్న పాపన్నను పరిగెత్తుకుంటూ వెళ్తున్న గుర్రాలు తగిలాయి. దీంతో ఆయన కాళ్లు విరిగి ఏడేళ్లుగా లేవలేని స్థితిలో మంచం పట్టాడు. ఎప్పుడూ పడుకునే ఉండడం వల్ల చర్మం కూడా దెబ్బతిని కుళ్లిపోతోంది. పాపన్నకు మెదడు చికిత్సతో పాటు కుళ్లిపోయిన చర్మవ్యాధికి ఆధునిక వైద్యంకోసం సుమారు రూ.10 లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు సూచించారు. అంతభారం భరించలేమని కుటుంబ సభ్యులు నిట్టూర్చారు. సంసారాన్ని అతికష్టంపై నెట్టుకొస్తున్న పాపన్న భార్య లక్ష్మి...నాలుగేళ్ల క్రితం రూ.లక్ష వరకు అప్పుచేసి కుమార్తె కుమారి వివాహం చేసింది. ప్రస్తుతం కనీసం నడవలేని స్థితిలో పాపన్న మంచానికే పరిమితమయ్యాడు. వైద్యం చేయించడం చేతకాక దేవుడిపై భారం వేసి దయగల మారాజుల వైద్యసాయం కోసం దీనంగా ఎదురుచూస్తున్నారు.
చిన్నకుమారుడు పుల్లన్నకు కిడ్నీలో రాళ్లు
పాపన్న చిన్నకుమారుడైన పుల్లన్న బేల్దారి పనిచేసుకుంటూ కుటుంబానికి ఆసరాగా ఉంటున్నాడు. అయితే పుల్లన్నకు కిడ్నీలో రాళ్లు అని వైద్యులు తేల్చడంతో మూలిగే నక్కపై తాటికాయ పడినట్లయింది. బరువుపని చేస్తే ఆరోగ్యం మరింత దెబ్బతింటుందని వైద్యులు సూచించారు. దీంతో ఆభారం కూడా ఆ తల్లిపైనే పడింది.
దాతల్లారా దీవించండి
నా భర్త లేవలేడు..కూర్చోలేడు.. నడవడం కూడా చేతకాదు.. మంచానికి పరిమితమైపోవడంతో అన్నీ నేనే చూసుకోవాల్సి వస్తోంది. కూలి పనులు చేసుకుని బతకడమే కష్టంగా ఉన్న మాకు వైద్యం చేయించుకునే స్థోమత లేదు. మానవత్వం ఉన్న మారాజులు స్పందించి చేయూతనందిస్తే నా భర్త ప్రాణాలతో బయటపడే అవకాశం ఉంది. – దుడ్డు లక్ష్మి
పాపన్న భార్య దుడ్డు లక్ష్మి, ఎస్‌బీఐ అకౌంటు నంబరు : 37881191962 ,ఐఎఫ్‌ఎస్‌సి కోడ్ ఎస్‌బిఐఎన్0000981 సంప్రదించాల్సిన సెల్ : 9666332260
Comments
Please login to add a commentAdd a comment