వాటికన్నా ముఖ్యమైన అంశముందా?
రైతు, డ్వాక్రా రుణ మాఫీలపై వాయిదా తీర్మానమిచ్చిన వైఎస్సార్ సీపీ
చర్చ కోసం పట్టు: అనుమతించని స్పీకర్
హైదరాబాద్: ‘రైతు, డ్వాక్రా రుణాల మాఫీ కంటే ముఖ్యమైన అంశం ఏమైనా ఉందా? రైతులు, డ్వాక్రా అక్కచెల్లెమ్మలు అవస్థలు పడుతుంటే.. రుణమాఫీ మీద చర్చించకుంటే ఎలా? ఈ నెల 10న 344 నిబంధన కింద రైతు, డ్వాక్రా రుణాల మాఫీ అంశంపై చర్చకు నోటీసిచ్చాం. ఈ అంశం మీద చర్చ జరగాలని బీఏసీ సమావేశంలో చెప్పాం. అదేమిటని అడిగితే.. మేం(విపక్షం) సభలో లేనప్పుడు చర్చించామంటారు. మేం సభలో లేనప్పుడు.. అన్నీ అబద్ధాలతో సీఎం ప్రకటన చేసి, మీకు మీరే(అధికార పక్షమే) మాట్లాడుకుంటే సరిపోతుందా? విపక్షం లేకుండా మీరే మాట్లాడుకుని చర్చ అయిపోయిందనడం సరైన పద్ధతేనా?’ అని విపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీలో గురువారం ప్రశ్నించారు.
రైతులు, డ్వాక్రా రుణాల మాఫీపై చర్చించాలని కోరుతూ.. విపక్షం వాయిదా తీర్మానం ఇచ్చింది. గురువారం సభ ప్రారంభంకాగానే ఈ తీర్మానాన్ని తిరస్కరించినట్టు స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావు ప్రకటించారు. దాంతో విపక్ష సభ్యులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. ‘5 కోట్ల మంది ప్రజలు సభా సమావేశాలను చూస్తున్నారు. చిత్తశుద్ధి ఉంటే రుణమాఫీపై చర్చకు రావాలి. చర్చకు ప్రభుత్వం ఎందుకు భయపడుతోందో అర్థం కావడం లేదు. ప్రజల ఆవేదన గురించి పట్టించుకోకుంటే ఎలా? రైతులు, డ్వాక్రా మహిళలు ఏమైనా ఫర్వాలేదా? వారి చావు వారు చావాల్సిందేనా? మనకు బాధ్యత లేదా? ప్రజల సమస్యలు మాట్లాడడానికే ఈ సమావేశాలకు వచ్చాం. సీఎం నోరు తెరిస్తే అబద్ధాలు చెబుతారు. రూ.86 వేల కోట్ల రుణాలు ఉండగా, 2014-15లో రుణమాఫీకి ప్రభుత్వం ఇచ్చింది రూ.4,600 కోట్లు. రైతుల రుణాలు వడ్డీలతో తడిసి మోపెడై రూ.99 వేల కోట్లకుపైగా పెరిగాయి. 2015-16 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం కేటాయించింది రూ.2,100 కోట్లు. ప్రభుత్వం కేటాయించింది వడ్డీలకే సరిపోదు. రైతుల కంటే ముఖ్యమైన అంశం మరొకటి ఉంటుందా? రుణం కోసం బ్యాంకుల గడప కూడా రైతులు తొక్కలేకపోతున్నారు. అప్పు పుట్టక అల్లాడిపోతున్నారు. ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చినా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రైతులు, డ్వాక్రా అక్కచెల్లెమ్మల మీద కనికరం చూపించండి’ అని కోరారు.
స్పందించని స్పీకర్..
రుణమాఫీపై చర్చించాలని విపక్ష నేత వైఎస్ జగన్ చేసిన విజ్ఞప్తికి స్పీకర్ కోడెల శివప్రసాదరావు సానుకూలంగా స్పందించలేదు. అయినప్పటికీ అత్యం త ముఖ్యమైన దీనిపై చర్చకు అనుమతించాలంటూ విపక్ష సభ్యులు పట్టుబట్టారు. రుణమాఫీ అంశంపై సీఎం ఇప్పటికే ప్రకటన చేశారని, చర్చ కూడా జరిగిందని ఈ సందర్భంగా స్పీకర్ చెప్పారు. సభ నుంచి వెళ్లమని విపక్షానికి ఎవరూ చెప్పలేదన్నారు. హాయిగా సభలో ఉండాల్సిందన్నారు. చర్చ జరిగి న అంశంపై మళ్లీ చర్చకు అనుమతించే సంప్రదాయం లేదన్నారు. దీంతో వైఎస్సార్ సీపీ సభ్యులు.. స్పీకర్ పోడి యం వద్ద నిలబడి నినాదాలు చేశారు. వారి నినాదాలు కొనసాగుతుండగానే.. అధికార పక్షానికి చెందిన కాలవ శ్రీనివాసులు, ధూళిపాళ్ల నరేంద్రలు విపక్షంపై విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో 9.15 గంటలకు స్పీకర్ సభను వాయిదా వేశారు.